– విశేష ఫలితాలిచ్చిన త్రిశూల వ్యూహం, ప్రత్యేక కార్యక్రమాలు
– 2025లో 137 ఎన్‌డీపీఎస్ కేసులు నమోదుకాగా ఈ ఏడాది 52 కేసులు నమోదు
– గంజాయి బ్యాచ్ లేదు, బ్లేడ్ బ్యాచ్ లేదు.. జిల్లాలో మాదకద్రవ్యాలకు చోటులేదు
– వాస్తవ సమాచారమిస్తే నగదు బహుమతితో సత్కారం
– సమష్టి కృషితో విస్త్రతంగా పరీక్షల నిర్వహణ
– మాదకద్రవ్య రహిత జిల్లాపై ప్రజల్లో భరోసా కల్పించేందుకే
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
జీవితాలను ఛిద్రంచేసే మాదకద్రవ్యాల మహమ్మారిపై ఎన్‌టీఆర్ జిల్లాలో ఉక్కుపాదం మోపుతున్నామని.. మాదకద్రవ్యాల నియంత్రణ, నిర్మూలనకు సమగ్ర కార్యాచరణ అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, పోలీసు కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు అన్నారు.
మాదకద్రవ్యాల నియంత్రణపై శుక్రవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నషా ముక్త్ భారత్ అభియాన్, ఎన్‌కార్డ్ జిల్లాస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు, డీసీపీ కేజీవీ సరిత, ఈగల్ డీసీపీ వి.వేణగోపాలరెడ్డి, జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వి.కామరాజుతో పాటు ఈగల్, విద్య, వైద్య ఆరోగ్యం, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, సాంఘిక సంక్షేమం తదితర శాఖల అధికారులు, ఎన్‌జీవోల ప్రతినిధులు పాల్గొన్నారు. డ్రగ్స్‌పై దండయాత్ర 2.0, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు నిర్వహించిన సర్వే ఫలితాలు, ఈగల్ సమన్వయంతో నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు తదితరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా డీసీపీ సరిత వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ సమష్టి కృషి, నిరంతర పర్యవేక్షణ, విస్తృత తనిఖీలు, ప్రజల్లో అవగాహన పెంపు ద్వారా జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని.. ఇవి మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు. 149 హాట్‌స్పాట్‌లపై ప్రత్యేక దృష్టిపెట్టామని, మాదకద్రవ్యాల ఆనవాళ్లు లేకుండా చూస్తున్నామన్నారు. 2025లో 137 ఎన్‌డీపీఎస్ కేసులు నమోదుకాగా ఈ ఏడాది ఇప్పటి వరకు 52 కేసులు నమోదు చేసినట్లు వివరించారు. మాదకద్రవ్యాల రహిత ఎన్‌టీఆర్ జిల్లాను నిర్మించి, యువతకు సురక్షితమైన భవిష్యత్తును అందించడంతో పాటు ప్రజల్లో భరోసా కల్పించడమే లక్ష్యంగా నిరంతరం చర్యలు కొనసాగిస్తామని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. ఇందుకు ప్రతిఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.
శాస్త్రీయ దృక్పథంతో అడుగులు: పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరాబు
శాస్త్రీయ దృక్పథంతో, ఆధునిక విధానాలను అనుసరిస్తూ మాదకద్రవ్యాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ అమలు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం, సరఫరా వ్యవస్థలను గుర్తించేందుకు సమాచార ఆధారిత నిఘా, విస్తృత తనిఖీలు, నిరంతర పర్యవేక్షణతో పాటు సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ సమష్టి కార్యాచరణ ద్వారా మాదకద్రవ్య రహిత జిల్లాను సాధించేందుకు కృషిచేస్తున్నామని స్పష్టం చేశారు. 42 మందిపై పిట్ ఎన్‌డీపీఎస్ కేసులు పెట్టామని.. మాదకద్రవ్య కార్యకలాపాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని, యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు నిరంతరం ప్రత్యేక చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజల్లో భరోసా కల్పించేందుకు విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని.. త్వరలో ఆటో డ్రైవర్లు, గిగ్ వర్కర్లకు కూడా పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలకు జిల్లాలో ఏమాత్రం చోటు లేదని.. గంజాయి బ్యాచ్ లేదు.. బ్లేడ్ బ్యాచ్ లేదని, ఎవరైనా వాస్తవ సమాచారమిస్తే నగదు బహుమతితో సత్కరిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో సురక్షితమైన సామాజిక వాతావరణాన్ని నెలకొల్పడం ప్రతిఒక్కరి బాధ్యత అని, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈగల్ విభాగం, పోలీస్ శాఖతో పాటు వివిధ సమన్వయ శాఖల క్రియాశీల భాగస్వామ్యం, సమష్టి కృషితో జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సరఫరా, వినియోగంపై సమర్థవంతంగా నియంత్రణ సాధించగలిగామని తెలిపారు. శాఖల మధ్య సమన్వయం, సమాచార మార్పిడి, నిరంతర నిఘా, విస్తృత తనిఖీల ద్వారా మాదకద్రవ్యాల కార్యకలాపాలకు కళ్లెం వేయగలిగామని.. భవిష్యత్తులోనూ ఇదే సమన్వయంతో మరింత పటిష్టంగా చర్యలు కొనసాగిస్తూ మాదకద్రవ్య రహిత జిల్లాగా ఎన్‌టీఆర్ జిల్లాను కొనసాగించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. 1972 హెల్ప్‌లైన్‌తో వచ్చే సమాచారాన్ని వేగంగా విశ్లేషించి, సంబంధిత శాఖల సమన్వయంతో తక్షణ చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రపంచ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ రూపొందించిన పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది. సమావేశంలో ఈగల్ సీఐ ఎం.రవీంద్ర, డీఈవో ఎల్.చంద్రకళ, డీఎంహెచ్‌వో ఎ.శ్రావణ బాబు, అరవ రమేష్ (ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్), డాక్టర్ టి.ఎస్.రావు (ఆకర్ష ఫౌండేషన్), మత్తె అనిల్ (హెల్త్ కేర్ అండ్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ) తదితరులు పాల్గొన్నారు.
