-2047 నాటికి రూ.80 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా తిరుపతి జోన్ ను తీర్చిదిద్దే లక్ష్యం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్వర్ణాంధ్ర @ 2047 విజన్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తిరుపతి ఎకనామిక్ రీజియన్ సమగ్ర ప్రణాళిక రూపకల్పనకు కీలక ముందడుగు పడనుంది. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పరిశ్రమల ప్రతినిధులు, విద్యావేత్తలు, ప్రభుత్వ శాఖల అధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులతో భాగస్వామ్యుల సదస్సును బుధవారం తిరుపతిలో నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ సదస్సులో ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి అవసరమైన కీలక ప్రాజెక్టులు, విధానాలు, మౌలిక వసతులు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. తిరుపతి ఎకనామిక్ రీజియన్ సీఈఓ, రెవెన్యూ–ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా నేతృత్వంలో ఈ ఒక రోజు సమావేశం నిర్వహిస్తున్నారు.
రాష్ట్రాన్ని 2047 నాటికి రూ.308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంతోపాటు తలసరి ఆదాయాన్ని రూ.55 లక్షలకు చేర్చాలన్న స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్యం మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పని చేస్తున్నారు. దీనిలో భాగంగా రాష్ట్రాన్ని మూడు ఆర్థిక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లను దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి ఇంజిన్లుగా తీర్చిదిద్దే దిశగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా తిరుపతి ఎకనామిక్ రీజియన్‌ను 2047 నాటికి రూ.80 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు.
తిరుపతి ఎకనామిక్ రీజియన్ పరిధిలో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు, అనంతపురము, నంద్యాల, కర్నూలు జిల్లాలు ఉన్నాయి. పారిశ్రామిక, తయారీ రంగాలు, రవాణా–లాజిస్టిక్స్, పర్యాటకం, వ్యవసాయం, ఉద్యానవనం, సేవల రంగాలు, విద్యా–పరిశోధనా సంస్థలు, నైపుణ్యవంతమైన మానవ వనరులు ఈ ప్రాంతానికి ప్రధాన బలాలుగా ఉన్నాయి.
ప్రత్యేకంగా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు పరిశ్రమలు, తయారీ రంగం, లాజిస్టిక్స్, రవాణా కారిడార్లు, పర్యాటకం, వ్యవసాయ–ఉద్యాన ఉత్పత్తులు, విద్యా సంస్థల పరంగా కీలకమైన ఆర్థిక భౌగోళిక ప్రాంతంగా గుర్తించారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానానికి అనుకూలత ఉన్న ఈ ప్రాంతాన్ని పెట్టుబడులు, ఉపాధి కల్పనకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశాలపై సదస్సులో చర్చించనున్నారు.
తిరుపతి ఎకనామిక్ రీజియన్ ప్రణాళికలో భాగంగా అధిక వృద్ధి సామర్థ్యం ఉన్న రంగాలను గుర్తించడం, భారీ ప్రభావం చూపే ప్రాజెక్టులను ప్రతిపాదించడం, పరిశ్రమలు–లాజిస్టిక్స్–పర్యాటకం–వ్యవసాయం–సేవల రంగాల్లో అవకాశాలను విస్తరించడం, పెట్టుబడులను ఆకర్షించేందుకు అవసరమైన విధానాలను రూపొందించడం, సంస్థాగత సమన్వయం, కనెక్టివిటీ, సామాజిక మౌలిక వసతులను బలోపేతం చేయడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
సదస్సులో ముందుగా ప్లానింగ్ శాఖ జాయింట్ సెక్రటరీ అనంత్ శంకర్ , తదుపరి తిరుపతి ఎకనామిక్ రీజియన్ సీఈఓ, రెవెన్యూ–ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేశ్ కుమార్ మీనా ప్రాంతీయ ఆర్థిక ప్రణాళిక ప్రాధాన్యంపై ప్రారంభోపన్యాసం చేస్తారు. నిపుణులు తిరుపతి జోన్ ప్రణాళిక, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల ఆర్థిక పరిస్థితి, పారిశ్రామిక వ్యవస్థ, భవిష్యత్ అవకాశాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నారు.
అనంతరం జోన్ అడ్వైజరీ సభ్యులు ప్రాంతీయ వృద్ధి అవకాశాలపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఉద్యోగాల ఆధారిత వృద్ధి, సామాజిక మౌలిక వసతులు, సంస్థాగత వ్యవస్థపై చర్చ జరుగుతుంది. పరిశ్రమల ప్రతినిధులతో ఆర్థిక వృద్ధి చోదకాలు, విధానాలు, లాజిస్టిక్స్, సంస్థాగత అంశాలపై చర్చించనున్నారు. అనంతరం విద్యా సంస్థలు, ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్ల అధికారులతో అభివృద్ధికి అవసరమైన మౌలిక అంశాలు, అవరోధాలు, ప్రతిపాదిత కీలక ప్రాజెక్టులపై అభిప్రాయాలు సేకరిస్తారు.
వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలు, ప్రతిపాదనలు, అభివృద్ధి అవకాశాలను సమీకరించి తిరుపతి ఎకనామిక్ రీజియన్‌కు సమగ్ర, అమలు చేయదగిన దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికను రూపొందించేందుకు ఈ భాగస్వామ్యుల సదస్సు దోహదపడనుంది. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Prajavartha Online Telugu News