విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వార్షిక నివేదికలు అందించింది. ఎపిపిఎస్ సి అధ్యక్షుడు గౌతమ్ సవాంగ్ నేతృత్వంలో శుక్రవారం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన కమీషన్ సభ్యులు 2018-2019, 2019-2020, 2020-2021 సంవత్సరాలకు చెందిన మూడు వార్షిక నివేదికలను అవిష్కరింప చేసారు. ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్ వివిధ దశలలో ఉన్న నియామకాల ప్రక్రియ గురించి గవర్నర్ హరిచందన్ కు వివరించారు. నిబంధనల మేరకు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నామన్నారు. గవర్నర్ పలు సూచనలు చేస్తూ పారదర్శకత ప్రతిబింబించేలా నియామక ప్రక్రియలు ఉండాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల పట్ల యువతకు ఉన్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని కాలహరణం లేకుండా, నిర్ణీత కాలవ్యవధి మేరకు పనిచేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యులు అచార్య కె. పద్మరాజు, డాక్టర్ జివి సుధాకర్ రెడ్డి, పి. సుధీర్, ఎస్. సలాం బాబు, ఎవి రమణా రెడ్డి, ఎన్. సుధాకర్ రెడ్డి, కె. విజయ కుమర్, కమీషన్ కార్యదర్శి హెచ్. అరుణ్ కుమార్ తదితరులు గవర్నర్ ను కలిసిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా , రాజ్ భవన్ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News