Breaking News

సాగు నీటి సంరక్షణ… పర్యావరణ పరిరక్షణ… అహ్లాదకర వాతావరణం

-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో పల్లె చెరువులకు కొత్త కళ
-రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 50 కోట్లతో 105 చెరువుల ఆధునీకరణ
-ఇప్పటికే 26 చెరువులకు పునరుజ్జీవం
-భూగర్భ జలాల పెంపు.. సమగ్ర అభివృద్ధే ధ్యేయం
-ఆధునిక హంగులతో ఆహ్లాదకర కేంద్రాలుగా చెరువులు
-వాకింగ్ ట్రాక్‌లు, ఓపెన్ ఎయిర్ జిమ్‌లు, చిల్డ్రన్ పార్కులతో కొత్త రూపు
-సెప్టెంబర్ నెలాఖరుకల్లా పనులు పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సాగు నీటి వనరుల సంరక్షణ నుంచి పర్యావరణ పరిరక్షణ వరకు, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నుంచి ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల వరకు సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృషి చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధిపై లక్ష్యంగా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఉప ముఖ్యమంత్రి చొరవకు ‘ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన’ పథకం తోడవడంతో రాష్ట్రవ్యాప్తంగా మంచినీటి చెరువులు, సరస్సుల పునరుజ్జీవనానికి కొత్త ఊపు వచ్చింది. పవన్ కళ్యాణ్ దార్శనికత, అభివృద్ధి పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతతో చెరువులకు కొత్త జీవం పోయడమే కాకుండా, వాటిని మరింత సమర్థవంతమైన సాగునీటి వనరులుగా తీర్చిదిద్దే దిశగా విస్తృత స్థాయిలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. చెరువుల ఆధునీకరణ ద్వారా భూగర్భ జలాలను పెంపొందించడం, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటం, సాగునీటి సామర్థ్యాన్ని బలోపేతం చేయడంతోపాటు గ్రామీణ ప్రజలకు మరింత మెరుగైన, ఆహ్లాదకరమైన జీవన వాతావరణాన్ని అందించాలన్న సమగ్ర లక్ష్యంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయి.
105 చెరువులు… రూ. 50 కోట్ల అంచనా వ్యయంతో పనులు
రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం కోసం మొత్తం రూ.50 కోట్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు 26 చెరువులను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. అనంతపురం, పల్నాడు, శ్రీ సత్యసాయి, చిత్తూరు, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కాకినాడ, గుంటూరు జిల్లాల్లో ఇప్పటికే చెరువుల అభివృద్ధి పూర్తయ్యి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన పనులు వివిధ దశల్లో శరవేగంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చెరువుల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ, ఆయా ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా పనులను చేపడుతున్నారు. ఈ కార్యక్రమం పూర్తయితే చెరువుల నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతోపాటు సాగు నీటి వనరులు మరింత బలోపేతం కానున్నాయి. అలాగే భూగర్భ జలాల వృద్ధికి తోడ్పడనున్నాయి.
చెరువులకు కొత్త రూపు.. ప్రజలకు కొత్త సౌకర్యాలు
చెరువుల ఆధునీకరణ ప్రక్రియలో భాగంగా చెరువు గట్ల బలోపేతం, వాకింగ్ ట్రాక్‌ల ఏర్పాటు, ప్రవేశ ద్వారాల నిర్మాణం, సోలార్ లైట్ల ఏర్పాటు, సిట్టింగ్ బెంచ్‌ల ఏర్పాటు వంటి పనులు చేపడుతున్నారు. పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా పార్కుల ఏర్పాటు చేయడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఓపెన్ ఎయిర్ జిమ్ పరికరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు చెరువుల సుందరీకరణ పనులకు ప్రాధాన్యం ఇస్తూ, వాటిని ప్రజల విశ్రాంతి, ఆరోగ్యం, వినోదానికి అనువైన కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం పరిధిలోని వెదుళ్ల చెరువు, కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలోని పండూరు చెరువు, గుంటూరు జిల్లా వెంగళాయపాలెం చెరువు, అనంతపురం జిల్లాలో గుడిశెలపల్లి చెరువు, నెల్లూరు జిల్లాలోని వింజమూరు, శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రం తదితర చెరువులు పూర్తి స్థాయి అభివృద్ధి పనులు పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
* సాగు నీటితోపాటు భూగర్భ జలాలకు బలం
ఈ పనుల ద్వారా చెరువులు కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే పరిమితం కాకుండా బహుళ ప్రయోజన కేంద్రాలుగా రూపుదిద్దుకోనున్నాయి. చెరువుల నీటి నిల్వ సామర్థ్యం పెరగడం వల్ల సాగునీటి వనరులు బలోపేతం కావడంతో పాటు పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు పెరిగే అవకాశం ఉంది. దీంతో రైతులకు సాగునీటి పరంగా ప్రయోజనం చేకూరడంతో పాటు గ్రామీణ ప్రజలకు దీర్ఘకాలికంగా మెరుగైన ఫలితాలు అందనున్నాయి. పర్యావరణ పరిరక్షణకు కూడా ఈ కార్యక్రమం దోహదపడనుంది.
* నాణ్యతపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి
అభివృద్ధి పనుల వేగంతో పాటు వాటి నాణ్యతపై కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిని పర్యవేక్షిస్తూ, ప్రతి పని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా సాగుతున్నాయో లేదో పరిశీలిస్తున్నారు. పనులను సెప్టెంబర్ నెలాఖరుకల్లా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి పనుల్లో వేగం, నాణ్యత రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం సహాయ సహకారాలు అందిస్తున్న గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, రాష్ట్రంలో అమలుకు సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి, సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కి కృతజ్ఞతలు తెలిపారు.
సాగు నీరు, పర్యావరణం, గ్రామీణ మౌలిక సదుపాయాలు, ప్రజల ఆరోగ్యం, జీవన ప్రమాణాలు వంటి అన్ని అంశాలను సమన్వయం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పవన్ కళ్యాణ్  దార్శనికత ఈ చెరువుల ఆధునీకరణ కార్యక్రమంలో ప్రతిబింబిస్తోంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *