కుటుంబ జీవనంలో పెరుగుతున్న సమస్యలు.. పరిష్కారాలపై చర్చ

-59వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మహిళల రౌండ్ టేబుల్ సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
నేటి సమాజంలో కుటుంబ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై మహిళలు విస్తృతంగా చర్చించారు. 59వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా బుధవారం “మహిళలు – కుటుంబ జీవనంలో వస్తున్న సమస్యలు – పరిష్కారాలు” అనే అంశంపై రౌండ్ టేబుల్ చర్చా వేదిక నిర్వహించారు.
డాక్టర్ వేమూరి సత్యవతి ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ చర్చా కార్యక్రమంలో డాక్టర్ కీర్తి, వాసవ్య మహిళా మండలి డైరెక్టర్, రచయిత్రులు నైనాల వాణిశ్రీ, విజయ కంఠస్ఫూర్తి, దూపాటి శ్రీదేవితో పాటు సుమారు 20 మంది మహిళలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గత తరంతో పోలిస్తే ప్రస్తుత తరంలో కుటుంబ జీవితంలో చోటుచేసుకుంటున్న మార్పులు, వాటి కారణంగా తలెత్తుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై రెండు విడతల్లో చర్చించారు.
ప్రధానంగా సహజీవనాలు, దురలవాట్లు, విచ్చలవిడితనం, పిల్లల పెంపకంలో మారుతున్న ధోరణులు, తల్లిదండ్రుల పట్ల పిల్లల్లో అసంతృప్తి, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగవడం, బాల్యవివాహాలు, మానసిక ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వివాహేతర సంబంధాలు, ఆత్మహత్యలు, పిల్లల పెంపకంలో లోపాలు, తల్లిదండ్రులతో పిల్లలు అబద్ధాలు చెప్పడం, విడాకులు వంటి పలు అంశాలపై చర్చించారు.
కుటుంబ సంబంధాల్లో పరస్పర అవగాహన, ప్రేమాభిమానాలు, సహనం, బాధ్యతాయుతమైన ప్రవర్తన అవసరమని పలువురు అభిప్రాయపడ్డారు. మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా కుటుంబ వ్యవస్థలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, వాటికి ఆచరణాత్మక పరిష్కారాలు కనుగొనాల్సిన అవసరాన్ని వివరించారు.
ఈ కార్యక్రమంలో గృహిణులు, విద్యార్థినులు సైతం పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి రమాదేవి చిరు జ్ఞాపికలను అందజేశారు.