గుంటూరులో ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాలి…

-ఈ-ఆటోల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలి: నగర కమిషనర్ కె. మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
నగరంలోని ప్రతి వార్డు, సచివాలయం పరిధిలో కేటాయించిన ఈ-ఆటోల ద్వారా ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఆదేశించారు. శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులు, ఈ-ఆటోలను సరఫరా చేస్తున్న గణేష్ శంకర్ ఏజెన్సీ ప్రతినిధులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ-ఆటోల ద్వారా ఇంటింటి చెత్త సేకరణ నిర్వహణపై సమీక్షించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో చెత్త సేకరణ వ్యవస్థను మరింత సమర్థవంతంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దేందుకు ఈ-ఆటోలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రతి ఆటోకు కేటాయించిన వార్డు, సచివాలయం పరిధిలోని అన్ని ఇళ్లకు వెళ్లి చెత్తను సేకరించాలని సూచించారు. ఈ ప్రక్రియను సచివాలయ కార్యదర్శులు నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని యంహెచ్‌ఓను ఆదేశించారు. ఈ-ఆటోలు ఇంటింటికీ వెళ్లినప్పుడు ప్రజలు తడి, పొడి చెత్తను వేర్వేరుగా విభజించి అందించేలా అవగాహన కల్పించాలని సూచించారు. గుంటూరు నగరానికి మొత్తం 200 ఈ-ఆటోలు కేటాయించగా, ఇప్పటివరకు గణేష్ శంకర్ ఏజెన్సీ 166 ఆటోలను అందజేసిందని తెలిపారు. మిగిలిన ఆటోలను ఈ నెలాఖరులోగా అందజేయాలని ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు.

చెత్త సేకరణ కోసం ప్రజారోగ్య విభాగం అధికారులు స్పష్టమైన రూట్ మ్యాప్‌లను సిద్ధం చేయాలని, ప్రతి ఈ-ఆటోకు జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలను ఏర్పాటు చేసి నిర్దేశిత మార్గాల్లోనే తిరుగుతున్నాయా లేదా అన్నది పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ-ఆటోల ఛార్జింగ్ కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించి, నిరంతర విద్యుత్ సరఫరాకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. చెత్త సేకరణ సమయంలో ఎదురయ్యే సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో యంహెచ్‌ఓ డాక్టర్ సురేష్, ఈఈ సుందర్రామిరెడ్డి, డీఈఈ సతీష్, గణేష్ శంకర్ ఏజెన్సీ ప్రతినిధులు అంజన్ కుమార్, సూర్య తదితరులు పాల్గొన్నారు.