విజయవాడ నగరంలో ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజలకు అవగాహన – సందేహాల నివృత్తికి ఓపెన్ ఫోరంలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ ఏ. రవీంద్రరావు ఆదేశాల మేరకు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్)పై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, దరఖాస్తుదారుల సందేహాలను నివృత్తి చేసేందుకు శుక్రవారం నగరంలోని మూడు సర్కిల్ కార్యాలయాల్లో పట్టణ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక ఓపెన్ ఫోరంలను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎల్‌ఆర్‌ఎస్ విధానం, దరఖాస్తు ప్రక్రియ, దరఖాస్తుల పరిశీలన, సంబంధిత నిబంధనలు తదితర అంశాలపై అధికారులు ప్రజలకు వివరించారు. ఇప్పటికే ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రజలు తమ దరఖాస్తులకు సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలు, సందేహాలను అధికారుల దృష్టికి తీసుకురాగా, వాటిని పరిశీలించి తగిన వివరణలు అందించారు. దరఖాస్తుల స్థితిగతులు, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై కూడా అవగాహన కల్పించారు.

నగరంలోని మూడు సర్కిల్ కార్యాలయాల్లో నిర్వహించిన ఈ ఓపెన్ ఫోరంలకు సుమారు 70 మంది ప్రజలు హాజరై తమ ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కార మార్గాలను సూచించేందుకు ఈ కార్యక్రమం దోహదపడింది.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.