-తొలుత 16 మంది జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం
-ప్రిసైడింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధ్యక్షతన పరోక్ష ఎన్నికల ప్రక్రియ
-స్థానిక సంస్థల ఎన్నికల సాధారణ పరిశీలకురాలు నాగలక్ష్మి.ఎస్ సమక్షంలో ఎన్నికల నిర్వహణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలు, ఉత్తర్వుల మేరకు ఎన్టీఆర్ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులకు పరోక్ష ఎన్నికలతో పాటు నూతనంగా ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం విజయవాడలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల సాధారణ పరిశీలకురాలు నాగలక్ష్మి.ఎస్ సమక్షంలో ప్రిసైడింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధ్యక్షతన ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించారు.
తొలుత జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ నూతనంగా ఎన్నికైన 16 మంది జెడ్పీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
* ఏ.కొండూరు – అన్నే కమల కుమారి .. టిడిపి
* చందర్లపాడు – అపర్ణ శాఖమూరి.. టిడిపి
* జి.కొండూరు – వేములకొండ రేవతి చంద్రిక .. టిడిపి
* గంపలగూడెం – కోట పుల్లమ్మ .. టిడిపి
* ఇబ్రహీంపట్నం – రెంటపల్లి వెంకటేశ్వరరావు .. టిడిపి
* జగ్గయ్యపేట – మండవ శ్రీనివాసరావు .. వైయస్సార్సీపి
* కంచికచర్ల – మూరకొండ ఏడుకొండలరావు .. టిడిపి
* మైలవరం – రాంబాబు గుగులోతు .. టిడిపి
* నందిగామ – అమృతమ్మ వేల్పుల.. టిడిపి
* పెనుగంచిప్రోలు – జిల్లేపల్లి సుధీర్ బాబు .. టిడిపి
* రెడ్డిగూడెం – వంకలపాటి అరుణ శేష కుమారి .. టిడిపి
* తిరువూరు – ప్రమీల చాట్ల .. టిడిపి
* వత్సవాయి – రాంబాబు వడ్లమూడి .. టిడిపి
* వీరులపాడు – యిప్పల వెంకట కృష్ణారెడ్డి .. వైయస్సార్సీపి
* విజయవాడ రూరల్ – నూతలపాటి బాలకోటేశ్వరరావు .. బిజెపి
* విస్సన్నపేట – మట్టా సుజాత .. టిడిపి
జెడ్పీ చైర్పర్సన్ పదవికి నిర్వహించిన పరోక్ష ఎన్నికలో గంపలగూడెం జెడ్పీటీసీ సభ్యురాలు కోట పుల్లమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె అభ్యర్థిత్వాన్ని వత్సవాయి జెడ్పీటీసీ సభ్యులు రాంబాబు వడ్లమూడి, చందర్లపాడు జెడ్పీటీసీ సభ్యురాలు అపర్ణ శాఖమూరి బలపరిచారు. అదేవిధంగా జెడ్పీ వైస్ చైర్పర్సన్ పదవికి విజయవాడ రూరల్ జెడ్పీటీసీ సభ్యులు నూతలపాటి బాలకోటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీ సభ్యులు రెంటపల్లి వెంకటేశ్వరరావు, కంచికచర్ల జెడ్పీటీసీ సభ్యులు మూరకొండ ఏడుకొండలరావు బలపరిచారు. ఎన్టీఆర్ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులకు ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి పి.సుశీల, నూతనంగా ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమం అనంతరం విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ జిల్లా పరిషత్ సమావేశ మందిరం నందు నూతనంగా ఎన్నికైన జెడ్పీ చైర్పర్సన్ కోట పుల్లమ్మ, వైస్ చైర్పర్సన్ నూతలపాటి బాలకోటేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యులను కలిసి ప్రత్యేకంగా అభినందించారు.
