Breaking News

ప్రతిభకు వేదిక విజయవాడ ఉత్సవ్

-46విభాగలు… 100కు పైగా పోటీలు .. ఏడు టైటిల్స్
-డాన్స్‌ నుంచి మ్యూజిక్ వరకు.. చిత్రలేఖనం నుంచి కాలిగ్రఫీ వరకు
-అక్టోబర్ 8 నుంచి 12 వరకు తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదిక గా పోటీలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర ప్రజల్లోని కళా, సాంస్కృతిక ప్రతిభను వెలికితీసేందుకు విజయవాడ ఉత్సవ్‌ వేదికగా విభిన్న కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు విజయవాడ ఉత్సవ్‌, జిజ్ఞాస సభ్యులు తెలిపారు. సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక శాఖ సహకారంతో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్‌లో భాగంగా కేశినేని ఫౌండేషన్‌, జిజ్ఞాస ఆర్ట్‌వర్స్ ఆధ్వర్యంలో అక్టోబర్ 8 నుంచి 12వ తేదీ వరకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వివిధ పోటీలు నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పీబీ సిద్ధార్థ కళాశాల, బీఎస్‌ఆర్‌కే స్కూల్, మోడరన్ అకాడమీ స్కూల్ అండ్ కాలేజ్, అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సంగీత కళాశాలలో విజయవాడ ఉత్సవ్‌, జిజ్ఞాస సభ్యులు, సంస్థ నిర్వహణ బృందం, విద్యార్థులు, అధ్యాపకులతో సమావేశమై ఉత్సవంలో నిర్వహించనున్న పోటీల వివరాలను తెలియజేశారు.

విజయవాడ ఉత్సవ్‌లో భాగంగా మొత్తం 46 విభాగాల్లో , 100కు పైగా పోటీలు ఏడు టైటిల్స్‌ కోసం నిర్వహించనున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ పాల్గొనేలా పోటీలను రూపొందించారు. డాన్స్‌, మ్యూజిక్‌, చిత్రలేఖనం, కాలిగ్రఫీ, రంగోలి, వంటల తయారీ, ఫోటోగ్రఫీ, మేకింగ్‌ వంటి విభిన్న విభాగాలతో పాటు మిస్ విజయవాడ వంటి ప్రత్యేక పోటీలను కూడా నిర్వహించనున్నారు.వయస్సు, ఆసక్తి, ప్రతిభకు అనుగుణంగా ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించేలా ఈ కార్యక్రమాలను రూపొందించామని నిర్వాహకులు తెలిపారు. విజయవాడ నగరంలో ఉన్న కళాకారులు, విద్యార్థులు, యువత, మహిళలు, చిన్నారులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాలని వారు పిలుపునిచ్చారు.

జిజ్ఞాస సంస్థ టీమ్ మాట్లాడుతూ

విజయవాడ ఉత్సవ్‌ ప్రతి ఒక్కరి ఉత్సవంగా ఉండాలన్నదే నిర్వాహకుల లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలందరినీ విజయవాడ ఉత్సవంలో భాగస్వాములను చేయడానికి కార్యక్రమాలను రూపొందిస్తున్నామని తెలిపారు.ప్రతి ఒక్కరిలో దాగి ఉన్న కళ, ప్రతిభను వెలికితీసేందుకు విజయవాడ ఉత్సవ్‌ ఒక మంచి వేదికగా నిలుస్తుందని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు, కళాకారులు, నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.పోటీల్లో పాల్గొనాలనుకునే వారు విజయవాడ ఉత్సవ్‌, జిజ్ఞాస ఆర్ట్‌వర్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీల ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. రిజిస్ట్రేషన్‌కు అక్టోబర్ 7 చివరి తేదీ అని వెల్లడించారు.విజయవాడ నగరంలోని ప్రతి వర్గానికి చెందిన ప్రజలు ఉత్సవంలో భాగస్వాములు కావాలని, తమ ప్రతిభను ప్రదర్శించి విజయవాడ ఉత్సవాన్ని మరింత వైభవంగా విజయవంతం చేయాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున్ యాదవ్, చెన్నుపాటి ఉషారాణి, ఎం.మానస, కే.మానస, బి.హరిత, డి.పావని, కే.కల్పన తదితరులు, విజయవాడ ఉత్సవ్‌, జిజ్ఞాస సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పట్టాల పంపిణీతో 26వేల పేద కుటుంబాలకు భరోసా

-డబుల్ ఇంజన్ సర్కార్‌తో పేదలకు వందల రెట్ల లబ్ది -ఎన్టీఆర్ జిల్లాలో ఇంటి పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *