అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆస్ట్రేలియా ప్రభుత్వ అంతర్జాతీయ విద్య, పౌరసత్వం, కస్టమ్స్, బహుళ సాంస్కృతిక వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జూలియన్ హిల్ తమ ప్రతినిధి బృందంతో కలిసి శనివారం రాజధాని అమరావతిలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా బృందం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఆస్ట్రేలియా ప్రతినిధి బృందానికి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి TG భరత్, APCRDA కమిషనర్ వి.విజయ రామరాజు ఐఏఎస్, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా, అమరావతి అభివృద్ధి ప్రణాళికలను తెలుసుకోవడంతో పాటు, ముఖ్యంగా విద్యా రంగంలో భవిష్యత్ సహకార అవకాశాలపై APCRDA అధికారులతో ఆస్ట్రేలియా బృందం చర్చలు జరిపారు.
కమిషనర్ గారు.. APCRDA ప్రధాన కార్యాలయంలోని అమరావతి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(AICCC)లో..అమరావతి విజన్, విస్తృత నగర ప్రణాళిక, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులను ఆస్ట్రేలియా బృందానికి సమగ్రంగా వివరించారు. APCRDA ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న అత్యాధునిక డిజిటల్ ట్విన్ ప్లాట్‌ఫామ్ ద్వారా అమరావతి మాస్టర్ ప్లాన్, ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, నగర అభివృద్ధిలో అనుసరిస్తున్న నూతన సాంకేతిక విధానాలు, భవిష్యత్ ప్రణాళికలను ఆస్ట్రేలియా బృందానికి వివరించారు.
తదుపరి అడిషనల్ కమిషనర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఐఏఎస్ ..అమరావతిలో ఇప్పటివరకు సాధించిన అభివృద్ధి, పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపడుతున్న విస్తృత చర్యలను వివరించారు.
అనంతరం కమిషనర్.. విద్య, క్రీడా రంగాల్లో సహకారానికి, పెట్టుబడులకు అమరావతిలో ఉన్న విస్తృత అవకాశాలను ఆస్ట్రేలియా బృందానికి వివరించారు. ప్రపంచ స్థాయి విద్యా సంస్థలు, పరిశోధనా కేంద్రాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి, అమరావతిని విజ్ఞానం, ఆవిష్కరణలు, క్రీడా ప్రతిభకు కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని వివరించారు.
అమరావతి అభివృద్ధి కోసం చేపట్టిన సమగ్ర ప్రణాళికలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రతినిధి బృందం అభినందించింది. ముఖ్యంగా విద్య, క్రీడా రంగాల్లో అంతర్జాతీయ భాగస్వామ్యానికి మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ అవకాశాలను మరింతగా పరిశీలించి, భవిష్యత్‌లో కలసి పని చేసేందుకు ఆసక్తితో ఉన్నామని తెలిపింది.
ఈ సమావేశం APCRDA అధికారులు, ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం మధ్య సానుకూల చర్చలతో ముగిసింది. విద్య, ఆవిష్కరణలు, సుస్థిర పట్టణాభివృద్ధి రంగాల్లో అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, అమరావతిని ప్రపంచ స్థాయి విద్యా, పెట్టుబడి కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా ఇరు పక్షాలు తమ ఆసక్తిని పునరుద్ఘాటించాయి.
Prajavartha Online Telugu News