ఎంపీపీలు, జెడ్పీటీసీల పరోక్ష ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ

-ఈ నెల 19న మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు
-20న జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులకు ఎన్నికలు
-659 మండల పరిషత్‌లు, 28 జిల్లా పరిషత్‌లలో పరోక్ష ఎన్నికల నిర్వహణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రవ్యాప్తంగా మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (జెడ్పీటీసీ) సభ్యుల ఎన్నికల పోలింగ్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 05.11.2026న నిర్వహించింది. అయితే తుపాను ప్రభావం కారణంగా తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి, ఏలూరు జిల్లాలో నాలుగు మండలాల్లో మొత్తం ఐదు మండలాలకు సంబంధించి పోలింగ్‌ను ఈ నెల 06.11.2026కు వాయిదా వేసి నిర్వహించడం జరిగింది. అదేవిధంగా, ఈ నెల 05.11.2026న జరిగిన పోలింగ్‌లో కొన్ని ఎన్నికల అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఐదు జిల్లాల్లోని ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 06.11.2026న రీపోలింగ్ నిర్వహించారు.

రాష్ట్రంలోని అన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఈ నెల 07.11.2026న ఓట్ల లెక్కింపు చేపట్టి, ప్రక్రియ పూర్తయిన అనంతరం ఫలితాలను ప్రకటించడం జరిగింది.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 659 మండల ప్రజా పరిషత్‌ల (ఎంపీపీలు)లో కో-ఆప్టెడ్ సభ్యులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికలకు, 28 జిల్లా ప్రజా పరిషత్‌ల (జెడ్పీపీలు)లో కో-ఆప్టెడ్ సభ్యులు, చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్ల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ రోజు (10.11.2026) నోటిఫికేషన్లు జారీ చేసింది.
దీని ప్రకారం ఎంపీపీలలో పరోక్ష ఎన్నికల నిర్వహణకు ఈ నెల 19.11.2026న, జెడ్పీపీలలో పరోక్ష ఎన్నికల నిర్వహణకు ఈ నెల 20.11.2026న సంబంధిత ప్రిసైడింగ్ అధికారులు ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నారు.

ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు తమలో ఒకరిని మండల పరిషత్ అధ్యక్షుడిగా, మరొకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంటారు.
అదేవిధంగా, ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులు తమలో ఒకరిని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా, మరొకరిని వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నుకుంటారు.

ప్రతి ఎంపీపీలో ఒక కో-ఆప్టెడ్ సభ్యుడిని, ప్రతి జెడ్పీపీలో ఇద్దరు కో-ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు, జెడ్పీపీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికల కంటే ముందుగా కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నికను నిర్వహించాలి. ఈ సభ్యులు మతపరమైన మైనారిటీ లేదా భాషాపరమైన మైనారిటీ వర్గాలకు చెందినవారై ఉండాలి.

11.03.1995 న జారీ చేసిన జీ.ఓ.ఎం.ఎస్. నెం.131, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సహాయ శాఖ (ఎన్నికలు-IV) ప్రకారం మతపరమైన మైనారిటీలలో ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జొరాస్ట్రియన్లు (పార్సీలు) ఉంటారు. తెలుగు మాతృభాష కాని ఇతర భాషలను మాతృభాషగా కలిగిన వారిని భాషాపరమైన మైనారిటీలుగా పరిగణిస్తారు.

ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు, జెడ్పీపీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులకు జరిగే ఎన్నికలను చేతులు పైకెత్తి ఓటు వేసే (Show of Hands) విధానంలో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సంబంధిత గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తమ సభ్యులకు జారీ చేసే పార్టీ విప్‌ను తప్పనిసరిగా పాటించాలి. అయితే కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నికలకు సంబంధించి పార్టీ విప్ జారీ చేసే నిబంధన లేదు.

సంబంధిత మండల, జిల్లా పరిషత్‌లకు ఎక్స్-అఫీషియో సభ్యులుగా ఉన్న పార్లమెంట్ సభ్యులు (ఎంపీలు), శాసన మండలి సభ్యులు (ఎమ్మెల్సీలు), శాసనసభ సభ్యులు (ఎమ్మెల్యేలు) కూడా ఈ ప్రత్యేక సమావేశాలకు హాజరయ్యేందుకు ఆహ్వానించబడతారు. అయితే ఈ ఎన్నికల్లో వారికి ఓటు వేసే హక్కు ఉండదు.

నిర్ణీత షెడ్యూల్ ప్రకారం, ఎంపీపీలకు ఈ నెల 19.11.2026 న, జెడ్పీపీలకు ఈ నెల 20.11.2026న నిర్వహించనున్న పరోక్ష ఎన్నికలకు సంబంధించి ఎన్నికైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు ప్రత్యేక సమావేశాల నోటీసులను ఈ నెల 14.11.2026లోగా అందజేయనున్నారు.

పరోక్ష ఎన్నికల ప్రక్రియ సజావుగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం వివరణాత్మక విధివిధానాలు, మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.

రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన రెండు నోటిఫికేషన్లు, విధివిధానాలకు సంబంధించిన సూచనల ప్రతులను సమాచార నిమిత్తం జతపరచడమైనది.