Breaking News

ఉత్తరాంధ్రకు గోదావరి జలహారం

-అనకాపల్లికి చేరిన గోదారమ్మకు సీఎం జలహారతి
-జలం జీవం, జీవితం.. నీరుంటేనే సాగు బాగు
-సీఎంగా ఉన్న ప్రతిసారీ ప్రాజెక్టులకు, జలసంరక్షణకే ప్రాధాన్యం
-పాయకరావుపేట క్రాస్ రెగ్యులేటర్ వద్ద ఉత్తరాంధ్రకు నీటి విడుదల
-4 జిల్లాల్లో 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 9 లక్షల మందికి తాగునీరు
-పోలవరం ఎడమ కాలువలో జలాలకు సీఎం ప్రత్యేక పూజలు..సాష్టాంగ నమస్కారం
-గోదావరి నీళ్లు తీసుకొచ్చిన ముఖ్యమంత్రికి ఉత్తరాంధ్ర రైతుల ధన్యవాదాలు

అనకాపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రలోకి అడుగుపెట్టాయి. పాయకరావుపేట వద్ద క్రాస్‌ రెగ్యులేటర్‌ నుంచి ప్రవహించిన గోదారమ్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించి జల హారతి ఇచ్చారు. పవిత్ర జలాలను శిరస్సుపై చల్లుకుని అనంతరం అక్కడే శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనకాపల్లికి గోదారమ్మ తరలి వచ్చిన భావోద్వేగ వాతావరణం మధ్య పోలవరం ఎడమ కాలువలో నిల్చుని గోదావరి జలాలకు పుష్పాలు, పసుపు కుంకుమ సమర్పించిన సీఎం..జలహారతి ఇచ్చారు. కాలువకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో చేరిన స్థానికులు, రైతులు, మహిళలు పుష్పాలతో జలాలకు స్వాగతం పలికారు. మహిళలు హారతులు ఇచ్చారు. అరుణవర్ణంలో పరవళ్లు తొక్కుతూ వస్తున్న గోదావరి జలాలకు సీఎం సాష్టాంగ నమస్కారం చేశారు. గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు చేరడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. గోదావరి జలాలకు జలహారతి అనంతరం క్రాస్ రెగ్యులేటర్ వద్దకు చేరుకుని స్థానిక రైతులతో కలిసి రెగ్యులేటర్ గేట్లను ఎత్తారు. ప్రస్తుతం ఎడమ కాలువ ద్వారా విడుదల చేసిన నీటితో తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లోని 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 9.23 లక్షల మందికి తాగునీరు ఇచ్చేలా ప్రభుత్వం ప్రణాళిక చేసింది. తాండవ, వరహా, శారదా నదులతో పాటు ఏలేరు కాలువ లపై సైఫన్లు, ఆక్విడెక్టులను నిర్మించింది. ఎడమ కాలువ కోసం ఇప్పటి వరకూ రూ.4192 కోట్లను ప్రభుత్వం వ్యయం చేసింది. ఎడమ కాలువ ద్వారా వచ్చిన నీటితో అనకాపల్లి వద్ద ఏలేరు కాలువతో పాటు జిల్లాలోని 110 చెరువులను నింపేలా జల వనరుల శాఖ ప్రణాళిక చేసింది. గోదావరి జలాలతో పుష్కర ఆయకట్టు పరిధిలో 1.48 లక్షల ఎకరాలు, ఏలేరు కింద 80 వేల ఎకరాలు, పంపా కింద 12 వేల ఎకరాలు, తాండవ, వరహా, మామిడి గెడ్డ ఆయకట్టు పరిధిలో ఉన్న 46,620 ఎకరాల స్థిరీకరణ జరుగనుంది. దీంతో పాటు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని పారిశ్రామిక అవసరాలకు, తాగు, సాగునీటి అవసరాల కోసం 23.44 టీఎంసీల నీటిని తరలించేలా ప్రణాళిక చేసినట్టు సీఎంకు జల వనరుల శాఖ అధికారులు వివరించారు.

