అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గిరిజన విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విద్యాసంస్థలను రాజకీయాలకు వేదికగా మార్చడం అత్యంత దురదృష్టకరమని మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు డా. కొండారెడ్డి నరహరి వరప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో మారికవలస గురుకుల రెసిడెన్షియల్ స్కూల్‌పై వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. గిరిజన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మారికవలస గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను మరింత ఉన్నత స్థాయికి అప్‌గ్రేడ్ చేయడంతో పాటు జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని, సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్-సి ఓ ఈ ద్వారా ఐ ఐ టి -జె ఈ ఈ, నీట్, ఐయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆయన తెలిపారు. గిరిజన విద్యార్థులు కేవలం పాఠశాల విద్యకే పరిమితం కాకుండా, ఉన్నత విద్యలో దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ప్రవేశం పొందే స్థాయికి ఎదగాలన్నదే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.
సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేస్తే తప్పేంటి?
మారికవలస రెసిడెన్షియల్ స్కూల్‌లో సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేయడం కోసం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మారికవలసకు చెందిన 445 మంది విద్యార్థులను ఇతర ప్రాంతాల్లోని పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటుంటే తప్పేంటని నరహరి ప్రసాద్ ప్రశ్నించారు.
స్వార్థ రాజకీయాల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా?
ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, మాజీ గిరిజన ఎమ్మెల్యేలు, ఇతర వైకాపా నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులను ఇతర పాఠశాలల్లో చేరకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
ఐదేళ్ల పాలనలో గిరిజన ప్రాంతాలకు ఏం చేశారు?
గత ఐదు సంవత్సరాల్లో గిరిజన విద్యార్థులకు అందాల్సిన కనీస సదుపాయాల్లో భాగమైన కాస్మెటిక్స్ కూడా సక్రమంగా అందించలేదని, ముఖ్యంగా గిరిజన విద్యార్థులు చదువుతున్న ఆశ్రమ పాఠశాలల్లో విద్యా వ్యవస్థను నాశనం చేశారని ఆరోపించారు. “గిరిజన విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టని వారు నేడు మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు.
నాడు అరకు ఏజెన్సీలో అక్రమ మైనింగ్‌పై వైకాపా ఎందుకు మౌనం వహించింది?
అరకు ఏజెన్సీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని నాడు ఆరోపణలు వచ్చిన సమయంలో అప్పటి అధికార పార్టీకి చెందిన నాయకులు, సజ్జల రామకృష్ణారెడ్డి అనుచరులుగా పేర్కొంటున్న వారిపై గిరిజన నాయకులు ఎందుకు ప్రశ్నించలేదని నరహరి వరప్రసాద్ నిలదీశారు.
గిరిజనుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది
గిరిజనుల విద్య, అభివృద్ధి, సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువత భవిష్యత్తుకు ప్రాధాన్యతనిస్తున్న నారా లోకేష్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. జీవో నంబర్ 3పై స్పష్టమైన ప్రకటన, 1/70 చట్టంపై స్పష్టమైన హామీతో గిరిజనుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.
రాజకీయాల కోసం గిరిజన బిడ్డల భవిష్యత్తును బలి చేయొద్దు
గిరిజన యువత ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా ఎదగాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చేపట్టిన బృత్తర కార్యక్రమాన్ని అడ్డుకోవద్దని, రాజకీయాలకోసం గిరిజన బిడ్డల భవిష్యత్తును బలిపెట్టొద్దని డా. కొండారెడ్డి నరహరి వరప్రసాద్ హతవు పలికారు.
Prajavartha Online Telugu News