-గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ వ్యాప్తంగా కాలానుగుణంగా ప్రజాస్వామ్యం మార్పులకు లోనవుతున్నప్పటికీ అది తాత్కాలికమేనని గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా అన్నారు. బలమైన మూలాలు కలిగిన ప్రజాస్వామ్యం భారత్ తో పాటు ప్రపంచ దేశాలకు ఆభరణం వంటిదన్నారు. అజాదీకా అమృత్ ఉత్సవ్ వేడుకలలో భాగంగా ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం, స్వాత్రంత్ర్య పోరాట కేంద్రం నేతృత్వంలో “ప్రజాస్వామ్య చరిత్ర” అన్న అంశంపై శుక్రవారం నిర్వహించిన వెబినార్ లో సిసోడియా విజయవాడ రాజ్ భవన్ నుండి కీలకోపన్యాసం చేసారు. చరిత్రను పరిశీలిస్తే ప్రజాస్వామిక విలువలు క్షీణిస్తున్నాయన్నది వాస్తవమే అయినా, ప్రజాస్వామ్య మూలాలు ఇప్పటికీ బలంగానే ఉన్నాయన్నారు. భారత్‌తో సహా పలు ప్రజాస్వామ్య దేశాలలో ఇది సరికొత్త రూపును అపాదించుకుంటుందన్నారు. పాలకుల పనితీరు ఫలితంగా అయా కాలాలలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నప్పటికీ అవి ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీన పరచలేవని సిసోడియా అభిప్రాయపడ్డారు.
ప్రజాస్వామ్యంలో ఉన్న స్వల్ప లోటుపాట్ల ఆలంబనతో ప్రపంచ వ్యాప్తంగా ఇది చర్చకు తావిస్తుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి పౌరుని పైనా ఉందని వివరించారు. గత దశాబ్దాలలో సైతం ప్రజాస్వామ్యంలో నియంతృత్వ పోకడలు ఉన్నాయని, అవి ఇప్పటి కిప్పుడు పుట్టుకొచ్చినవి కాదని పేర్కొన్నారు. ప్రస్తుత ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచ మేధావులు తగిన సూచనలు చేయాలని, పాలకులు సైతం వాటిని గౌరవించి స్వీయ నియంత్రణ పాటించవలసి ఉందని వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన్ననలు అందుకుంటున్న భారతదేశం ఇతర దేశాలకు ఆదర్శం కావాలన్నారు. ఈ వెబినార్ కు ముఖ్య అనుసంధానకర్తగా విశ్వవిద్యాలయం ఉపకులపతి అచార్య నాగేశ్వరరావు వ్యవహరించగా, సామాజిక శాస్త్ర విభాగ సహ అచార్య మయాంక్ కుమార్, స్వాతంత్ర్య పోరాట కేంద్రం సంచాలకులు అచార్య సత్యం, డాక్టర్ సుశీల్ కుమార్ తివారీ, డాక్టర్ సురేష్ కుమర్ ఘోష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.