– నవంబర్ 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి
– బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు ఇ.జగ్గయ్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
డీఎస్సీ–2026 నియామక పరీక్షలకు సిద్ధమవుతున్న ఎన్టీఆర్ జిల్లాకు చెందిన అర్హులైన బీసీ అభ్యర్థులకు ఉచిత ఆన్లైన్ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ స్టడీ సర్కిల్, విజయవాడ సంచాలకులు ఇ.జగ్గయ్య తెలిపారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ), స్కూల్ అసిస్టెంట్ పోస్టుల నియామక పరీక్షలకు సంబంధించి ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ శిక్షణకు టెట్లో ఉత్తీర్ణులైన బీసీ అభ్యర్థులు మాత్రమే అర్హులని తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను అవసరమైన ధ్రువపత్రాలతో కలిపి నవంబర్ 25, 2026వ తేదీలోగా బీసీ స్టడీ సర్కిల్, విజయవాడ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వివరించారు. అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు పదో తరగతి, టి.టి.సి. లేదా బి.ఎడ్., టెట్ మార్కుల జాబితాలు, కుల ధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1,00,000 లోపు ఉన్నట్లు తెలిపే ఆదాయ ధ్రువీకరణ పత్రం లేదా తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలను జతపరచాలి. దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా: బీసీ స్టడీ సర్కిల్, డోర్ నెం. 74-2-1/5, అశోక్ నగర్, పండరిపురం, రోడ్డు నెం. 8, విజయవాడ–520007. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 8688855255, 9966849937, 9505094349. డీఎస్సీ–2026 నియామక పరీక్షలకు సిద్ధమవుతున్న అర్హులైన బీసీ అభ్యర్థులు ఈ ఉచిత ఆన్లైన్ శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు ఇ.జగ్గయ్య కోరారు.
