– బాలల సంరక్షణ కేంద్రాల్లో మెరుగైన వసతుల కల్పనకు కృషి
– చిన్నారుల పునరావాసం, దత్తత ప్రక్రియను వేగవంతం చేయాలి
– బాల్యవివాహాల నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి
– బాలల సంక్షేమ కమిటీ సమీక్షలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రతి చిన్నారికి సురక్షితమైన బాల్యం, మెరుగైన భవిష్యత్తు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని.. బాలల హక్కుల పరిరక్షణ, సంక్షేమం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా సమష్టి కృషి అవసరమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. బాలల సంరక్షణ కేంద్రాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు, పౌష్టికాహారం, నాణ్యమైన వైద్య సేవలు, విద్యతో పాటు నైపుణ్య శిక్షణ అందించాలని స్పష్టం చేశారు.
శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశ ఆధ్వర్యంలో బాలల సంక్షేమ కమిటీ సమావేశం జరిగింది. జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) చట్టం-2015 ప్రకారం ఉమ్మడి కృష్ణా జిల్లాకు బాలల సంక్షేమ కమిటీని నియమించినట్లు జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ అధికారి షేక్ రుక్సానా సుల్తానా బేగం వివరించారు. అనాథలు, పాక్షిక అనాథలు, నిరాశ్రయులు, నిర్లక్ష్యానికి గురైన బాలలు, ఖైదీల పిల్లలు, మాదకద్రవ్యాల దుర్వినియోగానికి పాల్పడే తల్లిదండ్రుల పిల్లలు, లైంగిక వేధింపులకు గురైన బాలలు, బాల కార్మికులు, అక్రమ రవాణాకు గురైన పిల్లలు, తప్పిపోయిన లేదా ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలలు, దివ్యాంగ బాలలు సహా సంరక్షణ, రక్షణ అవసరమైన బాలబాలికల సంక్షేమం కోసం కమిటీ పనిచేస్తుందని తెలిపారు. జిల్లాలో మొత్తం 16 బాలల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయని వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ అక్రమ రవాణా నుంచి గుర్తించి రక్షించిన బాలబాలికలకు అవసరమైన సంరక్షణ, పునరావాసం కల్పించడంతో పాటు, చట్ట నిబంధనల ప్రకారం అర్హులైన చిన్నారుల దత్తత ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. లైంగిక వేధింపులకు గురైన బాలల విషయంలో సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, అర్హులైన బాధితులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం త్వరితగతిన అందేలా చూడాలని సూచించారు. బాల్యవివాహాల నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ, క్షేత్రస్థాయిలో నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. జిల్లాలోని బాలల సంరక్షణ కేంద్రాల్లో ఉన్న బాలబాలికలకు నాణ్యమైన పౌష్టికాహారం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు, అవసరమైన చికిత్సలు అందించాలన్నారు. వారి భవిష్యత్తుకు ఉపయోగపడేలా విద్యతో పాటు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించాలని సూచించారు. నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలలకు సంబంధించి చట్ట ప్రకారం సత్వర న్యాయ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, అర్హులైన సందర్భాల్లో బెయిల్, తల్లిదండ్రుల బాండ్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ కె. సువార్త మాట్లాడుతూ జిల్లాలో పోక్సో కేసుల బాధిత బాలికల సంరక్షణ, పునరావాసం కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ బాలికల హోమ్ ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ త్వరలోనే అవసరమైన చర్యలు తీసుకుని హోమ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ కె.సువార్త, జిల్లా ప్రొబేషన్ అధికారి సత్యవతి, సి.తేజ, శరత్ బాబు, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఎం.రాజేశ్వరరావు, సీడీపీవోలు భానుమతి, జ్యోత్స్న, దుర్గాప్రసాద్, జాన్సన్, కిరణ్ కుమార్, ప్రకాష్ కుమారి, అరుణ తదితరులు పాల్గొన్నారు.
