-భారీ ప్రాజెక్టులకు ఎంఎస్ఎంఈల అనుసంధానం
-ప్రతి పారిశ్రామిక క్లస్టర్‌కూ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేయాలి
-పారిశ్రామిక అవసరాలకు ల్యాండ్ బ్యాంక్… అవసరమైతే నూతన పాలసీ
-సైబరాబాద్ తరహాలో వైజాగ్ బే-టెక్ సిటీ
-సూర్యలంక, గండికోటలకు టూరిజం మాస్టర్ ప్లాన్
-విశాఖ, తిరుపతి, అమరావతి ఎకనామిక్ రీజియన్లపై ముఖ్యమంత్రి సమీక్ష
-రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై అధికారులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి రూపొందించిన విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఆర్థిక ప్రాంతాల ప్రణాళికలు అభివృద్ధికి బ్లూప్రింట్ వంటివని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మూడు ఆర్థిక ప్రాంతాలపై అధికారులు రూపొందించిన ప్రణాళికలపై ముఖ్యమంత్రి ఒకేసారి సమీక్ష నిర్వహించారు. గురువారం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై అధికారులకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. ఈ మూడు ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు, ఇప్పటివరకు గుర్తించిన పెట్టుబడులను వాస్తవరూపంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రణాళికల్లో ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే గుర్తించి భర్తీ చేయాలని, వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. పరిశ్రమలు రావడం, పెట్టుబడులు పెట్టడం మాత్రమే అభివృద్ధి కాదని.. వాటి ద్వారా రాష్ట్ర ప్రజల ఆదాయాలు పెరగాలని, జీవన ప్రమాణాలు మెరుగుపడాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రజలకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి తలసరి ఆదాయాన్ని పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని… దానికి అనుగుణంగా అధికార యంత్రాంగం పని చేయాలన్నారు. ప్రతి ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతలు, వనరులు, అవకాశాలను వినియోగించుకుంటూ రూపొందించిన అభివృద్ధి ప్రణాళికలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ అవసరమైన మేరకు మార్పులు చేయాలని సూచించారు. మూడు రీజియన్లల్లో జరుగుతున్న అభివృద్ధి, పెట్టుబడులు, ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికల అమల్లో ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం కచ్చితంగా ఉండేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. ప్రణాళికల అమల్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే… ఆ సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతినిధుల సహకారం కూడా తీసుకుని ప్రభుత్వం యంత్రాంగం పని చేయాలని సూచించారు. అలాగే ఈ ప్రాజెక్టుల అమలుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియ చేయడంతోపాటు… వివిధ రూపాల్లో వారినీ భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సిటీ ఎకనమిక్ రీజియన్ స్కీం కింద 60 ప్రాజెక్టులకు సంబంధించి రూ.9,180 కోట్లతో సిద్దం చేసి ప్రతిపాదనలను కార్యరూపం దాల్చేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
పోర్టు ఆధారిత పరిశ్రమలతో అభివృద్ధి
విశాఖపట్నం ఎకనమిక్ రీజియనల్ ప్రణాళికలో భాగంగా యాంకర్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తున్న ప్రాంతానికి విశాఖ బే-టెక్ సిటీ అని పేరు పెట్టారు. వివిధ పేర్లను పరిశీలించిన అనంతరం సీఎం చంద్రబాబు విశాఖ బే-టెక్ సిటీ పేరును ఖరారు చేశారు. హైదరాబాద్ నగరంలో సైబరాబాద్ పేరుతో ఓ నగరాన్ని అభివృద్ధి చేసినట్టుగానే బే-టెక్ సిటీ పేరుతో విశాఖకు అనుబంధంగా మరో నగరాన్ని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. అలాగే వీఈఆర్ స్టీరింగ్ కమిటీలో నగర మేయర్‌కు చోటు కల్పించాలని సీఎం సూచించారు. విశాఖ ఎకనమిక్ రీజియన్ పరిధిలో వివిధ విభాగాలకు సంబంధించి 167 ప్రాజెక్టులకు గానూ… 64 ప్రాజెక్టులు అమల్లోకి వచ్చాయని సీఎం వివరించారు. విశాఖకు చెరో వైపు ఉన్న విజయనగరం, అనకాపల్లి వైపు అభివృద్ధి జరుగుతోందని… ఆ ప్రాంతాల్లో అవసరమైన మేరకు ముందుగానే భూమిని గుర్తించి ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. అలాగే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భూ లభ్యత తక్కువగా ఉంటుందని… దీనివల్ల పారిశ్రామికాభివృద్ధికి కొంత ఇబ్బంది ఉందన్నారు. ఈ మేరకు ఈ జిల్లాల్లో కూడా ఏపీఐఐసీతో సమన్వయం చేసుకుని ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. దీనికోసం అవసరమైతే పాలసీ తీసుకురావాలని అధికారులకు సూచించారు. విశాఖలో ఏడాదిలోగా కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం పూర్తి చేయాలని, తదుపరి సీఐఐ భాగస్వామ్య సదస్సును అందులోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోర్టుల ఆధారిత ఆర్థిక వ్యవస్థకు విస్తృత అవకాశాలున్నాయని, పరిశ్రమలకు అవసరమైన లాజిస్టిక్స్, పోర్టులు, విమానాశ్రయాల అనుసంధానాన్ని మెరుగుపరిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రతి పారిశ్రామిక ప్రాంతం వద్ద అవసరమైన నివాస, విద్య, వైద్యం, రవాణా సదుపాయాలతో టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. తిరుపతి ఎకనమిక్ రీజియన్ పరిధిలోని 16 పట్టణాలను పారిశ్రామిక నగరాలుగా తీర్చిదిద్దాలని నిర్దేశించారు.
నాలెడ్జ్ పార్టనర్లుగా ప్రముఖ విద్యా సంస్థలు
తిరుపతి ఆర్థిక ప్రాంతాన్ని సాంకేతిక, పారిశ్రామిక, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తిరుపతిని గ్లోబల్ సెమీ కండక్టర్ల డిజైన్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఎలక్ట్రానిక్స్, స్పేస్, రోబోటిక్స్, డ్రోన్లు వంటి రంగాలకు అనుబంధంగా డిజైన్ పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కొప్పర్తి, తిరుపతి, లేపాక్షి పారిశ్రామిక క్లస్టర్లను మరింత బలోపేతం చేయాలన్నారు. మూడు ఆర్థిక ప్రాంతాల్లో ప్రధాన పరిశ్రమల ఏర్పాటుతో పాటు వాటికి అవసరమైన విడిభాగాలు, సేవలు అందించే ఎంఎస్ఎంఈలను కూడా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేవలం భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయడం కాకుండా, వాటి చుట్టూ స్థానికంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమల నెట్వర్క్ ఏర్పడాలని చెప్పారు. ముఖ్యంగా పెద్ద పరిశ్రమలకు అనుసంధానించేలా ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించాలని చెప్పారు. ప్రతి రంగానికి అవసరమైన పూర్తి ఎకోసిస్టమ్ అభివృద్ధి చేయాలన్నారు. పరిశ్రమల వ్యర్థాల్లోని విలువైన పదార్థాలను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చే అవకాశాలను పరిశీలించాలని, అరుదైన ఖనిజాల వ్యర్థాల నుంచి ఇతర అవసరాలకు ఉపయోగపడే పదార్థాలను వేరు చేసే సాంకేతికతపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. గ్రీన్ ఎనర్జీ, హార్టికల్చర్, ఖనిజ సంపద ఆధారంగా తిరుపతి ప్రాంతంలో కొత్త పెట్టుబడులకు అవకాశాలున్నాయని చెప్పారు. తిరుపతి ఎకనమిక్ రీజియన్ పరిధిలో మొత్తంగా రూ. 9 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే… అత్యథిక శాతం గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ. 5.70 లక్షల కోట్లు వచ్చాయని సీఎం చెప్పారు. రేర్ ఎర్త్ మినరల్స్ రంగంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని.. దీన్ని మాగ్నటిక్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని సూచించారు. హార్టికల్చర్ హబ్ అభివృద్ధికి సంబంధించి వచ్చిన ప్రతిపాదనలను కార్యాచరణలోకి తీసుకురావాలని, మూడేళ్లలో లక్ష్యాలను సాధించేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. పెట్టుబడులు ఏయే రంగాల్లో, ఏయే ప్రాంతాల్లో వస్తున్నాయో స్పష్టంగా గుర్తించి, లక్ష్యాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. శ్రీసిటీ వంటి పారిశ్రామిక కేంద్రాల అనుభవాన్ని వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి ఎకనమిక్ రీజియన్‌లో ఆక్వా, కోకో, పామాయిల్ వంటి రంగాలు అతి పెద్ద ఆర్థిక చోదక శక్తులుగా ఉన్నాయని తెలిపారు. అమరావతి ఎకనమిక్ రీజియన్ పరిధిలో ఇప్పటికే రూ. 4.65 లక్షల కోట్ల విలువైన 48 ప్రాజెక్టులు నడుస్తున్నాయని తెలిపారు. మచిలీపట్నం, రామాయపట్నం వంటి పోర్టులకు మంచి కనెక్టివిటీ అందిస్తే ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అలాగే క్వాంటం రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా అమరావతి రీజియన్ పరిధిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు. క్వాంటం కారిడార్ గా అమరావతి అభివృద్ధి చెందుతుందన్నారు. క్వాంటం వ్యాలీతోపాటు… క్వాంటం మాన్యుఫ్యాక్చరింగ్ రంగానికి అమరావతి కేంద్రంగా మారుతుందనన్నారు. అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్, ఔటర్ రింగ్‌రోడ్ నిర్మాణాలు అభివృద్ధికి కేంద్రంగా ఉంటాయని పేర్కొన్నారు. మూడు ఆర్థిక ప్రాంతాలకు ప్రముఖ విద్యాసంస్థలను నాలెడ్జ్ పార్టనర్లుగా నియమించాలని ముఖ్యమంత్రి సూచించారు. తిరుపతి ప్రాంతానికి ఐఐటీ, అమరావతి ప్రాంతానికి బిట్స్ పిలానీ వంటి సంస్థలతో పాటు మూడు ప్రాంతాల్లోనూ ప్రముఖ విద్యాసంస్థల భాగస్వామ్యాన్ని తీసుకోవాలన్నారు. పరిశ్రమలు, విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థల మధ్య నిరంతర అవగాహన, చర్చలు జరగాలని చెప్పారు. ఐఐటీయన్లు, పాన్ ఐఐటీ నిపుణుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
తీర ప్రాంతం… బుద్దిస్ట్ సర్క్యూట్లతో టూరిజం అభివృద్ధి
అరకు, లంబసింగి వంటి పర్యాటక ప్రాంతాలకు సందర్శకులను ఆకర్షించేలా రహదారులు, వసతి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎం చంద్రబాబు చెప్పారు. వచ్చే సీఐఐ సదస్సు నాటికి వివిధ ప్రాంతాల నుంచి ప్రతినిధులను అరకు, లంబసింగి వంటి ప్రాంతాలకు తీసుకెళ్లాలని సూచించారు. తీర ప్రాంతాలను పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచుతూ బీచ్ రిసార్టులుగా అభివృద్ధి చేయాలన్నారు. సూర్యలంక, ఓడరేపు, చినగంజాం, నిజాం పట్నం, డిండి వంటి ప్రాంతాల్లో బీచ్, ఎకో టూరిజానికి అవకాశం ఉందని తెలిపారు. పర్యాటక అభివృద్ధి పేరుతో కాలుష్యానికి తావుండకూడదని స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక పర్యాటకానికి ఉన్న అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని, శ్రీశైలం సహా ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని చెప్పారు. నాగార్జునకొండ, అమరావతి ప్రాంతాలను అనుసంధానిస్తూ బౌద్ధ పర్యాటక సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. సూర్యలంక బీచ్ అభివృద్ధికి ప్రణాళికలు రచించి… ఆ మేరకు ఆ ప్రాంతాన్ని నోటిఫై చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సూర్యలంక, గండికోట ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి సమగ్ర మాస్టర్ప్లాన్లు రూపొందించాలని నిర్దేశించారు. ఇప్పటికే కుదిరిన అవగాహన ఒప్పందాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చూడాలని, పెట్టుబడుల గ్రౌండింగ్‌పై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. వీకెండ్ ఎకానమీపై దృష్టి పెట్టాలని… వాణిజ్య, పర్యాటక, వినోద కార్యకలాపాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సమావేశంలో విశాఖ, తిరుపతి, అమరావతి ఎకనమిక్ రీజియన్లకు సంబంధించిన సీఈఓలు యువరాజ్, ముఖేష్ కుమార్ మీనా, సురేష్ కుమార్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
