– ఉద్యోగులకు నాణ్యమైన నగదు రహిత వైద్యం అందించాలి
– ఏపీ ఎన్జీజీవోస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎ. విద్యాసాగర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఈహెచ్‌ఎస్ ద్వారా నాణ్యమైన, నిరంతరాయమైన క్యాష్‌లెస్ వైద్య సేవలు అందేలా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎ. విద్యాసాగర్ కోరారు.
ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్‌లో మంగళవారం జరిగిన ఈహెచ్‌ఎస్ సమావేశంలో ఏపీ ఎన్జీజీవోస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎ. విద్యాసాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి. రమణ పాల్గొన్నారు. నూతనంగా సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన పద్మావతికి రాష్ట్ర కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగుల నుంచి వసూలు చేస్తున్న ఉద్యోగుల వాటాతో పాటు ప్రభుత్వ వాటాను నేరుగా ట్రస్ట్‌కు బదిలీ చేసేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగుల పక్షాన స్వాగతిస్తున్నట్లు విద్యాసాగర్ తెలిపారు. ఈ నిర్ణయానికి సీఈవోకు ధన్యవాదాలు తెలిపారు. ఈహెచ్‌ఎస్ పరిధిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న వైద్య సమస్యలను పరిష్కరించి, క్యాష్‌లెస్ వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. ఈహెచ్‌ఎస్ ప్యాకేజీ రేట్లను సవరించడం, వార్షిక ఆరోగ్య పరీక్షల విధానాన్ని ప్రారంభించడం, వైద్య ఖర్చుల బిల్లుల పరిష్కారంలో జాప్యాన్ని తగ్గించడం, ఈహెచ్‌ఎస్ ఆసుపత్రుల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం వంటి అంశాలను సమావేశంలో ప్రస్తావించారు. విశ్రాంత సీపీఎస్ ఉద్యోగులకు కూడా ఈహెచ్‌ఎస్ సదుపాయాన్ని వర్తింపజేసి, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య భద్రత కల్పించాలని కోరారు. ఇందుకోసం వారు చెల్లించాల్సిన ఒకేసారి చెల్లించే మొత్తాన్ని త్వరితగతిన నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు.
అక్టోబర్ రెండో వారంలో ఉమ్మడి సమావేశం:
ఉద్యోగ సంఘాలు, ఆసుపత్రుల యాజమాన్యాలతో అక్టోబర్ రెండో వారంలో ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ఈహెచ్‌ఎస్ సీఈవో పద్మావతి హామీ ఇచ్చారు. వైద్య పరిమితి సీలింగ్‌ను పెంచడం, ఈహెచ్‌ఎస్ ప్యాకేజీ రేట్లను సవరించడం, నగదురహిత హెల్త్ కార్డుల ద్వారా సమగ్ర వైద్య సేవలు అందించడం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు డిజిటల్ హెల్త్ కార్డులు అందజేస్తామని సీఈవో తెలిపారు. పూర్తి స్థాయిలో క్యాష్‌లెస్ వైద్య సేవలు అందించేందుకు ఉద్యోగుల కంట్రిబ్యూషన్ పెంచాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. ఈహెచ్‌ఎస్ విధానాన్ని మరింత బలోపేతం చేసి ఉద్యోగులు, పెన్షనర్లకు సులభతరమైన, నాణ్యమైన, పారదర్శకమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధ్యక్షులు ఎ. విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డి.వి. రమణ కోరారు.
మంగళగిరిలోనీ ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ కార్యాలయంలో ఈహెచ్ఎస్ సీఈవో శ్రీమతి పద్మావతి గారి అధ్యక్షతన జరిగిన ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో ఏపీ ఎన్జీజివో జీవో సంఘ ప్రధాన కార్యదర్శి డి వి రమణ, AP యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క వెంకటేశ్వర్లు, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి హృదయ రాజు, పిఆర్టియు రాష్ట్ర సంఘ అధ్యక్షుడు శఎం కృష్ణయ్య, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ మహిళా విభాగం నాయకురాలు రాజ్యలక్ష్మి, విజయవాడ నగర శాఖ అధ్యక్షులు సి.వి.ఆర్. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News