Breaking News

యంత్ర సేవా కేంద్రాల ద్వారా రైతులకు ఇక తక్కువ అద్దెకే వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి..

-గుంటూరులో జూన్ 7న రైతు గ్రూపులకు ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి.
-రాష్ట్రవ్యాప్తంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ హార్వెస్టర్లు పంపిణీ..
-5,262 రైతు గ్రూపు బ్యాంక్ ఖాతాలకు రూ. 175.61 కోట్ల సబ్సిడీని జమ చేయనున్న సీఎం.
-రైతులకు అండగా నిలుస్తున్న కస్టమ్ హైరింగ్ సెంటర్లు (సీహెచ్‌సీ లు), ఆర్బీకేలు…
-తక్కువ అద్దెకే వ్యవసాయ యంత్రాలు, పరికరాలు..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర రైతాంగం కోసం జగనన్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ‘వైఎస్సార్ యంత్ర సేవ’ పథకం క్రింద రాష్ట్ర స్థాయి మెగా మేళా కార్యక్రమంలో భాగంగా గుంటూరులో మంగళవారం (జూన్ 7వ తేది) నాడు రైతు గ్రూపులకు ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్ల పంపిణీ కార్యక్రమాన్ని జెండా ఊపి ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. మెగా మేళాలో 5,262 రైతు గ్రూపు బ్యాంక్ ఖాతాలకు రూ.175.61 కోట్ల సబ్సిడీని సీఎం జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీకే, క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ హార్వెస్టర్ల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.

రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గించి, మరింత మెరుగైన ఆదాయం అందించాలనే తపనతో.. వైఎస్సార్ యంత్ర సేవా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసి.. పేద రైతులకు “ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను తక్కువ అద్దెకే’ అందుబాటులోకి తెచ్చి సాగు వ్యయం తగ్గించడంతో పాటు నికర ఆదాయం పెంచాలనే సమున్నత లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. రైతన్నలకు తక్కువ అద్దెకే సాగు యంత్రాలు, పనిముట్లు అందుబాటులో ఉంచి, విత్తు నుంచి కోత వరకు అవసరమైన పరికరాలను సకాలంలో అందించడానికి తద్వారా పెట్టుబడి ఖర్చు తగ్గించి రైతన్నలకు మరింత రాబడి అందించేలా, వారికి మంచి జరిగేలా రూ. 2,106 కోట్ల వ్యయంతో ఆర్బీకే స్థాయిలో ఒక్కొక్కటి రూ. 15 లక్షల విలువ గల 10,750 వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. వరి ఎక్కువగా పండించే 20 జిల్లాల్లో ఒక్కొక్కటి రూ. 25 లక్షల విలువ గల కంబైన్డ్ హార్వెస్టర్లతో కూడిన 1,615 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. రైతు గ్రూపులే ఈ యంత్ర సేవా కేంద్రాలు నిర్వహిస్తాయి. పంటల సరళి, స్థానిక డిమాండ్ కు అనుగుణంగా కావలసిన యంత్ర పరికరాలను ఎంపిక చేసుకోవడంలో రైతు గ్రూపులదే తుది నిర్ణయంగా ఉంటుంది. అందుబాటులో ఉన్న యంత్ర పరికరాలు, వాటి అద్దె. సంప్రదించ వలసిన వారి వివరాలు రైతు భరోసా కేంద్రాలలో ప్రదర్శిస్తారు.

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన రైతు ప్రభుత్వంగా, “వ్యవసాయం దండగ” అంటూ సాగును నిర్లక్ష్యం చేసి అన్నదాతలను కడగండ్ల పాలు చేసిన గత పాలకుల నాటి దుస్థితిని సమూలంగా మారుస్తూ… రైతన్నకు ప్రతి అడుగులోనూ వెన్నుదన్నుగా నిలుస్తూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని పండగగా మార్చింది. “విత్తనం నుండి పంట విక్రయం వరకు అన్ని సేవలు రైతన్న గడప వద్దనే” అందించే వన్ స్టాప్ సెంటర్లుగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు చేసి, వైఎస్సార్ రైతు భరోసా క్రింద రైతన్నలకు ఏటా రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తోంది. సాగు చేసి, ఈ-క్రాప్ లో నమోదు చేసుకున్న ప్రతి ఎకరాన్ని పంటల బీమా పరిధిలో చేర్చి రైతులపై పైసా భారం పడకుండా ప్రభుత్వమే భరిస్తూ వైఎస్సార్ ఉచిత పంటల బీమా క్రింద ఒక ఖరీఫ్ కు సబంధించిన బీమా పరిహారం ఆ తరువాతి ఖరీఫ్ ప్రారంభ సమయానికే చెల్లిస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఏ సీజన్ లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగా ఇన్‌ పుట్ సబ్సిడీ అందిస్తూ అన్నివేళలా రైతులకు అండగా ఈ ప్రభుత్వం నిలుస్తోంది.

రైతులు యంత్ర సేద్యం దిశగా ముందుకు సాగుతున్న తరుణంలో యాంత్రీకరణకు పెద్దపీట వేసి యంత్ర పరికరాలు రైతులకు పెద్ద సంఖ్యలో అందజేస్తుంది. రైతుల గ్రూపులకు 40 శాతం రాయితీతో సబ్సిడీ సాగు యంత్రాలు, వ్యవసాయ పనిముట్లు అందిస్తోంది. అలాగే ఆప్కాబ్, డిసిసిబి ద్వారా యంత్ర పరికరాల ఖరీదులో మరో 50 శాతం రుణాన్ని తక్కువ వడ్డీకే అందిస్తోంది. వైఎస్సార్ యంత్రసేవా పథకం క్రింద మొత్తం సబ్సిడీగా మొత్తం రూ.806 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మంగళవారం నాడు జరిగే మెగా మెళాలో ట్రాక్టర్లతో పాటు అనుసంధాన పరికరాలైన బంపర్, 3 పాయింట్ లింకేజ్, హెచ్ బార్ పరికరాలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అలాగే కంబైన్డ్ హార్వెస్టర్ల ఒక ట్రాక్, ఒక సంవత్సరం పాటు సర్వీసింగ్, ఆపరేటర్ కు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. డ్రోన్ పరికరాల సహాయంతో పంటలకు సూక్ష్మ ఎరువులు, పురుగు మందులను అందించి రైతన్నలకు పెట్టుబడి ఖర్చును తగ్గించే దిశగా ఈ ఏడాది 2,000 గ్రామాల్లో రైతు సేవా కేంద్రాలకు డ్రోన్స్ కూడా సరఫరా చేసేవిధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. యాంత్రీకరణలో భాగంగా దుక్కి యంత్రాలు, దమ్మచదను చేసే పరికరాలు, వరినాటు యంత్రాలు, నూర్పిడి యంత్రాలు, విత్తనం-ఎరువు పరికరాలు, కలుపుతీసే పరికరాలు, సస్యరక్షణ పరికరాలు, కోతకోసే యంత్రాలు మొదలైనవాటిలో స్థానిక రైతుల అవసరాలకు అనుగుణంగా కావాల్సిన యంత్రాలు, పరికరాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుంది. దీంతో చిన్న, సన్నకారు రైతులతో పాటు పెద్ద రైతులకు కూడా యంత్ర పరికరాలపై చేస్తున్న పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ పథకం ఉపయోగపడుతుంది.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *