-రైతు సేవా కేంద్రాల ద్వారా దళారుల ప్రమేయం లేకుండా ధాన్యం విక్రయించుకోవచ్చు
-రైతుల కల్లాల వద్దకే వెళ్లి ధాన్యం నాణ్యత పరిశీలన – రైతుల సమక్షంలోనే కొనుగోళ్లు
-ధాన్యం కొనుగోళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త:
తిరువూరు మండలంలోని లక్ష్మీపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్), కాకర్ల రైతు సేవా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణకు చేస్తున్న ఏర్పాట్లు, సిబ్బంది విధులు, రైతులకు కల్పిస్తున్న సదుపాయాలను పరిశీలించి, కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా జరిగేలా సిబ్బందికి తగిన ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం రైతులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి, ఇటీవల ఆర్నబ్, మురసు తుఫాన్ల ప్రభావంతో పంటలకు ఏమైనా నష్టం వాటిల్లిందా, ప్రస్తుత ధాన్యం దిగుబడి, మార్కెట్ ధరలు, ప్రభుత్వం కల్పిస్తున్న కనీస మద్దతు ధర తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా ఈసారి పంట సాగు విస్తీర్ణాన్ని కొంత తగ్గించామని, తుఫాన్ల ప్రభావంతో తమ పంటలకు ఎలాంటి నష్టం జరగలేదని, ప్రస్తుతం ధాన్యానికి గిట్టుబాటు ధర లభిస్తోందని రైతులు కలెక్టర్‌కు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ, జిల్లాలో ఖరీఫ్ 2026-27 ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తూ రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర అందేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సాధారణ రకం క్వింటాల్‌కు రూ.2,441, 75 కిలోల బస్తాకు రూ.1,831.
గ్రేడ్-ఎ రకం: క్వింటాల్‌కు రూ.2,461, 75 కిలోల బస్తాకు రూ.1,846. రైతులు దళారులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా తమ గ్రామాల్లోనే ఏర్పాటు చేసిన రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర పొందవచ్చని సూచించారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ధాన్యాన్ని రైతుల సమక్షంలోనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. రైతు సేవా కేంద్రాల సిబ్బంది రైతుల కల్లాల వద్దకే వెళ్లి ధాన్యం నాణ్యతను పరిశీలిస్తారని పేర్కొన్నారు.
రైతులు రైతు సేవా కేంద్రంలో లేదా 7337359375 నంబర్‌కు వాట్సాప్ ద్వారా సందేశం పంపి ధాన్యం విక్రయానికి ముందస్తు షెడ్యూల్ చేసుకోవచ్చని తెలిపారు. ధాన్యం విక్రయించిన మొత్తాన్ని రైతుల ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని కలెక్టర్ వివరించారు. రైతులు స్వయంగా గోనె సంచులు, హమాలీలు, రవాణా ఏర్పాట్లు చేసుకున్నట్లయితే నిబంధనల ప్రకారం వాటికి సంబంధించిన మొత్తాన్ని కూడా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. ధాన్యం రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ పరికరాలు తప్పనిసరిగా అమర్చాలని ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లుల వరకు ధాన్యం రవాణాను నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతర పర్యవేక్షణలో కొనుగోళ్లు నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయితో పాటు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ప్రధాన కార్యాలయంలోనూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఏవైనా సమస్యలు ఎదురైతే జిల్లా పౌరసరఫరాల మేనేజర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 7702003571 ను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ధాన్యం కొనుగోలు విధానాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని, దళారుల ప్రమేయం లేకుండా తమ ధాన్యాన్ని విక్రయించి కనీస మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ రైతులకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంలో తిరువూరు ఆర్డీవో ఎ.కుమార్, తహసిల్దార్ చంద్రమౌళి, పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.
