ఎన్టీఆర్ జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

-తొలిరోజు సర్పంచ్ పదవులకు 61, వార్డు సభ్యుల పదవులకు 215 నామినేషన్లు దాఖలు
-ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ

తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్టీఆర్ జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు జిల్లాలో సర్పంచ్ పదవులకు 61 నామినేషన్లు, వార్డు సభ్యుల పదవులకు 215 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ డాక్టర్ జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. నందిగామ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో తొలిరోజు నమోదైన నామినేషన్ల వివరాలను కలెక్టర్ వెల్లడించారు.

చందర్లపాడు మండలం: సర్పంచ్ – 3, వార్డు సభ్యులు – 2.
జగ్గయ్యపేట మండలం: సర్పంచ్ – 17, వార్డు సభ్యులు – 47.
కంచికచర్ల మండలం: సర్పంచ్ – 12, వార్డు సభ్యులు – 59.
నందిగామ మండలం: సర్పంచ్ – 8, వార్డు సభ్యులు – 39.
పెనుగంచిప్రోలు మండలం: సర్పంచ్ – 2, వార్డు సభ్యులు – 1.
వత్సవాయి మండలం: సర్పంచ్ – 9, వార్డు సభ్యులు – 10.
వీరుల్లపాడు మండలం: సర్పంచ్ – 10, వార్డు సభ్యులు – 57.
ఈ ఏడు మండలాల్లో కలిపి సర్పంచ్ పదవులకు 61, వార్డు సభ్యుల పదవులకు 215 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు.

జిల్లావ్యాప్తంగా రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నామినేషన్ల స్వీకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.