-వ్యాధుల ముందస్తు గుర్తింపు.. సకాలంలో చికిత్స.. నిరంతర పర్యవేక్షణే లక్ష్యం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
గుండెపోటు, పక్షవాతం బాధితులకు సకాలంలో మెరుగైన వైద్యం అందించడంతో పాటు రక్తపోటు, మధుమేహం వంటి అసంక్రమిత వ్యాధులను సమర్థంగా నియంత్రించేందుకు వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. మంగళగిరిలోని ఓ హోటల్లో మంగళ , బుధవారాల్లో జరిగిన ఈ కార్యశాలలో వ్యాధులను ముందుగానే గుర్తించడం, సమగ్ర చికిత్స అందించడం, రోగులకు నిరంతర వైద్య సేవలు కల్పించే విధానాలపై అధికారులకు, వైద్యులకు శిక్షణ ఇచ్చారు. జాతీయ అసంక్రమిత వ్యాధుల నివారణ, నియంత్రణ కార్యక్రమం (ఎన్‌పీ-ఎన్‌సీడీ), ఆర్‌బీఎస్‌కే 2.0, ఆర్‌కేఎస్‌కే కార్యక్రమాల అమలును మరింత బలోపేతం చేయడంపై ప్రధానంగా చర్చించారు.
వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కె.వి.ఎన్. చక్రధర్‌బాబు నేతృత్వంలో, వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ ఎ. విష్ణువర్ధన్, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ ఆర్. వెంకటరమణ సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర అసంక్రమిత వ్యాధుల విభాగం అధికారి కె. శ్యామల ఆధ్వర్యంలో కార్యశాల ఏర్పాట్లు చేపట్టారు.
రక్తపోటు, మధుమేహ నియంత్రణపై దృష్టి
కార్యశాల తొలి రోజు రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న అసంక్రమిత వ్యాధుల వైద్య సేవలను మరింత సమర్థంగా కొనసాగించే అంశాలపై శిక్షణ ఇచ్చారు. రక్తపోటు, మధుమేహం నియంత్రణ, వాటి వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలను నివారించడం, మానసిక ఆరోగ్యం, పొగాకు నియంత్రణ, నోటి ఆరోగ్యం, అయోడిన్ లోపం, ఫ్లోరోసిస్, వినికిడి లోపాల నివారణ కార్యక్రమాలను సమన్వయంతో అమలు చేయడంపై చర్చించారు.
అవసరమైన మందులు, వైద్య పరీక్షల పరికరాలు అందుబాటులో ఉండేలా చూడటం, వైద్య సేవల సంసిద్ధత, సరఫరా వ్యవస్థ, పర్యవేక్షణ, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి అంశాలపై సూచనలు ఇచ్చారు. క్యాన్సర్ అవగాహన, డిజిటల్ పర్యవేక్షణ వ్యవస్థల వినియోగంపైనా దృష్టి సారించారు.
గుండెపోటు, పక్షవాతం సేవలపై ప్రత్యేక చర్చ
రెండో రోజు గుండెపోటు, పక్షవాతం బాధితులకు సమగ్ర వైద్య సేవలు అందించే విధానాలపై ప్రత్యేకంగా చర్చించారు. స్టెమీ (STEMI) గుండెపోటు చికిత్సా కార్యక్రమం, పక్షవాతం చికిత్సా సేవలను బలోపేతం చేయడం, ద్వితీయ స్థాయి ఆసుపత్రుల్లో అసంక్రమిత వ్యాధుల వైద్య సేవలను మెరుగుపరచడంపై శిక్షణ ఇచ్చారు. దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధుల గుర్తింపు, చికిత్స, కొవ్వు కాలేయ వ్యాధి, సమగ్ర క్యాన్సర్ వైద్యం, నివారణాత్మక క్యాన్సర్ వైద్య విభాగాల ఏర్పాటు, ఉపశమన వైద్య సేవలు వంటి అంశాలను వివరించారు. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి వైద్య సంస్థల మధ్య సమన్వయం పెంచి, రోగులకు నిరంతర వైద్య సేవలు అందించే విధానాలపై సూచనలు చేశారు.
