సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలతో వినూత్న ఉత్పత్తుల తయారీ

-13 వేల కిలోల ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్‌తో 90 కిలోల బరువైన 150 బెంచ్ ఏర్పాటు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడంతో పాటు, ఇప్పటికే వినియోగించిన ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి ప్రజలకు ఉపయోగపడే వస్తువులుగా తయారు చేస్తున్నామని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) డా. డి. చంద్రశేఖర్ తెలిపారు.

గురువారం సాయంత్రం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్‌లో పర్యావరణహిత ఉత్పత్తుల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించే పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. అనంతరం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి తయారు చేసిన బెంచ్‌ను లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా అదనపు కమిషనర్ డా. డి . చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రజాప్రగతి ట్రస్ట్ సహకారంతో నగరంలోని వివిధ కళాశాలలు, అపార్ట్‌మెంట్ల నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వాటిని రీసైక్లింగ్ ద్వారా ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మారుస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కూర్చునేందుకు వీలుగా బెంచీలు, మొక్కల రక్షణకు రైలింగ్స్‌తో పాటు వివిధ ఆకారాల్లో పర్యావరణహిత ఉత్పత్తులను తయారు చేస్తున్నామని వివరించారు.

నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన సుమారు 13 వేల కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి 90 కిలోల బరువైన 150 బెంచ్‌ను తయారు చేసినట్లు వెల్లడించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి అందించిన వారికి, వారు అందించిన ప్లాస్టిక్ పరిమాణానికి అనుగుణంగా రీసైకిల్ చేసిన ఉత్పత్తులను బహుమతుల రూపంలో అందించే విధానాన్ని కూడా అమలు చేస్తున్నామని తెలిపారు. దీనివల్ల ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణపై ప్రజల్లో ఆసక్తి పెరగడంతో పాటు, వ్యర్థాలను విలువైన వస్తువులుగా మార్చే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.

ప్రజాప్రగతి ట్రస్ట్ సౌజన్యంతో, కేవీబీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) ప్రాజెక్ట్ అయిన ‘డ్రాప్’ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలను బాధ్యతాయుతంగా సేకరించి రీసైక్లింగ్ చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రగతి ట్రస్ట్ ప్రతినిధులు సుస్మిత, టైసన్, కల్పన, వెంకటేష్, బాలాజీ శంకర్, లక్ష్మణ్ నాయుడు పాల్గొన్నారు.