-ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి
-ఏపీఎన్జీజీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ. విద్యాసాగర్ పిలుపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2026 డిసెంబర్ 12వ తేదీన న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ – కర్మచారి ఆక్రోశ్ ర్యాలీ’లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఏపీఎన్జీజీఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, (ఎ.ఐ.ఎస్.జి.ఈ.ఎఫ్) జాతీయ ఉపాధ్యక్షుడు ఏపి ఎన్ జి ఓ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎ. విద్యాసాగర్ పిలుపునిచ్చారు.
కర్మచారి ఆక్రోస్ ర్యాలీకి సంబంధించిన పోస్టర్‌ను బుధవారం విజయవాడ గాంధీనగర్‌లోని ఎన్జీజీఓ హోమ్ లో ఎ. విద్యాసాగర్, ఏపీఎన్జీజీఓస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జాతీయ స్థాయిలో ఉద్యమానికి పిలుపునిచ్చిందని తెలిపారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, పెన్షనర్ల సంక్షేమం, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతమే ఈ ర్యాలీ ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు.
కర్మచారి ఆక్రోస్ ర్యాలీ ద్వారా ప్రధానంగా డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.దేశవ్యాప్తంగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి. ఈ చట్టం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకంగా ఉండి అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ తక్షణమే భర్తీ చేయాలని కోరారు పాత పెన్షన్ విధానం (ఓ.పి.ఎస్)పునరుద్ధరించి, నూతన పెన్షన్ విధానాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ.పి.ఎస్-95 పెన్షనర్లకు కనీస పెన్షన్‌తో పాటు నిర్వచిత ప్రయోజనాలు కల్పించే పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణను తక్షణమే నిలిపివేయాలని కార్మికుల హక్కులకు భంగం కలిగించే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు ఉద్యోగులు , కాంట్రాక్టు సిబ్బంది, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులందరికీ ప్రభుత్వ సహకారంతో సమగ్ర ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయాలి. అన్ని ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య సేవలు అందించాల తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల మూసివేతను నిలిపివేసి, పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. ఆర్.టి.ఏ చట్టం అమలుకు ముందు నియమితులైన ఉపాధ్యాయులకు తప్పనిసరి చేసిన టెట్ నిబంధనలను ఉపసంహరించుకోవాలని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 310, 311(2)(a), (b), (c)లను రద్దు చేయాలి. ఇ.ఎస్.యం.ఏ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి. పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం (డి.ఏ/డి.ఆర్) బకాయిలతో పాటు కోవిడ్ సమయంలో నిలిపివేసిన 18 నెలల డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగులు, పెన్షనర్ల ప్రయోజనాలకు విఘాతం కలిగించే పెన్షన్ వాలిడేషన్ చట్టం–2025ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
ఈ డిమాండ్లన్నీ కేవలం ఉద్యోగుల సమస్యలకే పరిమితం కావని, దేశంలోని ప్రభుత్వ వ్యవస్థ, కార్మికుల హక్కులు, సామాజిక భద్రత, ప్రభుత్వ విద్యా వ్యవస్థ పరిరక్షణకు సంబంధించిన కీలక అంశాలని నాయకులు పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సానుకూలంగా స్పందించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం నిర్వహిస్తున్న ఈ జాతీయ స్థాయి ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
డిసెంబర్ 12న న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగే ‘చలో ఢిల్లీ – కర్మచారి ఆక్రోశ్ ర్యాలీ’తో పాటు అనంతరం నిర్వహించే బహిరంగ సభకు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఐక్యతను చాటాలని ఏపీఎన్జీజీఓస్ అసోసియేషన్ నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ముజీఫర్ అహ్మద్, ఏఐఎస్జీఈఎఫ్ ఉమెన్ సబ్ కమిటీ కన్వీనర్ ఎం. రాజలక్ష్మి, ఎన్ఈసీ సభ్యురాలు వి. శాంతిశ్రీ, ఏపీఎన్జీజీఓస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్. భారతి ప్రసాద్, బి. జానకి, వి. సుబ్బారెడ్డి, ఎల్. రజనీష్ బాబు, యం. సరస్వతి, మహిళా విభాగం జాయింట్ కన్వీనర్ పి. సురేఖ, క్యాపిటల్ సిటీ అధ్యక్షులు సి.హెచ్. నాగభూషణం, కార్యవర్గ సభ్యులు కిషోర్ బాబు, మురళీమోహన్, లలితాంబ, దాసు, రామకృష్ణ, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు డి. సత్యనారాయణ రెడ్డి, పి. రమేష్, వి.వి. ప్రసాద్, సతీష్, రామకృష్ణ, విజయవాడ నగర శాఖ అధ్యక్షులు సి.హెచ్. సి.వి.ఆర్. ప్రసాద్, కోశాధికారి డి.ఎస్.యన్. శ్రీనివాస్ ఏపీ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ సోమయాజులు తదితరులు పాల్గొన్నారు.
