విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయదశమి ఉత్సవాల సందర్భంగా నిరంతరం సేవలందించి, వేలాది మంది భక్తులకు అండగా నిలిచిన 130 మంది యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లను మంగళవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఎన్టీఆర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నాస్తిక కేంద్రం ఏసీ కాన్ఫరెన్స్ హాల్లో ఘనంగా సత్కరించారు. ఈ సత్కార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ పి. రామచంద్రరాజు మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, మానవత్వాన్ని ఆచరణలో చూపించడం రెడ్ క్రాస్ సేవా స్ఫూర్తికి నిదర్శనమని పేర్కొన్నారు. విజయదశమి వంటి భారీ ఉత్సవాల్లో వేలాది మంది భక్తులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన యువ వాలంటీర్లను ప్రశంసించారు. రెడ్ క్రాస్ ఎన్టీఆర్ జిల్లా గౌరవ కార్యవర్గ సభులు డాక్టర్ ఎం సి దాస్ మాట్లాడుతూ యువత ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మరింత చురుకుగా పాల్గొని సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రెడ్ క్రాస్ ఎన్టీఆర్ జిల్లా శాఖ ఛైర్మన్ డాక్టర్ జి. సమరం మాట్లాడుతూ కొండపైకి వెళ్లే భక్తులకు సహాయం చేయడానికి 130 మంది యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు అన్ని రోజులూ 24గంటలు సేవలందించారన్నారు, ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, నడవలేని స్థితిలో ఉన్నవారు, ఇతర అవసరార్థులను వీల్చైర్లలో తీసుకెళ్లడం, తమ చేతులతో ఆసరా అందిస్తూ కొండపైకి చేరవేయడం ద్వారా మానవతా విలువలను చాటుకున్నారన్నారు. ఎండ, అలసటలను లెక్కచేయకుండా భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లలో ఉన్నవారికి మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేసి దాహార్తిని తీర్చారన్నారు. యువతలో సేవాభావం, క్రమశిక్షణ, మానవత్వం ఎంతగా పెంపొందుతున్నాయో ఈ వాలంటీర్లే నిదర్శనమని కొనియాడారు. కార్యక్రమాల ప్రచార, ప్రసారాలను సమర్ధవంతగా నిర్వహించిన జిల్లా కార్యవర్గ సభ్యులైన శ్రీ కె.జయరాజ్ గారిని అభినందించారు. అదే విధంగా రెగ్యులర్ గా యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్ సేవలను తమ తమ మాధ్యమాల్లో ప్రచారం చేసిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా ధన్యవాదాలు తెలియచేసారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ జిల్లా కోశాధికారి శ్రీ ఎన్ జోషి, యూత్ రెడ్ క్రాస్ ఎన్టీఆర్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కె రమేష్, ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ వీర్రాజు, ఆదిత్య విమెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీమతి జగదీశ్వరి, శ్రీమతి రష్మి, యూత్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్స్ శ్రీ సుబ్బారావు, శ్రీ చినబాబు, తదితరులు పాల్గొని వాలంటీర్ల సేవలను అభినందించారు. విజయదశమి ఉత్సవాల్లో నిరంతరాయంగా సేవలందించిన 130 మంది యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లను అతిథులు సత్కరించి, భవిష్యత్తులోనూ ప్రజాసేవలో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు.
130 మంది యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లకు ఘన సత్కారం
