ఈ నెల 12, 13వ తేదీల్లో విశాఖలో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్

-59 దేశాల ప్రాతినిధ్యం… 15 మంది విదేశీ మంత్రుల భాగస్వామ్యం
-వాణిజ్యం నుంచి క్వాంటం టెక్నాలజీ వరకు… ఆరు కీలక రంగాలపై చర్చలు
-ప్రపంచ మార్కెట్లతో ఏపీ పరిశ్రమల అనుసంధామే లక్ష్యం : ముఖ్యమంత్రి చంద్రబాబు
-సీఐఐ సమ్మిట్‌–2026 ఏర్పాట్లపై సీఎం సమీక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రపంచ పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్యం, సాంకేతిక భాగస్వామ్యాలకు ఆంధ్రప్రదేశ్‌ను కీలక కేంద్రంగా నిలిపే లక్ష్యంతో నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో 31వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్–2026ను ప్రభుత్వం నిర్వహించనుంది. ‘నావిగేటింగ్ న్యూ వరల్డ్ ఆర్డర్: ట్రేడ్, టెక్నాలజీ, ట్రస్ట్’ థీమ్‌తో రెండు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సుకు సుమారు 59 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు. 15 మంది విదేశీ మంత్రులు, 40 మందికి పైగా అంతర్జాతీయ వక్తలు, 350 మంది విదేశీ ప్రతినిధులు, 900 మంది భారతీయ ప్రతినిధులు కలిపి సుమారు 1,250 మంది ఈ సదస్సులో భాగస్వాములు కానున్నారు. ఈనెల 12, 13వ తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్–2026 నిర్వహణ ఏర్పాట్లు, చర్చించాల్సిన అంశాలు, ప్రతిపాదిత డిక్లరేషన్లపై అధికారులు, సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీతో క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు.

సదుపాయాలు… నాలెడ్జ్ ఏపీ అనుకూలతలు

సమీక్షలో సీఎం మాట్లాడుతూ…‘‘విధాన రూపకర్తలు, పెట్టుబడిదారులు, పరిశ్రమలు, విద్యా సంస్థలు, అంకుర సంస్థలను అనుసంధానిస్తూ చర్చలను వ్యాపార, సాంకేతిక భాగస్వామ్యాల దిశగా సమ్మిట్ నిర్వహించాలి. ప్రపంచ మార్కెట్లతో రాష్ట్ర పరిశ్రమలను అనుసంధానించడం, ఎంఎస్‌ఎంఈలకు కొత్త వ్యాపార పరిచయాలు కల్పించడం ప్రధాన లక్ష్యం కావాలి. సాంకేతిక సహకారాన్ని విస్తరించడం, యువత నైపుణ్యాలకు అంతర్జాతీయ అవకాశాలను పరిచయం చేయడం వంటి అంశాల్లో ఏపీ ప్రాధాన్యం పెంచేలా సదస్సు ఉండాలి. ఎస్క్రో అకౌంట్ ద్వారా పారిశ్రామిక రాయితీల చెల్లింపు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి విధానాలు ప్రపంచ వ్యాప్తం కావాలి. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, సెమీకండక్టర్ వంటి రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను విస్తృతంగా ప్రచారం చేయాలి. అత్యుత్తమ పాలసీలు, సమర్థులైన నిపుణులు, మౌలిక సదుపాయాలు, నాలెడ్జ్, బలమైన నాయకత్వం వంటి అనుకూలతలు ఉన్న రాష్ట్రం ఏపీ ఒక్కటే. రాష్ట్రంలో పెట్టుబడులు సురక్షితం, సులభతరమనే విషయం పారిశ్రామిక వేత్తలకు తెలియాలి’’ అని సీఎం సూచించారు.

ఆరు ప్రధాన రంగాలపై చర్చ

విశాఖలో జరిగే సీఐఐ సమ్మిట్ ప్రపంచ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామిక దిగ్గజాలు, అంతర్జాతీయ సంస్థల ప్రముఖులు, సాంకేతిక నిపుణులను ఒకే వేదికపైకి రానుంది. వ్యాపార సంస్థల మధ్య భాగస్వామ్యాలను పెంపొందించేందుకు 400 బిజినెస్‌ టు బిజినెస్‌ సమావేశాలు, ప్రభుత్వాలతో పరిశ్రమల సంప్రదింపులకు బిజినెస్‌ టు గవర్నమెంట్‌ సమావేశాలు జరగనున్నాయి. సింగపూర్‌ నేపాల్‌, కంబోడియా, మయన్మార్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, కెనడా, స్లోవాక్‌ రిపబ్లిక్‌, మారిషస్‌, మొజాంబిక్‌, ఈజిప్ట్‌, అల్జీరియా, టాంజానియా, గ్వాటెమాలా వంటి పలు దేశాల నుంచి ప్రభుత్వ ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. అదేవిధంగా వివిధ దేశాల రాయబారులు, ప్రపంచ ఆహార కార్యక్రమం, ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమానికి చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు. అయితే ఈ సమ్మిట్‌లో వాణిజ్యం నుంచి క్వాంటం వరకు ఆరు ప్రధాన రంగాలపై చర్చించేలా ఉండాలని సీఎం ఆదేశించారు. వాణిజ్యం – పెట్టుబడులు – గ్లోబల్ వాల్యూ చైన్స్, ట్రస్ట్–జియో ఎకనమిక్స్– గ్లోబల్ కో ఆపరేషన్, వ్యవసాయం–ఆహార భద్రత–జీవ ఆధారిత ఆర్థిక వ్యవస్థ, ప్రతిభ–నైపుణ్యాలు–అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు, సాంకేతికత–ఆవిష్కరణలు–భవిష్యత్‌ పరిశ్రమలు, స్వచ్ఛ ఇంధనం-సుస్థిర వృద్ధి… అనే ఈ ఆరు ప్రధానాంశాలపై చర్చించనున్నారు. ఈ సమీక్షకు అధికారులు, ఇతర సిఐఐ ప్రతినిధులు హాజరయ్యారు.