ఉత్తరాంధ్రలో బీళ్లన్నీ ఇక పంటలే

అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు వచ్చాయి. ఇక ఈ ప్రాంతంలోని బీళ్లన్నీ పంటలు పండుతాయని అన్నారు. అనకాపల్లి జిల్లాలో అడుగుపెట్టి ఉత్తరాంధ్రకు తరలి వచ్చిన గోదారమ్మకు ప్రణమిల్లుతున్నానని తెలిపారు. గోదావరి మూడు పాయలు గౌతమి, వశిష్ఠ, వైనతేయ సముద్రంలో కలుస్తుంటే..ఇప్పుడు పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి తరలి వచ్చిందన్నారు. తూర్పు కనుమలు, అడవులు, నదులు, వాగులు, వంకలు, హైవేలను దాటుకుని అన్నవరం సత్య దేవుడి ఆశీస్సుల కోసం గోదారమ్మ ఇక్కడకు వచ్చిందని పేర్కొన్నారు. వచ్చే ఏడాదికి సింహాచలం అప్పన్న చెంతకు గోదావరి జలాలను తీసుకువెళతామని ఆపై అరసవల్లి సూర్యనారాయణ స్వామి వద్దకు తరలించి వంశధార వరకూ గోదావరిని జలాలను తరలిస్తామని చెప్పారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో సాగు, తాగునీటి అవసరాలు తీర్చేలా ప్రణాళిక రూపొందించామని సీఎం తెలిపారు. తొలి దశలో 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 9 లక్షల మందికి తాగునీరు అందేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పోలవరం ఎడమ కాలువ నిర్మాణానికి ఇప్పటివరకు రూ.4,192 కోట్లు ఖర్చు చేశామని చంద్రబాబు తెలిపారు. మరో రూ.800 కోట్లు ఖర్చు చేసి మొత్తం పనులు పూర్తి చేస్తామన్నారు. ఏలేరు కాలువపై సైఫన్‌, పంపా, తాండవ, వరాహ నదులపై ఆక్విడెక్టులు నిర్మించి కాలువ పనులు పూర్తి చేశామని చెప్పారు. తాళ్లపాలెంలో భూ వివాదాన్ని పరిష్కరించి నిర్వాసితులకు పునరావాసం కల్పించామన్నారు. లెఫ్ట్‌ కెనాల్‌లో ప్రవహిస్తున్న ప్రతి నీటి చుక్క వెనుక ఇంజినీర్ల ప్రతిభ, కార్మికుల కష్టం, రైతుల నిరీక్షణ, నిర్వాసితుల త్యాగం, ప్రభుత్వ సమర్థత ఉన్నాయని సీఎం పేర్కొన్నారు.

