Breaking News

మైనింగ్‌ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు

-ఓఎంఈపీఎస్‌ 2.0లో నిర్దేశిత గడువులు తప్పనిసరిగా పాటించాలి
-అధికారులకు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముకేష్‌ కుమార్‌ మీనా ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మైనింగ్‌ దరఖాస్తులకు సంబంధించి నిరభ్యంతర పత్రం జారీ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా నిర్దేశిత గడువుల్లోనే దరఖాస్తులను పరిష్కరించాలని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముకేష్‌ కుమార్‌ మీనా అధికారులను ఆదేశించారు. ఓఎంఈపీఎస్‌ 2.0 ద్వారా అమలు చేస్తున్న కాలపరిమితితో కూడిన ఎన్‌ఓసీ ప్రక్రియను పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేశారు . మైనింగ్‌ దరఖాస్తుల పరిష్కారంలో మైన్స్‌, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, ప్రజలకు, దరఖాస్తుదారులకు ఇబ్బందులు లేకుండా చేయాలని ముకేష్‌ కుమార్‌ మీనా ఆదేశించారు.

మైన్స్‌ ,‌ జియాలజీ శాఖ అధికారులు, ఆయా జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు, జిల్లా అటవీ శాఖ అధికారులు, జిల్లా మైన్స్‌ అండ్‌ జియాలజీ, రెవెన్యూ శాఖకు చెందిన అధికారులతో ముకేష్‌ కుమార్‌ మీనా మంగళవారం సచివాలయం నుంచి హైబ్రిడ్ విధానంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మైనింగ్‌ దరఖాస్తుల పరిష్కారం, ఎన్‌ఓసీల జారీ, పెండింగ్‌ దరఖాస్తులు, ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల పురోగతి అంశాలపై సమీక్షించారు. ప్రతి దరఖాస్తు ఏ అధికారి వద్ద ఎంతకాలంగా ఉందో ఆన్‌లైన్‌లో పర్యవేక్షించే విధానం ఉన్నందున, ప్రతి ఒక్కరూ నిర్దేశిత గడువుల్లో చర్యలు తీసుకోవాలని సూచించారు.

కొత్త విధానం ప్రకారం తహసీల్దార్‌కు ఎన్‌ఓసీ జారీ చేయడం లేదా తిరస్కరించడం కోసం 14 రోజుల గడువు ఉంటుందని, ఈ గడువులో చర్యలు తీసుకోకపోతే దరఖాస్తు ఆటోమేటిక్‌గా జాయింట్‌ కలెక్టర్‌కు వెళ్తుందన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ ఏడు రోజుల్లో చర్యలు తీసుకోవాలని, అక్కడ కూడా నిర్ణీత గడువులో పరిష్కారం కాకపోతే దరఖాస్తు జిల్లా కలెక్టర్‌ వద్దకు వెళ్తుందని వివరించారు. ప్రతి దశలో సంబంధిత అధికారులతో పాటు మైన్స్‌ డైరెక్టర్‌కు కూడా ఆన్‌లైన్‌ ద్వారా పూర్తి సమాచారం అందుతుందన్నారు.

పెండింగ్‌ దరఖాస్తులను జాయింట్‌ కలెక్టర్లు, తహసీల్దార్లు ప్రత్యేకంగా పరిశీలించి త్వరగా పరిష్కరించాలని మీనా సూచించారు. తహసీల్దార్ల స్థాయిలో జాప్యం జరగకుండా జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడం లేదా నిర్లక్ష్యం వహించడం జరిగితే సంబంధిత అధికారిని బాధ్యులను చేస్తామని హెచ్చరించారు.

మైన్స్‌ అధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఎన్‌ఓసీ కోసం రెవెన్యూ అధికారులకు పంపాలని ఆదేశించారు. ఇప్పటికే ఉన్న లీజులను స్పష్టంగా చూపిస్తూ ఏరియా ప్లాన్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించాలని, రిజర్వ్‌డ్‌ ఫారెస్ట్‌కు 500 మీటర్ల పరిధిలో ఉన్న భూములకు సంబంధించి తహసీల్దార్‌కు ఎన్‌ఓసీ అభ్యర్థన పంపడంతో పాటు సంబంధిత జిల్లా అటవీ అధికారికి కూడా అదే సమయంలో సమాచారం ఇవ్వవలసి ఉందని చెప్పారు.

అసైన్డ్‌, పట్టా భూములకు సంబంధించిన దరఖాస్తుల విషయంలో తాజా భూ రికార్డుల ఆధారంగా అసైనీలు, పట్టాదారుల వివరాలను నమోదు చేసి, వారి సమ్మతి తీసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అటవీ ప్రాంతాలకు సమీపంలోని భూముల విషయంలో రెవెన్యూ, అటవీ, మైన్స్‌ అధికారులు సంయుక్తంగా పరిశీలన చేసి నిర్ణీత విధానాన్ని పాటించాలని ఆదేశించారు.

ఓఎంఈపీఎస్‌ 2.0లో దరఖాస్తులపై తీసుకున్న ప్రతి చర్య, నమోదు చేసిన వ్యాఖ్యలు, పత్రాల అప్‌లోడ్‌, తదుపరి అధికారికి పంపిన వివరాలు ఇలా అన్ని ఆన్‌లైన్‌లో నమోదవుతాయని అధికారులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. పెండింగ్‌ దరఖాస్తులపై ఉన్నతస్థాయిలో కూడా పర్యవేక్షణ జరిగేలా ఈ విధానం రూపు దిద్దుకుందన్నారు.

ఈ సమావేశంలో మైన్స్‌ అండ్‌ జియాలజీ శాఖ డైరెక్టర్‌ డబ్ల్యూ.బి. చంద్రశేఖర్, అదనపు డైరెక్టర్‌ డి. శ్రీనివాసరావు, జాయింట్‌ డైరెక్టర్‌ జి. శ్రీనివాస్‌ చౌదరి సచివాలయం నుంచి పాల్గొన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన జాయింట్‌ కలెక్టర్లు, జిల్లా అటవీ అధికారులు, జిల్లా మైన్స్‌ అండ్‌ జియాలజీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పట్టాల పంపిణీతో 26వేల పేద కుటుంబాలకు భరోసా

-డబుల్ ఇంజన్ సర్కార్‌తో పేదలకు వందల రెట్ల లబ్ది -ఎన్టీఆర్ జిల్లాలో ఇంటి పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *