Breaking News

తూర్పుగోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి గా ఎం.యు.వి. మనోహర్ బాధ్యతల స్వీకరణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి (D.P.T.O.)గా ఎం.యు.వి. మనోహర్ శుక్రవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని డి.పి.టి.ఓ. ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. మనోహర్‌కు ప్రజా రవాణా రంగంలో విస్తృతమైన అనుభవం ఉంది. గతంలో రాజమహేంద్రవరం అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ (కమర్షియల్)గా విధులు నిర్వహించారు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు, అమలాపురం, కాకినాడ డిపోలలో డిపో మేనేజర్‌గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం కాకినాడ డి.పి.టి.ఓ.గా విధులు నిర్వహిస్తూ, బదిలీపై తూర్పుగోదావరి జిల్లా డి.పి.టి.ఓ.గా నియమితులై బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రయాణికులకు మరింత మెరుగైన ప్రజా రవాణా సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సు సర్వీసుల నిర్వహణ, సమయపాలన, ప్రయాణికుల భద్రత, సౌకర్యాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. డిపోల పనితీరును మెరుగుపరచడంతో పాటు ప్రయాణికుల నుంచి వచ్చే సూచనలు, ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి అధికారులు, డిపో మేనేజర్లు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు. సంస్థ ఆదాయాభివృద్ధి, బస్సుల సమర్థవంతమైన నిర్వహణ, సిబ్బంది సేవా సామర్థ్యం పెంపు వంటి అంశాలకు కూడా ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.

అంతకు ముందు రాజమహేంద్రవరం, గోకవరం, కొవ్వూరు, నిడదవోలు డిపో మేనేజర్లు, ఇతర అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి మనోహర్‌కు ఘనంగా స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో డి.పి.టి.ఓ. కార్యాలయ సిబ్బంది టి. మల్లేశ్వరరావు, కె.వి.హెచ్. రావు, బి. శివకుమార్, ఎ.వి. స్వామి, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, వివిధ అసోసియేషన్ ప్రతినిధులు, ఇతర సిబ్బంది పాల్గొని డిపిటివో మనోహర్ ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శని, ఆదివారాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని శని,ఆదివారాల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *