నగరంలో గార్బేజ్ పాయింట్లు లేకుండా నిరంతర పారిశుధ్య నిర్వహణ చేపట్టాలి

-చెత్త పేరుకుపోయే ప్రాంతాలపై ప్రత్యేక నిఘా.. వ్యర్థాలు వేసేవారికి జరిమానాలు విధించాలి: యంహెచ్ఓ డాక్టర్ సురేష్

గుంటూరు, ప్రజావార్త:
నగరంలో ఎక్కడా గార్బేజ్ పాయింట్లు లేకుండా, చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తూ మెరుగైన పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని నగర పాలక సంస్థ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ (ఎంహెచ్ఓ) డాక్టర్ సురేష్ తెలిపారు. నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఆదేశాల మేరకు గురువారం నగర పాలక సంస్థ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో శానిటరీ ఇన్‌స్పెక్టర్లతో ప్రజారోగ్య విభాగ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ మాట్లాడుతూ నగరంలో ఇంటింటికీ చెత్త సేకరణ వంద శాతం జరగాలని ఆదేశించారు. గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లు ఎక్కడా ఉండకూడదని, ఎక్కడైనా చెత్త పేరుకుపోతే వెంటనే తొలగించాలని సూచించారు. చెత్త వేస్తున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించాలని ఆదేశించారు.
వీధి వ్యాపారులు తమ వ్యాపారాల ద్వారా వెలువడే వ్యర్థాలను రోడ్లపై వేయకుండా పర్యవేక్షించాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్లకు సూచించారు. పారిశుధ్య నిర్వహణకు ఇంటింటి చెత్త సేకరణ కోసం అవసరమైన వాహనాలు, కార్మికులను పూర్తిస్థాయిలో కేటాయించామని, విధుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు.
పారిశుధ్య కార్మికుల హాజరును తప్పనిసరిగా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) ద్వారా నమోదు చేయాలని, హాజరు ఆధారంగానే వేతనాలు చెల్లిస్తామని తెలిపారు. ఉదయం ఇంటింటి చెత్త సేకరణకు, మధ్యాహ్నం గ్యాంగ్ వర్క్ ద్వారా పారిశుధ్య పనులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. డ్రైన్లను ప్రతిరోజూ శుభ్రం చేయడంతో పాటు వాటి నుంచి తొలగించిన వ్యర్థాలను వెంటనే తరలించాలని ఆదేశించారు.
అన్న క్యాంటీన్ల వద్ద ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. నగరంలో వ్యాపారాలు నిర్వహించే ప్రతి దుకాణ యజమాని తప్పనిసరిగా డి అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉండాలని, గడువు ముగిసిన లైసెన్సులను వెంటనే పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
నగరంలోని ఖాళీ స్థలాలు, నీరు నిలిచే ప్రాంతాల్లో దోమల వృద్ధిని అరికట్టేందుకు యాంటీ లార్వా మందులను పిచికారీ చేయించాలని బయాలజిస్ట్‌ను ఆదేశించారు. రోడ్ల మార్జిన్లపై భవన నిర్మాణ వ్యర్థాలను వేయకుండా నిరంతరం పర్యవేక్షించాలని, ఎవరైనా వ్యర్థాలను వేస్తే వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో బయాలజిస్ట్ శేషయ్య, శానిటరీ సూపర్‌వైజర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.