-పరిహారం చెల్లించే ఏర్పాటు చేయండి
-ఘటనపై ప్రకాశం జిల్లా కలెక్టర్ నుంచి వివరాలు తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కె. పల్లెపాలెంలో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో మత్స్యకారులు షెడ్లలో ఉంచిన వలలు దగ్ధమైన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఘటనపై ప్రకాశం జిల్లా కలెక్టర్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులంతా వలలు షెడ్లలో ఉంచుకోగా , అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించినట్టు కలెక్టర్ వివరించారు. మొత్తం 250 నుంచి 300 వరకు వలలు పూర్తిగా దగ్ధమయ్యాయని తెలిపారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఉప ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. తుపాను కారణంగా వేట విరామం ఉండడం, వలలు కాలిపోవడంతో మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా బాధిత కుటుంబాలకు తక్షణమే నిత్యావసర సరుకులు అందజేయాలని కలెక్టర్ ను ఆదేశించారు. నష్టపరిహారం అందించాలని, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన 2.O పథకం కింద నష్టపోయిన వలలను తిరిగి అందించే ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. వలలు నష్టపోయిన మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
