-ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయం
-కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలి
-ఎన్టీఆర్ జిల్లాలో 100 శాతం స్ట్రైక్ రేట్ లక్ష్యంగా పనిచేయాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి పార్టీల సమన్వయ కమిటీ సమావేశం విజయవాడలో జరిగింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కూటమి పార్టీల మధ్య మరింత సమన్వయంతో ముందుకు సాగడం, ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజలకు వివరించాలని సమావేశంలో నిర్ణయించారు. గత రెండున్నర సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టిన కార్యక్రమాలను ప్రతి గ్రామం, ప్రతి వార్డు స్థాయికి తీసుకెళ్లేలా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.రానున్న ఎన్నికల్లో కూటమి తరఫున పోటీ చేసే ప్రతి అభ్యర్థికి పార్టీ శ్రేణులు సంపూర్ణ సహకారం అందించాలని సమావేశంలో నిర్ణయించారు. పోటీ చేసే అన్ని స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయఢంకా మోగించే విధంగా ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.ఎన్టీఆర్ జిల్లాలో కూటమి మరింత బలంగా పనిచేసి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించే దిశగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించారు. నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల కార్యాచరణను పటిష్టంగా అమలు చేయాలని చర్చించారు.
తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, శ్రేణుల మధ్య నిరంతర సమన్వయం ఉండేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకుంటూ ఎన్నికలను సమష్టిగా ఎదుర్కోవాలని నేతలు పేర్కొన్నారు.ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, స్థానికంగా ఉన్న రాజకీయ సమీకరణాలు, కూటమి శ్రేణుల సమన్వయం, అభ్యర్థుల విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణ తదితర అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. గ్రామ, మండల, పట్టణ స్థాయిలో పార్టీ నాయకులు మరింత చురుకుగా పనిచేసేలా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ నాయకులకు సూచించారు. కూటమి ప్రభుత్వ లక్ష్యాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సమావేశంలో స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని),పార్లమెంటరీ ఎన్నికల ఇన్చార్జ్ మక్కెన మల్లికార్జునరావు, జిల్లా పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, ఎమ్మెల్యేలు గద్దె రామమోహన్, బోండా ఉమా, తంగిరాల సౌమ్య, శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య), జనసేన పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు బోలియాశెట్టి శ్రీకాంత్, విజయవాడ సెంట్రల్ సమన్వయకర్త బొలిశెట్టి వంశీ, మైలవరం ఇన్చార్జ్ అక్కల రామ్మోహన్ (గాంధీ), నందిగామ ఇన్చార్జ్ రమాదేవి, తిరువూరు సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు, స్థానిక సంస్థల ఎన్నికల కమిటీ సభ్యురాలు బండి కోమలి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, సెంట్రల్ పార్టీ ఆఫీస్ ఇన్చార్జ్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News