Breaking News

పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యమే లక్ష్యం అక్టోబర్ 2న విజయవాడ – అమరావతిలో ‘స్వచ్ఛతాన్’ మారథాన్

-10 వేల మందితో భారీ పరుగుకు సన్నాహాలు
-స్వచ్ఛతాన్ మారథాన్‌తో పరిశుభ్రతపై ప్రజల్లో మరింత అవగాహన
-స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి రామ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహించే స్వచ్ఛ దివస్ సందర్భంగా విజయవాడ–అమరావతి ప్రాంతంలో “స్వచ్ఛతాన్” మారథాన్ నిర్వహిస్తున్నట్లు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి రామ్ తెలిపారు. విజయవాడ ప్రైవేట్ హోటల్ లో నిర్వహించిన పత్రిక విలేకరుల సమావేశంలో మంగళవారం స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి రామ్ “స్వచ్ఛతాన్” మారథాన్ వివరాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి రామ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ అభియాన్ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా పరిశుభ్రత, పారిశుధ్యంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో 2025 జనవరి నుంచి “స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర” ఉద్యమాన్ని విస్తృతంగా నిర్వహిస్తూ ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని ప్రజల్లో మరింతగా ప్రోత్సహించేందుకు గత ఏడాది ప్రారంభించిన “స్వచ్ఛతాన్” రన్ తొలి ఎడిషన్ విజయవంతమైందని, దేశవ్యాప్తంగా సుమారు 6 వేల నుంచి 7 వేల మంది రన్నర్లు పాల్గొన్నారని తెలిపారు. ఈ ఏడాది నిర్వహిస్తున్న రెండో ఎడిషన్‌కు హెచ్డిఎఫ్సి బ్యాంక్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోందన్నారు. పరిశుభ్రత, పారిశుధ్యం, ఆరోగ్యం అనే ప్రధాన ఇతివృత్తాలతో నిర్వహిస్తున్న “స్వచ్ఛతాన్” మారథాన్‌కు ఈ ఏడాది సుమారు 10 వేల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు కొమ్మారెడ్డి పట్టాభి రామ్ తెలిపారు. 5కె, 10కె, 21కె (హాఫ్ మారథాన్) విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని, విజేతలకు మొత్తం రూ.10 లక్షల నగదు బహుమతులు అందించనున్నట్లు చెప్పారు. అక్టోబర్ 2న ఉదయం 5 గంటలకు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి స్వచ్ఛతాన్ మారథాన్ ప్రారంభమవుతుంది. మంత్రి నారా లోకేష్ మారథాన్‌ను ఫ్లాగ్ ఆఫ్ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, కందుల దుర్గేష్, పొంగూరు నారాయణ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో పాటు సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం → పోలీస్ కంట్రోల్ రూమ్ → వినాయకుడి గుడి → సీతమ్మ వారి పాదాలు → కృష్ణా బ్యారేజ్ → స్టీల్ బ్రిడ్జి → అమరావతి రాజధాని ప్రాంతంలోని మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం వరకు కొనసాగి, తిరిగి విజయవాడకు చేరుకుంటుందని తెలిపారు. మారథాన్‌కు విజయవాడ పోలీస్ కమిషనరేట్, మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ సమన్వయంతో పూర్తి బందోబస్తు, రూట్ క్లియరెన్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. 10కె, 21కె విభాగాల్లో పాల్గొనే రన్నర్లకు సాంకేతికంగా సమయాన్ని నమోదు చేసే టైమింగ్ బిబ్స్‌ను అమ్మా కల్యాణమండపం వద్ద అందించనున్నట్లు తెలిపారు. మార్గమధ్యంలో రన్నర్లను ప్రోత్సహించేందుకు డ్రమ్మర్లు, కళాబృందాల ప్రదర్శనలు, జుంబా మరియు ఇతర వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి అమరావతి రన్నర్స్ ఆర్గనైజింగ్ పార్ట్‌నర్‌గా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ టైటిల్ స్పాన్సర్‌గా, మెడ్సిటీ మెడికల్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాగా, రిజిస్ట్రేషన్ చేసుకోని వారు కూడా 5కె రన్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గాంధీ జయంతి, స్వచ్ఛ దివస్ సందర్భంగా నిర్వహిస్తున్న ఈ మారథాన్ స్వచ్ఛాంధ్ర ఉద్యమంలో భాగంగా పరిశుభ్రత, పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఉద్దేశించబడిందని కొమ్మారెడ్డి పట్టాభి రామ్ తెలిపారు. రాబోయే దసరా ఉత్సవాలకు విజయవాడ నగరం సిద్ధమవుతున్న నేపథ్యంలో “స్వచ్ఛతాన్” మారథాన్ దసరా ఉత్సవాలకు కర్టెన్ రైజర్‌గా నిలవనుందని ఆయన పేర్కొన్నారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ సమావేశంలో అమరావతి రన్నర్స్ ప్రతినిధి రావి రమేష్, హెచ్‌డిఎఫ్‌సి ఏరియా హెడ్ అఫ్ ఆపరేషన్ ప్రతినిధి పవన్, మెడ్‌స్టార్ హాస్పిటల్స్ ప్రతినిధి ప్రేమ్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పట్టాల పంపిణీతో 26వేల పేద కుటుంబాలకు భరోసా

-డబుల్ ఇంజన్ సర్కార్‌తో పేదలకు వందల రెట్ల లబ్ది -ఎన్టీఆర్ జిల్లాలో ఇంటి పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *