-చేపలు, రొయ్యల వ్యర్థాల నుంచి అధిక విలువ కలిగిన ఉత్పత్తుల తయారీకి అంతర్జాతీయ సాంకేతిక సహకారం
-భీమవరం ఆక్వాకల్చర్ క్లస్టర్‌ను ఆదర్శవంతమైన సర్క్యులర్ ఎకానమీ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
-ఐస్లాండ్ ఓషన్ క్లస్టర్ వ్యవస్థాపకులు, చైర్మన్ డాక్టర్ థోర్ సిగ్ఫుస్సన్ తో ఆక్వారంగ క్లస్టర్ ల సమావేశం
-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త:
పశ్చిమ గోదావరి జిల్లాలో మత్స్య, ఆక్వాకల్చర్ రంగాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, చేపలు, రొయ్యల ప్రాసెసింగ్ ద్వారా వెలువడే వ్యర్థాలను సైతం విలువైన వాణిజ్య ఉత్పత్తులుగా మార్చి ఆర్థిక ప్రయోజనాలు పొందే దిశగా అంతర్జాతీయ సాంకేతిక సహకారానికి తమ వంతు సహకారం అందిస్తామని ఐస్లాండ్ ఓషన్ క్లస్టర్ వ్యవస్థాపకులు, చైర్మన్ డాక్టర్ థోర్ సిగ్ఫుస్సన్ అన్నారు.
ఇందులో భాగంగా ఐస్లాండ్లో విజయవంతంగా అమలవుతున్న నూరు శాతం ఫిష్ కాన్సెప్ట్ విధానాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో అమలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు.
మత్స్యశాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో ‘హోల్ ఫిష్ కాన్సెప్ట్ – చేపల విలువ జోడింపులో నూతన కోణం’ అనే అంశంపై వివిధ భాగస్వామ్య క్లస్టర్ లతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ఐస్లాండ్ ఓషన్ క్లస్టర్ వ్యవస్థాపకులు, చైర్మన్ డాక్టర్ థోర్ సిగ్ఫుస్సన్, ఆయన సతీమణి హాల్డోరా విఫిల్స్డోటిర్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై, ఐస్లాండ్లో అమలవుతున్న ఆధునిక విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం, చేపలు, రొయ్యల నుంచి గరిష్ట ఆర్థిక విలువను పొందే అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా ఐస్లాండ్ ఓషన్ క్లస్టర్ వ్యవస్థాపకులు, చైర్మన్ డాక్టర్ థోర్ సిగ్ఫుస్సన్ మాట్లాడుతూ చేపల వ్యర్థాలు కూడా విలువైన వనరులే అని, వీటిని నూరు శాతం ఫిష్ కాన్సెప్ట్ తో అధిక విలువ కలిగిన ఉత్పత్తులుగా మార్చి ఆక్వారంగాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చు అన్నారు.
సాధారణంగా చేపలు, రొయ్యల ప్రాసెసింగ్ సమయంలో తొక్కలు, తలలు, ఎముకలు, అంతర్గత భాగాలు తదితర వ్యర్థాలుగా పరిగణించే ఉప ఉత్పత్తులను శాస్త్రీయంగా సేకరించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అధిక విలువ కలిగిన ఉత్పత్తులుగా మార్చడమే నూరుశాతం ఫిష్ కాన్సెప్ట్ ప్రధాన ఉద్దేశ్యం అన్నారు. ఐస్లాండ్లో విజయవంతంగా అమలవుతున్న ఈ విధానం ద్వారా చేపల్లోని ప్రతి భాగాన్ని గరిష్ట స్థాయిలో వినియోగించుకుంటూ, వ్యర్థాల పరిమాణాన్ని తగ్గించి, అదనపు ఆదాయ మార్గాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
ఇదే విధానాన్ని భీమవరం ఆక్వాకల్చర్ క్లస్టర్లో ప్రవేశపెట్టడం ద్వారా స్థానిక పరిశ్రమలకు అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులు, పరిశోధన, అభివృద్ధి అవకాశాలను అందుబాటులోకి తీసుకురావడంపై సమావేశంలో చర్చించారు.
**ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద నోటిఫై చేయబడిన భీమవరం బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ క్లస్టర్ మత్స్య, రొయ్యల ఉత్పత్తిలో రాష్ట్రంలోనే కీలక కేంద్రంగా గుర్తింపు పొందిందన్నారు.
ఉత్పత్తి పెరుగుదలతో పాటు ప్రాసెసింగ్, విలువ జోడింపు, ఉప ఉత్పత్తుల వినియోగం వంటి రంగాల్లోనూ సమాంతర అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లాలో ఇప్పటికే సమర్థవంతమైన సీఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థ అందుబాటులో ఉందన్నారు. జిల్లాలో 26 సీఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, 30 ప్రీ-ప్రాసెసింగ్ యూనిట్లు, నాలుగు లైసెన్స్ పొందిన పీలింగ్ షెడ్లు, సుమారు 130 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన నాలుగు రీసైక్లింగ్ యూనిట్లు పనిచేస్తున్నాయన్నారు.
భీమవరంలోని పలు సంస్థలు ఇప్పటికే రొయ్యల తొక్కలు, తలలు, చేపల ప్రాసెసింగ్ వ్యర్థాల నుంచి కైటిన్, కైటోసాన్ , రొయ్యల తల పొడి వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తున్నాయన్నారు.
అయితే, ఈ రంగాన్ని మరింత విస్తరించేందుకు వ్యర్థాల సేకరణ, వేర్వేరుగా విభజించడం, శాస్త్రీయ పద్ధతుల్లో ప్రాసెసింగ్ చేయడం, ఆధునిక యంత్ర పరికరాల వినియోగం, నాణ్యతా ప్రమాణాల అమలు వంటి అంశాల్లో మరింత మెరుగైన వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఐస్లాండ్ ఓషన్ క్లస్టర్‌తో ఆరు కీలక రంగాల్లో సహకార ప్రతిపాదనలు
డాక్టర్ థోర్ సిగ్ఫుస్సన్తో జరిగిన సమావేశంలో భీమవరం ఆక్వాకల్చర్ క్లస్టర్ అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను చర్చించారు.
చేపలు, రొయ్యలలోని ప్రతి భాగాన్ని గరిష్టంగా వినియోగించుకుంటూ, ప్రస్తుతం వ్యర్థాలుగా పరిగణిస్తున్న ఉప ఉత్పత్తులను లాభదాయకమైన వాణిజ్య ఉత్పత్తులుగా మార్చే సాంకేతికతను రూపొందించుకోవాలన్నారు. అధునాతన బై-ప్రొడక్ట్ ప్రాసెసింగ్ టెక్నాలజీలను జిల్లాకు పరిచయం చేయడం, పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించడం, స్థానిక పారిశ్రామికవేత్తలు, సాంకేతిక సిబ్బందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించే అవకాశాలను పరిశీలించడం. భీమవరం క్లస్టర్ పరిధిలో చేపలు, రొయ్యల ప్రాసెసింగ్ వ్యర్థాలను ఒక క్రమబద్ధమైన వ్యవస్థ ద్వారా సేకరించి, వేర్వేరుగా విభజించి, శాస్త్రీయంగా ప్రాసెస్ చేసే సమీకృత కేంద్రాల ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు. విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి, బ్రాండింగ్, ప్యాకేజింగ్, లేబులింగ్, ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్, అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల అమలు, ఎగుమతి మార్కెటింగ్ రంగాల్లో సహకారం పొందడం అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.
ఐస్లాండ్ ఓషన్ క్లస్టర్, స్థానిక సీఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల మధ్య సమన్వయం పెంపొందించి, కొత్త పరిశ్రమలు, ఉపాధి అవకాశాల అభివృద్ధికి మార్గం సుగమం అయ్యేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఈ అంతర్జాతీయ సహకారం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలో మత్స్య, ఆక్వా రంగాలకు అదనపు ఆర్థిక విలువను తీసుకురావడంతో పాటు, వ్యర్థాల సమర్థ వినియోగం, రీసైక్లింగ్ వ్యవస్థ బలోపేతం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం వంటి ప్రయోజనాలు చేకూరనున్నాయన్నారు.
స్థానిక పరిశ్రమలకు కొత్త వ్యాపార అవకాశాలు, యువతకు ఉపాధి అవకాశాలు, పారిశ్రామికవేత్తలకు పెట్టుబడి అవకాశాలు పెరిగే అవకాశం ఉందన్నారు.
మత్స్య వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిచ్చే సుస్థిర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఈ విధానం దోహదపడుతుందన్నారు.
అనంతరం ఐస్లాండ్ ఓషన్ క్లస్టర్ వ్యవస్థాపకులు, చైర్మన్ డాక్టర్ థోర్ సిగ్ఫుస్సన్, ఆయన సతీమణి హాల్డోరా విఫిల్స్డోటిర్ లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి దృశ్యాలువా తో సత్కరించి, భారతీయ పల్లెటూరు సాంప్రదాయానికి గుర్తుగా జోడెద్దుల బొమ్మను బహుకరించారు.
ఈ సమావేశం లో ఫిషరీష్ కమీషనర్ రమశంకర నాయక్, డి ఆర్ ఒ పి. గ్లోరీ, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాస్, ఆక్వారంగా క్లస్టర్లు తదితరులు పాల్గొన్నారు.
