-స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో మరింత బాధ్యత పెరిగింది
-పవన్ కళ్యాణ్ ఆదేశంతో జనసేన పార్టీ నాయకులు కూటమి స్ఫూర్తిని నిలిపేలా పనిచేస్తున్నారు
-యువతకు కూటమి పార్టీలు పూర్తి ప్రాధాన్యత ఇస్తున్నాయి
-తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కూటమి పార్టీల విలేకరుల సమావేశంలో మాట్లాడిన రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలో ఉన్న ప్రతి చోటా కూటమి పార్టీల అభ్యర్థులను ప్రజలు గెలిపించడం, ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని మరోసారి స్పష్టం చేసింది అని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. ప్రజలు ప్రభుత్వంపై, పాలనపై పెట్టుకున్న నమ్మకాన్ని అది మరోసారి తెలియజేయడమే కాకుండా, మాపై మరింత బాధ్యతలను పెంచింది అని అన్నారు. 2024 సాధారణ ఎన్నికల మాదిరే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు కూటమి పార్టీల పక్షాన నిలిచారని ఆయన పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం కూటమి పార్టీల నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తు, యువత ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పార్టీలు ఐక్యంగా కలిసి పనిచేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సవాళ్లను అంతా కూర్చుని మాట్లాడుకుని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నాం. దీనిని ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థలు, ప్రాదేశిక ఎన్నికల ఫలితాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. ప్రజా సంక్షేమంతోపాటు గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని చూసే ప్రజలు కూటమి పార్టీలను అత్యధిక మెజార్టీతో గెలిపించారు.
వైసీపీతో ప్రజలు విసిగిపోయారు
కూటమి పార్టీలు కొనసాగితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలు బలంగా నమ్ముతున్నారు.
గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన విధ్వంసం, అవినీతి పాలనపై ప్రజలు విసిగిపోయి ఉన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన మెజారిటీ నేడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కొనసాగించడం శుభపరిణామం. తర్వలో జరగనున్న 23 మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజల ఆశీర్వాదం ఇలాగే కొనసాగాలి.
కూటమి స్ఫూర్తి కి అనుగుణంగా జనసేన పని చేస్తుంది.
ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం చాలా నష్టపోయింది. ప్రజలు ఆయన పరిపాలనపై విసుగు చెందారు. వాటిన్నంటిని అధిగమించి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలు స్వేచ్ఛగా ప్రజాస్వామ్యబద్దంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో పాల్గొన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలు ప్రకారం ఎన్డీయే పార్టీల అభ్యర్థులు ఎక్కడ నిలబడిన వారి గెలుపు కోసం జనసేన నాయకులు, కార్యకర్తలు కలిసి చేస్తున్నారు. కూటమి స్ఫూర్తిని నిలిపేలా జనసేన పార్టీ పని చేస్తుంది. ఈ ఎన్నికల్లో కూటమి పార్టీలు కలిసికట్టుగా యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇచ్చాం. కొత్త ఆలోచనలతో వస్తున్న యువతకు సీట్లు ఇచ్చి అవకాశం కల్పిస్తున్నాం. ప్రజలు కూడా యువనాయకత్వానికి మద్దతుగా నిలవాలి. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం సమష్టిగా పనిచేస్తున్న కూటమి పార్టీలకు ప్రజలు ఆశీర్వాదం కావాలి. త్వరలో జరగబోయే 23 మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజా ఆశీర్వాదం కొనసాగాలి” అని కోరారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు.
