-శుక్రవారం నరసాపురం–పూరి మధ్య తీరాన్ని దాటే అవకాశం – ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
దక్షిణ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ‘అక్వాన్’ తీవ్ర తుపాను కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) సీఈవో ప్రఖర్ జైన్ తెలిపారు. గత ఆరు గంటల్లో గంటకు 9 కిలోమీటర్ల వేగంతో తుపాను కదులుతోందని వెల్లడించారు.
ప్రస్తుతం ఈ తుపాను నరసాపురానికి 500 కిలోమీటర్లు, కళింగపట్నానికి 540 కిలోమీటర్లు, చెన్నైకి 560 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 630 కిలోమీటర్లు, పూరీకి 690 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వివరించారు. శుక్రవారం మధ్యాహ్నానికి నరసాపురం–పూరీ మధ్య ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు.
ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు
తుపాను ప్రభావంతో గురువారం (నవంబర్ 19) ఉత్తరాంధ్ర జిల్లాల్లో చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఉత్తరాంధ్ర తీరం వెంబడి గురువారం గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు.
సహాయక బృందాలు సిద్ధం
తుపాను నేపథ్యంలో అత్యవసర సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఇప్పటికే సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. శ్రీకాకుళం, టెక్కలి, పలాస ప్రాంతాల్లో మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, విజయనగరంలో ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందం, పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు, సీతంపేట ప్రాంతాల్లో మరో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచామన్నారు. మొత్తంగా ఐదు ఎన్డీఆర్ఎఫ్, ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు స్థానిక అగ్నిమాపక సిబ్బందిని కూడా సహాయక చర్యల కోసం సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
ఉత్తరాంధ్ర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను పాటించాలని కోరారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తుపాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు.
