Breaking News

ఉమ్మడి కృష్ణాజిల్లా సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలి… : జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక

-రూ.98 లక్షలతో ఆధునీకరించిన జిల్లా పరిషత్ సమావేశ మందిరం ప్రారంభం
-జిల్లా పరిషత్ ఆస్తుల పరిరక్షణ, ఆదాయ వృద్ధికి ప్రత్యేక చర్యలు
-మహిళా ఉద్యోగుల సంక్షేమానికి క్రెచ్, మహిళా విశ్రాంతి గది ప్రారంభం
-జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహణ
-సమావేశంలో పాల్గొన్న ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఎం నవీన్, నూజివీడు సబ్ కలెక్టర్ బి వినూత్న, కృష్ణాజిల్లా సహాయ కలెక్టర్ నమ్రత అగర్వాల్, ఉమ్మడి కృష్ణాజిల్లా అధికారులు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణాజిల్లాలో వివిధ శాఖలకు సంబంధించిన ప్రజా సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని సత్వర పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టాలని కృష్ణా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక అధికారులను ఆదేశించారు.

శనివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పి చైర్పర్సన్ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ ఎం. నవీన్, నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, కృష్ణా జిల్లా సహాయ కలెక్టర్ నమ్రత అగర్వాల్, జిల్లా పరిషత్ సీఈఓ డాక్టర్ జె. అరుణ, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, ఉమ్మడి కృష్ణా జిల్లా అధికారులు హాజరయ్యారు.

సమావేశానికి ముందు జిల్లా పరిషత్ నిధులతో రూ.98 లక్షల వ్యయంతో ఆధునీకరించిన జిల్లా పరిషత్ సమావేశ మందిరం, చైర్‌పర్సన్, సీఈఓ చాంబర్లను ప్రారంభించారు. అదేవిధంగా, జిల్లా పరిషత్, స్త్రీ శిశు సంక్షేమ నిధులతో నిర్మించిన మహిళా సాధికారత భవనం ఉద్యోగినుల చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన క్రెచ్‌, మహిళల విశ్రాంతి గది ప్రారంభించారు.

అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ 1962లో నిర్మితమైన చారిత్రక ప్రాధాన్యత కలిగిన జిల్లా పరిషత్ సమావేశ మందిరానికి ఆధునిక హంగులు అద్దడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గతంలో పూర్తిగా కొత్త భవనం నిర్మించాలని ప్రతిపాదించినప్పటికీ అనివార్య కారణాలతో సాధ్యం కాకపోవడంతో ఇంజినీరింగ్ నిపుణుల సూచనల మేరకు భవనాన్ని బలోపేతం చేసి పునర్వైభవం తీసుకొచ్చినట్లు తెలిపారు.

జిల్లా పరిషత్ అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న సీఈఓ డాక్టర్ జె. అరుణ, ఇంజినీరింగ్ అధికారులు, పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది, కాంట్రాక్టర్ రత్నారావు సహా పనుల్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని ఆమె అభినందించారు.

ఆధునీకరించిన సమావేశ మందిరంలో కృష్ణా జిల్లా ఖ్యాతిని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన మహనీయుల చిత్రపటాలను ఏర్పాటు చేయడం విశేషమన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య, కూచిపూడి నాట్యాచార్యుడు పద్మభూషణ్ వెంపటి చిన్నసత్యం, ప్రముఖ ఇంజినీర్, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ కేఎల్ రావు, తెలుగు సాహిత్య తొలి జ్ఞానపీఠ గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ వంటి మహనీయుల సేవలను భావితరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో వారి చిత్రపటాలను సమావేశ మందిమందిరంలో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

జిల్లా పరిషత్ ఆదాయ వృద్ధికి తీసుకున్న చర్యలు ఇప్పటికే ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. అవనిగడ్డ, మచిలీపట్నం షాపింగ్ కాంప్లెక్స్‌ల ద్వారా ఏటా సుమారు రూ.50 లక్షలు, జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్ ద్వారా మరో రూ.69 లక్షల ఆదాయం సమకూరేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. జిల్లా పరిషత్ స్థలాల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు.

