ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట‌ర్ల జాబితాపై ప్ర‌త్యేక దృష్టి

– దోష ర‌హిత జాబితా ప్ర‌చుర‌ణ‌కు ముమ్మ‌ర క‌స‌ర‌త్తు
– జిల్లా క‌లెక్ట‌ర్, జిల్లా ఎన్నిక‌ల అధికారి డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఓట‌ర్ల జాబితాపై ప్ర‌త్యేకంగా దృష్టిసారించామ‌ని.. దోష ర‌హిత జాబితా ప్ర‌చుర‌ణ‌కు ప్ర‌ణాళికాయుత కృషిచేస్తున్నామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్‌, జిల్లా ఎన్నిక‌ల అధికారి డా. జి.ల‌క్ష్మీశ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి ఓట‌ర్ల జాబితాపై బుధ‌వారం ఈసీఐ అధికారులు రాష్ట్ర సీఈవో, వివిధ జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో వ‌ర్చువ‌ల్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ వీడియో కాన్ఫ‌రెన్స్‌కు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధికారుల‌తో క‌లిసి క‌లెక్ట‌రేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్ నుంచి హాజ‌ర‌య్యారు. డిసెంబ‌ర్ 23వ తేదీన ముసాయిదా జాబితా ప్ర‌చురించాల్సి ఉన్నందున ప్ర‌స్తుతం చేపట్టాల్సిన చ‌ర్య‌ల‌పై ఈసీఐ అధికారులు దిశానిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో అందిన ఫారాలు, ఆమోదించిన ఫారాలు, పెండింగ్‌లో ఉన్న ఫారాల వివ‌రాలు తెలియ‌జేశారు. వీసీ అనంత‌రం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధికారుల‌తో మాట్లాడుతూ డిసెంబ‌ర్ 23న ముసాయిదా జాబితా ప్ర‌చుర‌ణ అనంత‌రం ఆ రోజు నుంచి జ‌న‌వ‌రి 12వ తేదీ వ‌ర‌కు క్లెయిమ్‌లు, అబ్జెక్ష‌న్ల దాఖ‌లుకు అవ‌కాశం ఉంటుంద‌ని, వాటిని ప‌రిష్క‌రించిన అనంత‌రం 2027, ఫిబ్ర‌వ‌రి 2న తుది జాబితాను ప్ర‌చురించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఈ నేప‌థ్యంలో అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి ఎక్క‌డా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాల‌ని ఆదేశించారు. ఓట‌ర్ల జాబితా రూప‌క‌ల్ప‌న‌పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలను కూడా కొన‌సాగించాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు.
స‌మావేశంలో డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహం, డీఈవో ఎల్‌.చంద్ర‌క‌ళ‌, డీఐవో బి.ప్ర‌భాక‌ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.