పైపుల రోడ్డులో ‘ది ఫిట్‌నెస్ వరల్డ్’ జిమ్ ప్రారంభించిన ఎమ్మెల్యే బొండా ఉమా

-యువత ఆరోగ్యంపై దృష్టి సారించి వ్యాయామాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
నేటి ఆధునిక జీవనశైలిలో ఆరోగ్య పరిరక్షణకు వ్యాయామం ఎంతో అవసరమని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. గురువారం విజయవాడ పైపుల రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ది ఫిట్‌నెస్ వరల్డ్’ జిమ్‌ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం జిమ్‌లో ఏర్పాటు చేసిన ఆధునిక వ్యాయామ పరికరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ యువత శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడంతో పాటు ప్రతిరోజూ వ్యాయామం చేయడాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
అనంతరం జిమ్ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించి, నూతనంగా ప్రారంభించిన వారి వ్యాపార ప్రయాణం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిమ్ నిర్వాహకులు, స్థానిక ప్రముఖులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.