-పెండింగ్ విద్యుత్ పనులన్నీ పూర్తి చేస్తున్న కూటమి ప్రభుత్వం: మంత్రి గొట్టిపాటి రవి
-తిరువూరు పారిశ్రామిక అవసరాలన్నీ తీర్చేందుకు చర్యలు: ఎంపీ కేశినేని చిన్ని
తిరువూరు(ఏ కొండూరు మండలం), నేటి పత్రిక ప్రజావార్త :
తిరువూరు నియోజకవర్గ అభివృద్ధికి విద్యుత్ మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాస్ తెలిపారు.తిరువూరు నియోజకవర్గంలోని ఏ.కొండూరు మండలంలో మంత్రి గొట్టిపాటి రవి, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా కృష్ణారావుపాలెంలోని బీసీ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏ.కొండూరు మండలంలో నూతనంగా నిర్మించిన 220/132/33 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ తిరువూరు నియోజకవర్గానికి వచ్చి సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవంతో పాటు సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి గొట్టిపాటి రవికి కృతజ్ఞతలు తెలిపారు.కొత్తగా ప్రారంభించిన సబ్‌స్టేషన్ వల్ల తిరువూరు ప్రాంత ప్రజలతో పాటు రైతులు, పరిశ్రమలకు విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుందని చెప్పారు. ఈ సబ్‌స్టేషన్ ద్వారా తిరువూరుతో పాటు మైలవరం ప్రాంత ప్రజలకు కూడా ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.మంత్రి గొట్టిపాటి రవి విద్యుత్ శాఖ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న సబ్స్టేషన్లతో పాటు కొత్తగా చేపట్టిన విద్యుత్ మౌలిక వసతుల పనులను వేగంగా పూర్తి చేస్తున్నారని ఎంపీ చిన్ని తెలిపారు. రానున్న రోజుల్లో గంపలగూడెంలో కూడా సబ్‌స్టేషన్‌ను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.తిరువూరు నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన విద్యుత్ మౌలిక వసతులను కల్పించి, పరిశ్రమల అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ చిన్ని స్పష్టం చేశారు.
మంత్రి గొట్టిపాటి రవి మాట్లాడుతూ
ఏ.కొండూరు మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు, పరిశ్రమలకు ఎలాంటి విద్యుత్ ఇబ్బందులు లేకుండా ఉండాలనే లక్ష్యంతో ఈ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు.ఈ సబ్‌స్టేషన్ పనులు 2020లోనే ప్రారంభమైనప్పటికీ గత పాలకులు వాటిని పట్టించుకోకపోవడంతో పెండింగ్‌లో ఉండిపోయాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పెండింగ్‌లో ఉన్న విద్యుత్ పనులన్నింటినీ ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తున్నామని తెలిపారు.విద్యుత్ టవర్ల నిర్మాణానికి సంబంధించి కొంతమంది రైతులు సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని, వాటిని కూడా త్వరలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.గత రెండు సంవత్సరాలుగా విద్యుత్ బిల్లులు పెంచకుండా ప్రజలకు విద్యుత్ సేవలు అందిస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. విద్యుత్ శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు అందిస్తున్న సూచనలు, సలహాలను తీసుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు.ట్రాన్స్‌కో సబ్స్టేషన్లు, ట్రాన్స్‌కో లైన్లు, 33/11 కేవీ సబ్స్టేషన్లను బలోపేతం చేస్తూ రైతులు, వ్యవసాయ రంగం, పరిశ్రమలు, ప్రజలకు నిరంతరాయంగా మెరుగైన విద్యుత్ అందించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి వివరించారు.ఏ.కొండూరు ప్రాంతంలో 220/132/33 కేవీ సబ్‌స్టేషన్ అందుబాటులోకి రావడంతో స్థానిక విద్యుత్ అవసరాలు మరింత సమర్థవంతంగా తీరనున్నాయని, ప్రాంత అభివృద్ధికి ఇది దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News