-అన్ని శాఖల సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ.. అధికారుల బాధ్యతలు ఖరారు చేసిన ప్రభుత్వం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ ఇసుక తవ్వకాలు, ఖనిజాల అక్రమ తవ్వకాలు, అనధికార రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ శాఖల మధ్య సమన్వయంతో పనిచేసేలా సమగ్ర మధ్యంతర మార్గదర్శకాలను జారీ చేసింది. అక్రమ తవ్వకాలపై వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిశీలించడం, సంయుక్త తనిఖీలు నిర్వహించడం, బాధ్యులపై చర్యలు తీసుకోవడం, విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై బాధ్యత ఖరారు చేయడం వంటి అంశాలకు మార్గదర్శకాల్లో ప్రాధాన్యం ఇచ్చింది.
బాపట్ల జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలపై అమాంచి కృష్ణమోహన్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (W.P. (PIL) No.227 of 2026)పై అక్టోబర్ 1న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమ తవ్వకాలను అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, సంబంధిత అధికారుల బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించాలని హైకోర్టు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో నవంబర్ 3న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. గనులు, భూగర్భ వనరులు, జలవనరులు, రెవెన్యూ, అటవీ, హోం, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
గత రెండేళ్లలో ఇసుక అక్రమాలపై గనులు, భూగర్భ వనరుల శాఖ 2,113 కేసులు నమోదు చేసింది. వీటికి సంబంధించి రూ.6.24 కోట్ల జరిమానా విధించగా, 117 వాహనాలను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చారు. 21 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. చిన్న ఖనిజాలకు సంబంధించి 2024-25 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు 9,120 ఉల్లంఘన కేసులు నమోదు కాగా, రూ.340.9 కోట్ల జరిమానా విధించారు.
కొత్త మార్గదర్శకాల ప్రకారం ఏ భూమి ఎవరి ఆధీనంలో ఉందో ఆ శాఖకు చెందిన క్షేత్రస్థాయి అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించాలి. అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే ఫిర్యాదు కోసం వేచి చూడకుండా వెంటనే చర్యలు ప్రారంభించాలి. నదీ పరివాహక ప్రాంతాలు, జలవనరుల పరిధిలో జలవనరుల శాఖ అధికారులు, ప్రభుత్వ భూముల్లో రెవెన్యూ అధికారులు, అటవీ భూముల్లో అటవీ శాఖ అధికారులు, పంచాయతీరాజ్ పరిధిలోని భూముల్లో సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేపట్టాలి.
పత్రికలు, టీవీలు, డిజిటల్ మీడియా, హెల్ప్‌లైన్, విజిలెన్స్ యాప్, ప్రజల వినతులు తదితర మార్గాల్లో అందే అన్ని ఫిర్యాదులను జిల్లా గనులు, భూగర్భ వనరుల అధికారి ప్రత్యేక కేసు నంబరుతో నమోదు చేయాలి. ఇతర శాఖల అధికారులకు ఫిర్యాదులు అందితే వెంటనే ఆ అధికారికి పంపించాలి.
ఫిర్యాదు అందిన మూడు పని దినాల్లో భూమి వివరాలు, యాజమాన్య హక్కులు, భౌగోళిక కోఆర్డినేట్లను సంబంధిత శాఖలు అందించాలి. అదే సమయంలో గనులు, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు, అవసరాన్ని బట్టి ఇతర శాఖల సిబ్బందితో కలిసి సంయుక్త క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి మూడు పని దినాల్లో నివేదిక సమర్పించాలి.
అక్రమ తవ్వకాలు నిర్ధారణ అయితే తవ్విన ఖనిజాల పరిమాణం, ప్రభుత్వానికి జరిగిన ఆదాయ నష్టాన్ని అంచనా వేయాలి. జరిమానాలు విధించి వసూలు చేయడంతో పాటు అక్రమ రవాణాకు ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకోవాలి. అవసరమైన సందర్భాల్లో వాహనాలను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చి, కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. చెల్లించని జరిమానాలను రెవెన్యూ రికవరీ చట్టం కింద వసూలు చేయాలి.
అక్రమ తవ్వకాల నియంత్రణలో అధికారుల నిర్లక్ష్యం కారణమని తేలితే జిల్లా కలెక్టర్లు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. తనిఖీలకు వెళ్లే అధికారులకు పోలీసు రక్షణ కల్పించాలని, నేరం జరిగినట్లు గుర్తించిన సందర్భాల్లో ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని ఎస్పీలను ప్రభుత్వం ఆదేశించింది.
ప్రతి జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్‌ను క్రియాశీలం చేయాలి. ఎస్పీ, జాయింట్ కలెక్టర్, గనులు, రెవెన్యూ, అటవీ, జలవనరులు, రవాణా, పంచాయతీరాజ్, భూగర్భ జలాలు, కాలుష్య నియంత్రణ మండలి తదితర శాఖల అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు.
ఈ టాస్క్‌ఫోర్స్ ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశమై నమోదైన కేసులు, తీసుకున్న చర్యలు, పెండింగ్‌లో ఉన్న వ్యవహారాలను సమీక్షించాలి. ప్రతి కేసుకు బాధ్యత వహించే అధికారిని, చర్యలు పూర్తి చేయాల్సిన గడువును సమావేశపు మినిట్స్‌లో నమోదు చేయాలి.
ఫిర్యాదుల నమోదు, తనిఖీ నివేదికలు, తీసుకున్న చర్యలు, కేసుల పురోగతిని పర్యవేక్షించేందుకు 30 రోజుల్లో ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని గనులు, భూగర్భ వనరుల శాఖ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. దీనికి అనుగుణంగా అన్ని శాఖల ఉన్నతాధికారులు కేసుల వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించేలా డ్యాష్‌బోర్డును కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.
హోం, రెవెన్యూ, అటవీ, జలవనరులు, రవాణా, పంచాయతీరాజ్, పురపాలక శాఖలు 15 రోజుల్లో తమ సూచనలు, సలహాలను ప్రభుత్వానికి అందించాలి. నవంబర్ నెలాఖరులో గనులు, భూగర్భ వనరుల శాఖ ఆధ్వర్యంలో మరో సమావేశం నిర్వహించి, అన్ని శాఖల సూచనల ఆధారంగా సమగ్ర మార్గదర్శకాలను రూపొందించి రాష్ట్రస్థాయి కమిటీకి సమర్పించనున్నారు.
ఈ ఆదేశాలను అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, గనులు, భూగర్భ వనరుల శాఖ డైరెక్టర్ కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
