బ్రిక్స్ జీవనశైలి వారోత్సవాల నిర్వహణలో వైద్యారోగ్య శాఖ అగ్రస్థానం

-రాష్ట్రవ్యాప్తంగా 19.52 లక్షల మంది భాగస్వామ్యం
-50,080 కార్యక్రమాలతో వైద్యారోగ్య శాఖ ముందంజ
-అధికారులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందనలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచి తన సమర్థతను చాటుకుంది. ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవనశైలి, పర్యావరణ పరిరక్షణ, వనరుల పొదుపుపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన కార్యక్రమాలను అత్యంత విస్తృతంగా, సమన్వయంతో నిర్వహించి అన్ని ప్రభుత్వ శాఖల కంటే ముందంజలో నిలిచింది. నవంబరు 1 నుంచి 7వ తేదీ వరకు 21 ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 96,891 కార్యక్రమాలు నిర్వహించగా, 19,52,137 మంది పాల్గొన్నారు. ఇందులో వైద్యారోగ్య శాఖ ఒక్కటే 50,080 కార్యక్రమాలు నిర్వహించి 6,28,151 మందిని భాగస్వాములను చేసింది. మొత్తం కార్యక్రమాల్లో 32.02 శాతం నిర్వహించి ప్రథమ స్థానాన్ని సాధించినట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు తెలిపారు. ఈ ఘనత సాధించిన వైద్యారోగ్య శాఖ అధికారులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ అభినందించారు.

32.02 శాతం సాధనతో వైద్యారోగ్య శాఖ ముందంజ

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాల్లో వైద్యారోగ్య శాఖ 50,080 (32.02 శాతం) కార్యక్రమాలతో అగ్రస్థానంలో నిలవగా, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ 5,684 (19.27 శాతం) కార్యక్రమాలతో రెండో స్థానంలో నిలిచింది. పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ (16.8 శాతం), నైపుణ్యాభివృద్ధి శాఖ (8.9 శాతం), మహిళా శిశు సంక్షేమ శాఖలు (6.1 శాతం) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. ఇతర శాఖలతో పోలిస్తే వైద్యారోగ్య శాఖ అత్యధిక కార్యక్రమాలు నిర్వహించి తన ఆధిక్యాన్ని చాటుకుంది. వైద్యారోగ్య శాఖలోని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్ల కార్యక్రమాలు విజయవంతమైనట్లు కమిషనర్ చక్రధర్ బాబు చెప్పారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు, జిల్లా, ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్ వైద్య కేంద్రాలు, ఉప కేంద్రాల వరకు ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నాయి. లైఫ్ పోర్టల్‌లో కార్యక్రమాల వివరాల నమోదు (డేటా ఎంట్రీ)లోనూ వైద్యారోగ్య శాఖ రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని సాధించింది. విద్యుత్ ఆదా, నీటి పొదుపు, సుస్థిర ఆహార విధానాలు, వ్యర్థాల తగ్గింపు, ఆరోగ్యకరమైన జీవనశైలి, ఎలక్ట్రానిక్ వ్యర్థాల తగ్గింపు, ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్‌కు దూరంగా ఉండటం వంటి ఏడు ప్రధాన అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రాజెక్టు మేనేజర్, బ్రిక్స్ రాష్ట్ర నోడల్ అధికారి జె. విజయలక్ష్మి తెలిపారు.

మూడు శాఖల్లో 68.7 శాతం మంది భాగస్వామ్యం

వైద్యారోగ్య శాఖ తర్వాత గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలో 3,83,776 మంది, పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలో 3,28,619 మంది పాల్గొన్నారు. ఈ మూడు శాఖల ఆధ్వర్యంలో మొత్తం 13,40,546 మంది భాగస్వాములయ్యారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా పాల్గొన్న వారిలో 68.7 శాతం కావడం విశేషం.