విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ ఏ రవీంద్రరావు ఆదేశాల మేరకు ప్రధాన కార్యాలయంలో జనగణన ఫేజ్-2కు సంబంధించి ఫీల్డ్ ట్రైనర్లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం రెండో రోజు మంగళవారం నిర్వహించారు. రాష్ట్ర స్థాయి శిక్షకులు సీహెచ్. వెంకటరమణ శిక్షణను నిర్వహిస్తూ, జనగణనలో భాగంగా చేపట్టాల్సిన క్షేత్రస్థాయి విధులు, సమాచార సేకరణ, వివరాల నమోదు తదితర అంశాలపై సమగ్రంగా వివరించారు.
శిక్షణలో భాగంగా జనగణన మార్గదర్శకాలు, వివిధ దశల్లో అనుసరించాల్సిన కార్యాచరణ, సమాచార సేకరణలో పాటించాల్సిన ప్రమాణాలు, ఎదురయ్యే సందేహాలను పరిష్కరించుకునే విధానాలపై ఫీల్డ్ ట్రైనర్లకు అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయిలో జనగణన సిబ్బందికి శిక్షణ అందించే బాధ్యతను దృష్టిలో ఉంచుకుని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవాలని సూచించారు. తద్వారా జనగణన ప్రక్రియ సజావుగా, కచ్చితత్వంతో నిర్వహించేందుకు అవసరమైన సన్నద్ధత పొందాలని తెలిపారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఫీల్డ్ ట్రైనర్లు పాల్గొన్నారు.
