-విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ ఏ రవీంద్రరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రజారోగ్య పరిరక్షణకు హోటళ్లు, రెస్టారెంట్లు, మాంసం విక్రయ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని విజయవాడ నగర పాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ ఏ. రవీంద్ర రావు అన్నారు. మంగళవారం సాయంత్రం ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్లో నగరంలో ప్రజారోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇంచార్జ్ కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, చికెన్ షాపులు, మటన్ షాపులు, కబేళాల్లో అధికారులు విస్తృతంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ముఖ్యంగా ఆహార పదార్థాల నాణ్యత, వాటి నిల్వ విధానం, పరిశుభ్రత, తాగునీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కలుషిత ఆహారం, కలుషిత నీరు ప్రజలకు చేరకుండా పటిష్టమైన పర్యవేక్షణ చేపట్టి, ప్రజలకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఆహార కల్తీ లేదా కలుషిత నీటి సరఫరా వంటి అంశాలు తనిఖీల్లో గుర్తించినట్లయితే వెంటనే సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించి, వారి సమన్వయంతో తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. హోటళ్లు, రెస్టారెంట్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిస్థాయిలో అరికట్టాలని, ముఖ్యంగా కర్రీ పాయింట్లలో 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ కవర్లలో కూరలు విక్రయించకుండా కఠినంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా పర్యావరణహితమైన ప్యాకేజింగ్ వస్తువులను వినియోగించేలా వ్యాపారులకు అవగాహన కల్పించాలని తెలిపారు. నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం చేస్తున్న వ్యాపార సంస్థలపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ట్రేడ్ లైసెన్సుల రద్దుకు కూడా వెనుకాడకూడదని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సి.హెచ్. నిర్మల గౌరీ, జోనల్ కమిషనర్లు శ్రీనివాస్, ప్రభుదాస్, షమ్మీ, ఎస్టేట్ ఆఫీసర్ ఎ. శ్రీధర్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాల నాయక్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ డి. హరీష్, శానిటరీ సూపర్వైజర్లు సలీం, బాలాజీ, శ్రీధర్, సోమరాజు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
