-పనుల్లో జాప్యం చేసే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి – నగర కమిషనర్ కె. మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
నగరంలో వివిధ దశల్లో ఉన్న అన్ని అభివృద్ధి పనులను డిసెంబర్ మొదటి వారం నాటికి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. టెండర్ ప్రక్రియ పూర్తయినప్పటికీ పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లకు నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి, పనులు రద్దు చేసి తిరిగి టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు.
బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ఇంజినీరింగ్ అధికారులతో కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. తొలుత అసిస్టెంట్ ఇంజినీర్ల (ఏఈ) వారీగా ఆయా డివిజన్లలో చేపట్టిన అభివృద్ధి పనుల స్థితిగతులను సమీక్షించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వివిధ దశల్లో ఉన్న పనులను సంబంధిత కాంట్రాక్టర్లు త్వరితగతిన ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులు, అమృత్ 2.0 పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలన్నారు. టెండర్లు పిలవాల్సిన పనులకు వెంటనే ప్రక్రియ పూర్తి చేసి క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించేలా చూడాలని సూచించారు.
అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో ఇంజినీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని, నాణ్యతా ప్రమాణాల్లో ఎలాంటి రాజీ లేకుండా చూడాలని ఆదేశించారు. పనులు పూర్తయిన వెంటనే సంబంధిత కొలతల పుస్తకం (ఎం.బుక్)లో వివరాలను నమోదు చేయాలన్నారు.
నగరంలోని ప్రధాన డ్రెయిన్లలో పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, నూతనంగా నిర్మిస్తున్న పార్కులు, పబ్లిక్ టాయిలెట్ల పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి పీజీఆర్ఎస్, 103 కాల్ సెంటర్ల ద్వారా అందే ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచించారు. సమస్య పరిష్కారానికి ముందు, పరిష్కరించిన తర్వాత ఫొటోలు తీసి, సంబంధిత ఫిర్యాదులను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని స్పష్టం చేశారు.
వాటర్ మీటర్లు పనిచేయని పరిస్థితి ఎక్కడా ఉండకూడదని, పనిచేయని మీటర్లను గుర్తించి నిబంధనల ప్రకారం డిస్కనెక్షన్ చర్యలు చేపట్టడంతో పాటు కొత్త మీటర్లు ఏర్పాటు చేసుకునేలా సంబంధిత వినియోగదారులకు నోటీసులు జారీ చేయాలని ఏఈలను ఆదేశించారు.
అలాగే నగరంలో ఎక్కడా గుంతలు (పాట్‌హోల్స్) లేకుండా చూడాలని, ఇప్పటికే ఉన్న గుంతలను గుర్తించి వెంటనే ప్యాచ్‌వర్క్ పనులు చేపట్టి రహదారులకు మరమ్మతులు చేయాలని అధికారులకు సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో ఎస్ఈ జి. వెంకటేశ్వరరావు, ఈఈలు సుందర్రామిరెడ్డి, విష్ణుమూర్తి, వేణుగోపాల్, డీఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.