క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి సూచనలు
ఎయిమ్స్ న్యూఢిల్లీకి చెందిన డాక్టర్ వై.ఎస్. కుసుమ, ఈక్విప్ బృందం అసంక్రమిత వ్యాధుల కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ, క్షేత్రస్థాయి సేవలపై తమ అనుభవాలను పంచుకున్నారు. ఏఎస్‌ఆర్, స్టార్-ఎన్‌సీడీ పర్యవేక్షణ విధానాలు, వైద్య సేవల నాణ్యతను మెరుగుపరిచే అంశాలపై చర్చించారు.
కార్యక్రమాల అమలులో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, వాటికి ఆచరణ సాధ్యమైన పరిష్కారాలు కనుగొనడం, వైద్య సేవల నాణ్యతను పెంచడం, క్షేత్రస్థాయి పర్యవేక్షణను మెరుగుపరచడంపై దృష్టి పెట్టారు. నూరా హెల్త్ సంస్థ ఆధ్వర్యంలో కేర్ కంపానియన్ కార్యక్రమం ద్వారా రోగులు, వారి కుటుంబ సభ్యులు, సంరక్షకులకు వైద్య సేవలపై అవగాహన కల్పించే విధానాలను వివరించారు. వ్యాధి నియంత్రణలో కుటుంబ సభ్యుల భాగస్వామ్యం, మందులను క్రమం తప్పకుండా వాడటం, ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత కూడా వైద్య సూచనలు పాటించడం ప్రాధాన్యాన్ని తెలియజేశారు.
డిజిటల్ వ్యవస్థలతో మెరుగైన పర్యవేక్షణ
అసంక్రమిత వ్యాధుల కార్యక్రమాల్లో డిజిటల్ వ్యవస్థలను విస్తృతంగా వినియోగించడం ద్వారా వివరాల నమోదు, పర్యవేక్షణ, నివేదికల తయారీ, పనితీరు సమీక్షలను మరింత సమర్థంగా నిర్వహించే అంశాలపై శిక్షణ ఇచ్చారు. డ్యాష్‌బోర్డుల ద్వారా కార్యక్రమాల పురోగతిని పరిశీలించడం, లోపాలను గుర్తించడం, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడంపై సూచనలు చేశారు.
కేవలం వ్యాధుల పరీక్షలకే పరిమితం కాకుండా ముందస్తు గుర్తింపు, సకాలంలో నిర్ధారణ, చికిత్స, అవసరమైన చోట ఉన్నత వైద్య సంస్థలకు పంపించడం, తదుపరి వైద్య పర్యవేక్షణ వంటి అన్ని దశల్లో సమగ్ర సేవలు అందించాల్సిన అవసరాన్ని వివరించారు.
కార్యశాలలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీమతి ఏ.ఏ.ఎల్. పద్మావతి (ఐఏఎస్), వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ ఎ. విష్ణువర్ధన్, రాష్ట్ర కార్యక్రమ నిర్వాహకురాలు డాక్టర్ జె. విజయలక్ష్మి, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ రాష్ట్ర నోడల్ అధికారి బి.వి. రావు, ఆరోగ్య, ఆరోగ్యవర్ధక కేంద్రాల రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ జె. నరసింహ నాయక్ పాల్గొన్నారు.
వైద్య విద్య సంచాలకుల కార్యాలయం క్యాన్సర్ విభాగం నోడల్ అధికారి డాక్టర్ రమేష్, అసంక్రమిత వ్యాధుల కార్యక్రమ అధికారి డాక్టర్ ప్రసన్న కుమార్, ఆర్‌బీఎస్‌కే, ఆర్‌కేఎస్‌కే కార్యక్రమాల అధికారి డాక్టర్ వి.వి.బి. సుబ్రహ్మణ్యం, ప్రపంచ ఆరోగ్య సంస్థ గుండె ఆరోగ్య అధికారులు డాక్టర్ సి.ఆర్. పటేల్, డాక్టర్ యు. సురేష్, రాష్ట్ర అసంక్రమిత వ్యాధుల ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ స్నేహ సమీర కూడా పాల్గొన్నారు.
వీరితో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన జిల్లా కార్యక్రమ అధికారులు, జిల్లా ఎపిడెమియాలజిస్టులు, వైద్యాధికారులు, వైద్య నిపుణులు, ఇతర జిల్లా స్థాయి కార్యక్రమ ప్రతినిధులు కార్యశాలలో పాల్గొని అసంక్రమిత వ్యాధుల నివారణ, నియంత్రణ కార్యక్రమాల అమలు, వైద్య సేవల మెరుగుదలపై చర్చించారు.
