-మౌలిక వసతులు, స్థల సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలి
-జిల్లా కలెక్టర్ సి యం సాయికాంత్ వర్మ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) అభివృద్ధికి ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల (ఎంఓయూలు) అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు సంబంధించి జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ, ఇతర రెవెన్యూ అధికారులతో బుధవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే ఎంఓయూలు కుదుర్చుకున్న పారిశ్రామికవేత్తలు తమ యూనిట్ల స్థాపన పనులను వెంటనే ప్రారంభించేలా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టి గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అదేవిధంగా గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, మంగళగిరి, తెనాలి నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను గుర్తించి, స్థల సేకరణకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. పరిశ్రమల స్థాపనకు ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, నిర్దేశిత లక్ష్యాల మేరకు పరిశ్రమల ఏర్పాటులో పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ ఎన్ ఎస్ కే ఖాజావలి, గుంటూరు, తెనాలి ఆర్డీవోలు శ్రీనివాసరావు, శ్రీ రమణి, పరిశ్రమల శాఖ జిఎం జయలక్ష్మి , జిల్లా ఉపాధి కల్పన అధికారి అభినవ్ తదితరులు పాల్గొన్నారు