మహిళా ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ క్రెచ్, మహిళా విశ్రాంతి గదిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా పరిషత్ ప్రాంగణంలో వాకింగ్ ట్రాక్, విస్తృత స్థాయిలో మొక్కల పెంపకం చేపట్టి ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.

జిల్లా పరిషత్ ఆస్తుల పరిరక్షణ కోసం అవనిగడ్డతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఉద్యానవనాలు, మామిడి తోటలు అభివృద్ధి చేసి ఆక్రమణలను నివారించే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

జిల్లా పరిషత్ సభ్యుల గౌరవ వేతనాలకు సంబంధించిన బకాయిలు విడుదల చేసినట్లు పేర్కొన్న ఆమె, పదో తరగతి విద్యార్థులకు అందించే స్టడీ మెటీరియల్‌ను ఈ విద్యా సంవత్సరంలో కూడా ముందుగానే అందించేందుకు విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపాలని సూచించారు.

తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: అధికారులకు ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ ఎం. నవీన్ ఆదేశం

జిల్లాలో వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్యం, రహదారులు, గృహ నిర్మాణాలు, తల్లికి వందనం పథకం అమలు, ఎరువుల సరఫరా తదితర ప్రజా సమస్యలపై శనివారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. సమావేశంలో సభ్యులు వివిధ సమస్యలను సభ దృష్టికి తీసుకురాగా, ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ ఎం. నవీన్ స్పందించి సంబంధిత శాఖల అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

తీర ప్రాంత మండలాలైన కోడూరు, అవనిగడ్డ, నాగాయలంక, చల్లపల్లి, బంటుమిల్లి, కృత్తివెన్ను ప్రాంతాలకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని సభ్యులు కోరారు. చౌడు భూములు అధికంగా ఉండటంతో ప్రత్యామ్నాయ పంటల సాగు సాధ్యం కాదని, సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.

ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, ఫీజుల వివరాలను పాఠశాలల వద్ద తప్పనిసరిగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని సభ్యులు డిమాండ్ చేశారు. పామర్రు మండలంలోని పెదమద్దాలి ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయుల లేని కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని కోరారు.

కోడూరు వయ చిన్నాపురం నుంచి మచిలీపట్నానికి వెళ్లే మార్గంలోని వంతెనకు అప్రోచ్ రహదారి నిర్మాణం ఇప్పటికీ పూర్తికాలేదని, పనులను పూర్తి చేయాలని కోరారు.

తల్లికి వందనం పథకం కింద అర్హులైన కొంతమంది లబ్ధిదారులకు నగదు జమ కాలేదని, వారి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని సభ్యులు కోరారు.

బాపులపాడు మండలంలో ప్రభుత్వ వైద్యశాల భవన నిర్మాణ పనులు నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు, ముఖ్యంగా గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అలాగే గూడూరు మండలం మల్లవోలు జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారీకి సరైన షెడ్ లేక విద్యార్థులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

రైతులకు యూరియా, డీఏపీ వంటి ఎరువులు సకాలంలో అందుబాటులో ఉంచాలని, ఓటీపీ విధానం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని కూడా సభ్యులు కోరారు.

సభలో స్పందించిన ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ ఎం. నవీన్, సభ్యులు ప్రస్తావించిన సమస్యలన్నింటినీ సంబంధిత శాఖలు ప్రాధాన్యతతో తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. జిల్లా పరిషత్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని, తల్లికి వందనం పథకం కింద నగదు అందని లబ్ధిదారులను గుర్తించి గ్రామ, పాఠశాల స్థాయిలో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

సమావేశంలో జెడ్పీ డిప్యూటీ సీఈవో డాక్టర్ ఆనంద్ కుమార్, జెడ్పీ వైస్ చైర్మన్లు గరికపాటి శ్రీదేవి, గుడిమళ్ళ కృష్ణంరాజు, ఉమ్మడి కృష్ణాజిల్లా అధికారులు, ఎంపీపీ, జడ్పిటిసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *