Breaking News

తరిగొప్పలకు రూ.4.10 కోట్ల అభివృద్ధి పనులు: యార్లగడ్డ

-రూ.2.50 కోట్ల వ్యయంతో నిర్మించిన తరిగొప్పల–మానికొండ రోడ్డుకు ప్రారంభం
-రూ.27.30 లక్షలతో 7 సీసీ రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే
-మైనస్ వచ్చిన గ్రామాలకూ వివక్ష లేకుండా అభివృద్ధి: యార్లగడ్డ
-77 వేల మందికి ఇంటింటికీ ఉచిత రక్తపరీక్షలు నిర్వహించాం
-రూ.100 కోట్ల నిధులకు సీఎం, పవన్, లోకేశ్‌కు యార్లగడ్డ కృతజ్ఞతలు

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : ‘
అభివృద్ధి విషయంలో ఓట్లు, రాజకీయాలకు తావు లేదని, ప్రతి గ్రామాన్ని సమానంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఏపీ ప్రభుత్వ విప్‌, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఉంగుటూరు మండలం తరిగొప్పల గ్రామంలో శనివారం నిర్వహించిన ‘రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కూటమి నాయకులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, తాను ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. అనంతరం రూ.27.30 లక్షల వ్యయంతో నిర్మించిన ఏడు సీసీ రోడ్లను, రూ.2.50 కోట్లతో నిర్మించిన తరిగొప్పల–మానికొండ రహదారిని ప్రారంభించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ తరిగొప్పల–మానికొండ రహదారి నియోజకవర్గంలో అత్యంత దారుణమైన రహదారిగా ఉండేదని, గోతుల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందుల మధ్య కూడా ఈ రహదారికే రూ.2.50 కోట్లు కేటాయించడం తనకు సంతృప్తినిచ్చిందన్నారు. గత ప్రభుత్వం రోడ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో అన్ని పనులను ఒకేసారి చేపట్టాల్సి వచ్చిందని, ఆలస్యమైనందుకు గ్రామస్తులకు క్షమాపణ కోరారు. ఈ రహదారి పూర్తవడంతో మానికొండకు అరగంట పట్టే ప్రయాణం ఇప్పుడు ఐదు నిమిషాలకు తగ్గిందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారని తెలిపారు. గ్రామంలో ఇప్పటికే రూ.27.30 లక్షలతో సీసీ రోడ్లు, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ షెడ్‌, 38 విద్యుత్‌ స్తంభాల మార్పు, విద్యుత్‌ పనులకు రూ.42 లక్షలు వెచ్చించామని, ఇప్పటివరకు తరిగొప్పలకు రూ.2.91 కోట్ల అభివృద్ధి పనులు పూర్తిచేశామని చెప్పారు. జలజీవన్‌ మిషన్‌ కింద రూ.1.10 కోట్ల పైపులైన్‌ పనులు, గోకుల చెట్ల నిర్మాణానికి రూ.9.70 లక్షలతో కలిపి గ్రామానికి మొత్తం రూ.4.10 కోట్ల విలువైన పనులు చేపట్టినట్లు వెల్లడించారు. 2024 ఎన్నికల్లో తరిగొప్పలతో పాటు మానికొండ, నాగవరప్పాడు, చిన్నఅవుటపల్లి, మడిచెర్ల, బండారుగూడెం, వీరవల్లి వంటి గ్రామాల్లో తనకు తక్కువ ఓట్లు వచ్చినా అభివృద్ధిలో ఎక్కడా వివక్ష చూపలేదని యార్లగడ్డ స్పష్టం చేశారు. గతంలో 20–30 మీటర్ల రోడ్లను కూడా రాజకీయ కక్షతో నిలిపివేసిన పరిస్థితిని మార్చామని అన్నారు. వైసీపీ కార్యకర్తలపై కూడా తప్పుడు కేసులు పెట్టలేదని, ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు పరిష్కరించడానికే రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. తరిగొప్పల–వెల్దిపాడు డొంక రోడ్డుకు రూ.90 లక్షలతో గ్రావెల్‌, బీటీ రోడ్డుగా అభివృద్ధి చేయడానికి రూ.2.90 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. గ్రామంలో 2,357 మంది జనాభా ఉండగా 2,234 మందికి ఇంటి వద్దకే వెళ్లి ఉచిత రక్తపరీక్షలు నిర్వహించామని తెలిపారు. నాగవరప్పాడులో వెయ్యికి పైగా, ముస్తాబాదలో 6,500 మందికి పరీక్షలు చేసినట్లు చెప్పారు. మూడు మండలాల్లో ఇప్పటివరకు 77 వేల మందికి పైగా పీహెచ్‌సీ వైద్య సిబ్బందితో ఉచిత రక్తపరీక్షలు నిర్వహించామని, బీసీ, ఎస్సీ, ఓసీ అనే తేడా లేకుండా ప్రతి ఇంటికీ వైద్య సేవలు అందించడమే లక్ష్యమన్నారు రైతుల విజ్ఞప్తిపై వెంటనే అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. కోమటికుంట వద్ద గేటు ఎత్తు పెంచి వారం రోజుల్లో నీటి సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి ఇటీవల ప్రభుత్వం రూ.100 కోట్లకు పైగా నిధులు కేటాయించిందని యార్లగడ్డ తెలిపారు. పోలవరం–ఏలూరు కాలువ అనుసంధానానికి రూ.38 కోట్లు, ఎనికేపాడు యూటీ పనులకు రూ.36 కోట్లు, ఆత్కూరు హై లెవెల్ వంతెన కోసం రూ.21 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎంఆర్ఎఫ్‌ ద్వారా కూడా గన్నవరం నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యం లభిస్తోందన్నారు. గన్నవరం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, ప్రజలు, అధికారులు, మీడియా సహకారంతో ఆ దిశగా ముందుకు సాగుతానని యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *