Breaking News

మలేరియా కేసుల నియంత్రణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు

-కేసులు పెరిగిన తర్వాత మేల్కొనడం కాదు.. ముందే గుర్తించి అడ్డుకోవాలి
-ఒక్క మలేరియా మరణం కూడా జరగకూడదు
-రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కె.వి.ఎన్‌. చక్రధరబాబు స్పష్టీకరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో మలేరియా కేసుల నియంత్రణలో నిర్లక్ష్యం, అలసత్వం, జాప్యాన్ని ఎంతమాత్రం సహించేది లేదని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కె.వి.ఎన్‌. చక్రధరబాబు అధికారులను హెచ్చరించారు. కేసులు పెరిగిన తర్వాత స్పందించడం అధికారుల పని కాదని.. కేసులు పెరగకుండా ముందే గుర్తించి అడ్డుకోవడమే బాధ్యత అని స్పష్టం చేశారు. ఒక్క మలేరియా కేసును కూడా తేలికగా తీసుకోవద్దని, ముఖ్యంగా గిరిజన, మారుమూల, అధిక ప్రమాద ప్రాంతాల్లో అప్రమత్తతను మరింత పెంచాలని ఆదేశించారు.

ముందస్తు నిఘా.. సత్వర పరీక్షలు.. సకాలంలో చికిత్స.. దోమల నియంత్రణ.. మందుల పూర్తి లభ్యత.. ఈ ఐదు అంశాల్లో ఎక్కడా లోపం ఉండకూడదని చక్రధరబాబు స్పష్టం చేశారు.

విజయవాడలో మంగళవారం జరిగిన 28 జిల్లాల అధికారుల రాష్ట్రస్థాయి కార్యశాలలో మలేరియా పరిస్థితి, వ్యాధుల నిఘా, క్షేత్రస్థాయిలో దోమల నియంత్రణ, మందుల లభ్యత, సిబ్బంది పనితీరు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఐహెచ్‌ఐపీ–ఐడీఎస్‌పీ సమాచారం, ఏవేర్‌, ఏడీఎస్‌ వ్యవస్థల వినియోగం, క్రియాశీల–సాధారణ నిఘా, దోమల నియంత్రణ చర్యలు, మలేరియా నివారణ మందుల నిల్వలు, సిబ్బంది సామర్థ్య పెంపుపై చర్చించారు. ప్రతి జిల్లాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని కమిషనర్‌ అధికారులను ఆదేశించారు. ఏ ప్రాంతంలో కేసులు పెరుగుతున్నాయో ముందుగానే గుర్తించి, అక్కడ వెంటనే నియంత్రణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

కేసులు పెరిగే వరకు చూస్తే కుదరదు

మలేరియా కేసులు పెరిగిన తర్వాత చర్యలు ప్రారంభించడం అంటే జాప్యమేనని కమిషనర్‌ స్పష్టం చేశారు. వ్యాధి వ్యాప్తికి సంబంధించిన తొలి సంకేతాలు కనిపించిన వెంటనే అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని ఆదేశించారు. సమాచారం అందిన తర్వాత కూడా చర్యలు తీసుకోకపోతే దాన్ని నిర్లక్ష్యంగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించారు.

గిరిజన ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల్లో జ్వర కేసులపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. జ్వరం వచ్చిన ప్రతి వ్యక్తికి అవసరమైన పరీక్షలు నిర్వహించి, మలేరియా నిర్ధారణ అయితే వెంటనే చికిత్స అందించాలని సూచించారు. మారుమూల ప్రాంతం కావడంతో కేసు ఆలస్యంగా గుర్తించే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు.

సమాచారం వస్తే.. వెంటనే చర్య ఉండాలి

ఐహెచ్‌ఐపీ–ఐడీఎస్‌పీ ద్వారా అందుతున్న సమాచారాన్ని నిరంతరం పరిశీలించి, దాని ఆధారంగా ప్రమాద ప్రాంతాలను వెంటనే గుర్తించాలని ఆదేశించారు. ఏవేర్‌, ఏడీఎస్‌ వ్యవస్థలను పూర్తిస్థాయిలో వినియోగించి ముందస్తు నిఘాను మరింత బలోపేతం చేయాలని సూచించారు. మలేరియా కేసుల గుర్తింపులో క్రియాశీల, సాధారణ నిఘా రెండూ బలంగా ఉండాలని కమిషనర్‌ అన్నారు. కేసులను గుర్తించడంతో పాటు దోమల పరిస్థితిని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు.

మలేరియా కేసులు నమోదైన ప్రాంతాల్లో దోమల నియంత్రణ చర్యలను వెంటనే, యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో ఏఎల్‌ఓ, ఐఆర్‌ఎస్‌, ఐఎస్‌ఎస్‌, పొగ పిచికారీ వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. కేసులు పెరిగిన తర్వాత చర్యలు చేపట్టడం కాదు.. కేసులు పెరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందే గుర్తించి నియంత్రణ చర్యలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

మందులు లేకపోతే బాధ్యత ఎవరిది?

మలేరియా పరిస్థితిని బట్టి మందుల అవసరాన్ని ముందుగానే అంచనా వేసి తగినంత నిల్వలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. కేసు వచ్చిన తర్వాత మందుల కోసం వెతికే పరిస్థితి ఎంతమాత్రం ఉండకూడదని స్పష్టం చేశారు. మలేరియా నివారణ మందుల లభ్యత, నిల్వలపై సమావేశంలో ప్రత్యేకంగా సమీక్ష జరిగింది.

కేటాయించిన నిధులను నిర్దిష్ట వ్యవధిలోగా వినియోగించాలని స్పష్టం చేశారు. ముందస్తు ప్రణాళికను సక్రమంగా రూపొందించకపోవడం వల్లే నిధుల వినియోగంలో వెనుకబడుతున్నారని పేర్కొన్నారు.

సిబ్బంది క్షేత్రస్థాయి పనితీరుపై అధికారులు నిఘా పెట్టాలి

మలేరియా నియంత్రణలో పనిచేస్తున్న సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించాలని, వారు క్షేత్రస్థాయిలో సక్రమంగా పనిచేస్తున్నారా లేదా అన్నది అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్‌ ఆదేశించారు. కాగితాలపై నివేదికలు కాకుండా.. క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించాలని స్పష్టం చేశారు.

మలేరియాతో పాటు కాలాజార్‌, ఫైలేరియా వ్యాధుల వివరాలను కూడా పక్కాగా నమోదు చేసి ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. సమాచారం, నివేదికల్లో జాప్యం చేయవద్దని, ఏ స్థాయిలోనైనా నిర్లక్ష్యం బయటపడితే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఒక్క మలేరియా మరణం కూడా జరగకూడదు

మలేరియా నియంత్రణలో నిర్లక్ష్యానికి తావులేదని, జాప్యాన్ని సహించేది లేదని కమిషనర్‌ కె.వి.ఎన్‌. చక్రధరబాబు స్పష్టం చేశారు. కేసులు పెరిగే వరకు వేచి చూడొద్దని.. ముందే గుర్తించాలి.. వెంటనే స్పందించాలి.. వ్యాధిని అక్కడికక్కడే అడ్డుకోవాలని ఆదేశించారు.

ముఖ్యంగా గిరిజన, మారుమూల, అధిక ప్రమాద ప్రాంతాల్లో అధికారులు మరింత అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ఒక్క మలేరియా మరణం కూడా జరగకుండా ప్రతి అధికారి, ప్రతి సిబ్బంది బాధ్యతతో పనిచేయాలని చక్రధరబాబు స్పష్టం చేశారు.

సమావేశంలో ప్రజారోగ్య శాఖ అదనపు సంచాలకులు డాక్టర్‌ వెంకటరమణ, జాయింట్‌ డైరెక్టర్‌ అర్జునరావు, డిప్యూటీ డైరెక్టర్‌ వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పట్టాల పంపిణీతో 26వేల పేద కుటుంబాలకు భరోసా

-డబుల్ ఇంజన్ సర్కార్‌తో పేదలకు వందల రెట్ల లబ్ది -ఎన్టీఆర్ జిల్లాలో ఇంటి పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *