-ఆరోజు రాష్ట్ర స్థాయిల్లో జాతీయ పత్రికా దినోత్సవం నిర్వహించాలి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదీని జాతీయ పత్రికా దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యదర్శి శుభా గుప్తా అన్ని రాష్ట్రాల సమాచార పౌరసంబంధాల శాఖలకు వ్రాసిన లేఖలో తెలియజేశారు.భారత దేశంలో పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడం,వార్తాపత్రికలు మరియు వార్తా సంస్థల ప్రమాణాలను నిర్వహించడం,మెరుగుపరచడం అనే లక్ష్యాలతో పార్లమెంటు చట్టం ద్వారా భారత ప్రెస్ కౌన్సిల్ను 1966లో తొలిసారిగా స్వతంత్ర అర్ధన్యాయ సంస్థగా ఏర్పాటు చేశారని అనంతరం 1979లో తిరిగి పునరుద్ధరించారని ఆయన గుర్తు చేశారు.అందువల్ల ఆరోజును భారతదేశంలో పత్రికా స్వేచ్ఛకు,నైతిక జర్నలిజానికి ప్రతీకగా స్మరించుకుంటారని పేర్కొన్నారు.ఈ సంవత్సరం జాతీయ పత్రికా దినోత్సవ కార్యక్రమం యొక్క ప్రధాన ఇతివృత్తం:“జర్నలిజం: ప్రజాకర్షక ధోరణా? బాధ్యతాయుతమైన జర్నలిజమా?”(“Journalism: Populist or Responsible”) కావున,కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంబంధిత శాఖలు,పత్రికా సంస్థలు, జర్నలిజం విద్యాసంస్థల భాగస్వామ్యంతో రాష్ట్ర స్థాయిలో జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమాలను నిర్వహించవలసిందిగా శుభా గుప్తా ఆలేఖలో విజ్ణప్తి చేశారు.
ప్రస్తుతం మీడియా రంగం వేగంగా మారుతున్న నేపథ్యంలో ప్రేక్షకులు మరియు పాఠకుల దృష్టిని ఆకర్షించేందుకు పోటీ పెరుగుతోంది.డిజిటల్ మరియు సోషల్ మీడియా వేదికల ప్రభావం కూడా రోజురోజుకూ పెరుగుతోంది.ఈ పరిణామాల నేపథ్యంలో జర్నలిస్టుల పాత్ర మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.ప్రేక్షకుల సంఖ్యను పెంచుకోవడం వార్తలకు వచ్చే క్లిక్ల సంఖ్య టెలివిజన్ రేటింగ్ పాయింట్లు (TRPలు) ప్రకటనల ఆదాయం వంటి అంశాలు వార్తల సేకరణ తయారీ మరియు ప్రసార విధానాలను ప్రభావితం చేస్తున్నాయి.అదే సమయంలో డిజిటల్ సాంకేతికత వల్ల సామాన్య పౌరులు కూడా సంఘటనలను నివేదించడం,సమాచారాన్ని పంచుకోవడం ప్రజా చర్చల్లో నేరుగా పాల్గొనడం సాధ్యమైంది.ఈ పరిణామాలు సమాచారానికి ప్రజల ప్రాప్యతను విస్తరించడంతో పాటు ప్రజాస్వామ్య భాగస్వామ్యానికి కొత్త అవకాశాలను కల్పించాయి.అయితే సమాచార విశ్వసనీయత జవాబుదారీతనం,జర్నలిస్టుల బాధ్యత వంటి కీలకమైన అంశాలపై ప్రశ్నలను కూడా లేవనెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో ప్రజాకర్షక జర్నలిజం (Populist Journalism), బాధ్యతాయుత జర్నలిజం (Responsible Journalism) మధ్య ఉన్న వ్యత్యాసంపై లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది.
ప్రజాకర్షక జర్నలిజం (Populist Journalism)
ప్రస్తుత మీడియా పరిస్థితుల్లో ప్రజాకర్షక జర్నలిజం అనేది ప్రజల అభిప్రాయాలు తక్షణ సమాచారం ప్రేక్షకుల ఆదరణకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది.కొన్నిసార్లు వాస్తవాలు నేపథ్యం ప్రజా ప్రయోజనం జాతీయ భద్రత వంటి అంశాలను పక్కనపెడుతుంది.ప్రధాన స్రవంతి మీడియాలో ఇది సంచలనాత్మక వార్తలు అతిశయోక్తితో కూడిన శీర్షికలు ఊహాగానాలతో కూడిన కథనాలు నాటకీయమైన వార్తా ప్రదర్శనల రూపంలో కనిపిస్తుంది.అలాగే డిజిటల్ వేదికల ద్వారా సామాన్య వ్యక్తులు రూపొందించిన సమాచారం వృత్తిపరమైన జర్నలిస్టులు కాని వ్యక్తులు ప్రచారం చేసే నిర్ధారణ కాని వార్తలు ఎలాంటి సంపాదకీయ పరిశీలన లేకుండానే వేగంగా వ్యాప్తి చెందడం కూడా ఇందులో భాగమే.ఇలాంటి ప్రజా భాగస్వామ్యం వల్ల నిర్లక్ష్యానికి గురైన సమస్యలు వెలుగులోకి రావడం,విభిన్నవర్గాల గొంతుకలకు ప్రాధాన్యత లభించడం వంటి ప్రయోజనాలు ఉన్నప్పటికీ పుకార్లు తప్పుదారి పట్టించే చిత్రాలు భావోద్వేగాలను రెచ్చగొట్టే సమాచారాన్ని నియంత్రణ లేకుండా వ్యాప్తి చేయడం వల్ల తప్పుడు సమాచారం పక్షపాత ధోరణులు సామాజిక విభేదాలు రాజకీయ అస్థిరత పెరిగే ప్రమాదం ఉంది.అందువల్ల సమస్య ప్రజాదరణ లేదా ప్రజల భాగస్వామ్యం కాదు.వాస్తవ నిర్ధారణ బాధ్యతాయుతమైన సమాచార ప్రసారం కంటే తక్షణ స్పందన భావోద్వేగ ఆకర్షణ ప్రచారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడమే అసలు ఆందోళనకరమైన అంశం.
బాధ్యతాయుత జర్నలిజం (Responsible Journalism)
దీనికి భిన్నంగా బాధ్యతాయుత జర్నలిజం అనేది వార్తల సేకరణ ప్రసారంలో సత్యం ఖచ్చితత్వం నిష్పాక్షికత జర్నలిస్టుల స్వతంత్రత ప్రజా ప్రయోజనం సామాజిక ఐక్యత రాజకీయ స్థిరత్వం జాతీయ భద్రత వంటి అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది.ఇందుకోసం కఠినమైన వాస్తవ నిర్ధారణ తగిన నేపథ్య వివరణ విభిన్న అభిప్రాయాలకు న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించడం అవసరం.అలాగే వాస్తవాలు వ్యక్తిగత అభిప్రాయాలు ఆరోపణల మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని పాటించాలి.వ్యక్తిగత గోప్యత మానవ గౌరవాన్ని కాపాడటం పక్షపాత పూరిత వార్తలను నివారించడం జరిగిన తప్పులను వెంటనే సరిదిద్దడం ప్రచురించిన సమాచారానికి జవాబుదారీతనం వహించడం కూడా బాధ్యతాయుత జర్నలిజంలో భాగమే.ప్రజాస్వామ్యంలో మీడియా అనేది ప్రభుత్వ సంస్థలకు ప్రజలకు మధ్య ఒక ముఖ్యమైన వారధిగా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు అవగాహనతో కూడిన చర్చలకు అవకాశం కల్పించడంలో అధికారంలో ఉన్నవారిని జవాబుదారీగా నిలపడంలో బాధ్యతాయుత జర్నలిజం కీలక పాత్ర పోషిస్తుంది. వివిధ వాదనలు అంశాలను ప్రజలు విశ్లేషించడానికి సంక్లిష్టమైన సమస్యలను అర్థం చేసుకోవడానికి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సహాయపడుతుంది.
ప్రజాకర్షణ-బాధ్యత రెండూ సమన్వయంతో ఉండాలి
ప్రజాదరణ బాధ్యతాయుతమైన జర్నలిజం రెండూ పరస్పర విరుద్ధమైన అంశాలు కావాల్సిన అవసరం లేదు.వార్తలను ఏ విధంగా నిర్ధారిస్తున్నారు ఏ విధంగా ప్రజలకు అందిస్తున్నారు అనే అంశాలపైనే ప్రజాకర్షక జర్నలిజానికి బాధ్యతాయుత జర్నలిజానికి మధ్య వ్యత్యాసం ఆధారపడి ఉంటుంది.సామాన్య ప్రజలు రూపొందించిన సమాచారం కూడా ఖచ్చితమైనదిగా సముచితమైనదిగా దాని పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ప్రసారం చేసినప్పుడు ప్రజా ప్రయోజనానికి ఉపయోగపడుతుంది.అదేవిధంగా ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు కూడా వృత్తిపరమైన నైతిక ప్రమాణాలను పాటిస్తూనే ప్రజలను ఆకట్టుకునే విధంగా ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా పనిచేయవచ్చు.విశ్వసనీయమైన సమాచార వ్యవస్థను అభివృద్ధి చేయడంలో మీడియా సంస్థలు జర్నలిస్టులు డిజిటల్ వేదికలు సమాచారాన్ని పంచుకునే వ్యక్తులు అందరికీ బాధ్యత ఉంది.ఈ వ్యవస్థ వాస్తవ నిర్ధారణ నిష్పాక్షికత సున్నితత్వం జవాబుదారీతనం అనే విలువలపై ఆధారపడి ఉండాలి.ఈ కీలకమైన అంశాలపై చర్చించేందుకు భారత ప్రెస్ కౌన్సిల్ 2026 జాతీయ పత్రికా దినోత్సవాన్ని “జర్నలిజం: ప్రజాకర్షకమా? బాధ్యతాయుతమా?” అనే ఇతివృత్తంతో నిర్వహిస్తోంది.
భారతదేశంలో స్వేచ్ఛాయుతమైన బాధ్యతాయుతమైన పత్రికా వ్యవస్థకు నవంబర్ 16వ తేదీ ప్రతీకగా నిలుస్తుంది.భారత ప్రెస్ కౌన్సిల్ తన కార్యకలాపాలను ప్రారంభించిన రోజు ఇదే. శక్తివంతమైన సమాచార మాధ్యమమైన పత్రికా రంగం ఉన్నత ప్రమాణాలను పాటించేలా చూడటంతో పాటు బయటి శక్తుల ప్రభావం లేదా బెదిరింపుల వల్ల పత్రికా స్వేచ్ఛకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పరిరక్షించడం దీని ప్రధాన ఉద్దేశం.ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రెస్ కౌన్సిళ్లు లేదా మీడియా కౌన్సిళ్లు ఉన్నప్పటికీ భారత ప్రెస్ కౌన్సిల్ ఒక ప్రత్యేకమైన సంస్థ. పత్రికా స్వేచ్ఛను కాపాడే బాధ్యతలో భాగంగా ప్రభుత్వ వ్యవస్థలపై కూడా తన అధికార పరిధిని వినియోగించగలగడం దీని ప్రత్యేకత.1956లో తొలి ప్రెస్ కమిషన్ ప్రెస్ కౌన్సిల్ ఏర్పాటును సిఫార్సు చేసింది.జర్నలిజంలో వృత్తిపరమైన నైతిక విలువలను పరిరక్షించడానికి ఆ రంగానికి చెందిన ప్రముఖులతో ఒక చట్టబద్ధమైన సంస్థను ఏర్పాటు చేయడం ఉత్తమ మార్గమని ప్రెస్ కమిషన్ అభిప్రాయపడింది.ఈ సంస్థ వృత్తిపరమైన వివాదాలను పరిష్కరించే బాధ్యతను నిర్వర్తించాలని సూచించింది.ఈ లక్ష్యంతో భారత ప్రెస్ కౌన్సిల్ స్థాపించబడింది.1966 నవంబర్ 16 నుంచి అభివృద్ధి చెందుతూ వచ్చిన ఈ సంస్థ తన స్థాపన లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తోంది.అందువల్ల నవంబర్ 16వ తేదీ దేశంలో స్వేచ్ఛాయుతమైన బాధ్యతాయుతమైన పత్రికా వ్యవస్థకు ప్రతిరూపంగా నిలుస్తుంది.పత్రికా స్వేచ్ఛను దాని విలువలను గౌరవించే ప్రతి ఒక్కరూ ఈ రోజును జాతీయ పత్రికా దినోత్సవంగా జరుపుకుంటారు.