కూటమి వచ్చాక పోలవరానికి శాప విముక్తి

2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం ప్రాజెక్టు సాకారం కావడానికి ఏడు ముంపు మండలాలను రాష్ట్రంలో విలీనం చేసేలా కృషి చేశానని చంద్రబాబు తెలిపారు. ప్రతి సోమవారాన్ని పోల వారంగా మార్చుకుని 2019 వరకు 72 శాతం పనులు పూర్తి చేశామని చెప్పారు. 2019లో అధికారంలోకి వచ్చిన గొడ్డలి పార్టీ పోలవరం ప్రాజెక్టును విధ్వంసం చేసిందన్నారు. డయాఫ్రాం వాల్ కొట్టుకు పోయిందని అన్నారు. 2024లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం ద్వారా ప్రజలే పోలవరానికి శాప విముక్తి కల్పించారని అన్నారు. రాష్ట్రంలో ఏ మంచి జరిగినా తామే చేశామంటూ గొడ్డలి పార్టీ పేక్ ప్రచారానికి పాల్పడుతోందని అన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు, వెలిగొండ ప్రాజెక్టులు తామే కట్టామని చెప్పుకుంటోందని అన్నారు. ప్రజలు ఛీ కొట్టినా ఆ పార్టీకి సిగ్గు రావటం లేదన్నారు. అనకాపల్లికి నీరు కూడా తామే చేశామని చెప్పుకుంటారని పోలవరం పూర్తి అయితే మా గొప్పే అంటారన్నవారు. నేర చరిత్ర ఉన్న గొడ్డలి పార్టీది విధ్వంసమే అసలు నైజమని ముఖ్యమంత్రి అన్నారు. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తీసుకురావడం అంత సులభంగా జరగలేదని, గంటలు, రోజుల వారీగా లక్ష్యాలు పెట్టుకుని పనులు పరుగులు పెట్టించామని తెలిపారు. ఎడమ ప్రధాన కాలువను మరింత విస్తరించి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి అనుసంధానం చేస్తామని చంద్రబాబు చెప్పారు. రూ.3,200 కోట్లతో ఉత్తరాంధ్రలోని 12 ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. వచ్చే మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలిపారు. గత రెండేళ్లలో సాగునీటి రంగంలో రూ.25 వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. గోదావరి- కృష్ణా సహా రాష్ట్రంలోని అన్ని నదులను అనుసంధానం చేసి తెలుగు తల్లికి జల హారతి ఇస్తానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. చంద్రబాబు అనే నేను 2015 సెప్టెంబరు 16న పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి గోదావరి జలాలను కృష్ణాడెల్టాకు తీసుకెళ్ళానని..2017 ఆగస్టు 15న పురుషోత్తపట్నం ఎత్తిపోతలను ప్రారంభించామని గుర్తుచేశారు. ఇప్పుడు చంద్రబాబు అనే నేను 2026 సెప్టెంబరు 2న గోదావరి జలాలను అనకాపల్లికి తీసుకువచ్చానని ముఖ్యమంత్రి అన్నారు. తాను సీఎంగా ఉన్న ప్రతిసారీ సాగునీటి ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కోసమే పనిచేశానని వివరించారు.

ఇక ఉత్తరాంధ్రకే వలసలు

నీరు పుష్కలంగా ఉంటే పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధికి భద్రత ఉంటుందని సీఎం చెప్పారు. విశాఖ, అనకాపల్లి ప్రాంతాల్లో భారీ పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. ఆరు నెలల క్రితం అనకాపల్లిలో ఆర్సెలార్‌ మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశామని గుర్తుచేశారు. పెద్ద డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు వస్తున్నాయని, ఆసియా మొత్తాన్ని అనుసంధానించే సబ్‌సీ కేబుల్‌ కనెక్టివిటీ కూడా రానుందని తెలిపారు. హార్బర్లు, మూలపేట పోర్టుల ద్వారా తూర్పు తీరాన్ని మధ్య భారత్‌తో అనుసంధానిస్తా మన్నారు. హైదరాబాద్‌ సమీపంలోని రంగారెడ్డి తరహాలో అనకాపల్లి అభివృద్ధికి చిరునామాగా మారుతుందని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెళ్లడం కాదు..ఉత్తరాంధ్రకే వలసలు వచ్చే పరిస్థితి వస్తుందని. ఉత్తరాంధ్ర ఉన్నతాంధ్రగా మారుతుందని ముఖ్యమంత్రి వివరించారు. విశాఖ ఇక ఏఐ పట్నంగా మారుతుందని సీఎం తెలిపారు. గూగుల్‌ హబ్‌గా, నాలెడ్జ్‌ ఎకానమీ కేంద్రంగా, పరిశ్రమలు, వ్యవసాయ రంగాలతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి చిరునామాగా నిలుస్తుందని చెప్పారు. డేటా సెంటర్లకు నీరు, విద్యుత్‌ కొరత వస్తుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. డేటా సెంటర్లకు అవసరమైన నీటితో పోలిస్తే పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చే నీటి సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. అన్ని డేటా సెంటర్లకూ కేవలం 5 టీఎంసీల నీరు సరిపోతుందని.. ఎడమ కాలువ ద్వారా రోజుకు 2 టీఎంసీల నీరు తీసుకెళ్లే సామర్ధ్యం ఉందని అన్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు సభా వేదిక నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి.. ఎడమ కాలువను వేగంగా పూర్తి చేసేందుకు కృషి చేసిన జలవనరులశాఖ ఇంజనీర్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సహా మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, పి.నారాయణ, కె.అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, కె.పార్ధసారధి, ఎంపీలు విజయ్, సీఎం రమేశ్ సహా ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *