– సెన్సార్ల ఆధారిత పరికరంతో కణుతుల గుర్తింపు
– బీపీసీఎల్ ద్వారా రాష్ట్రానికి రూ.56 కోట్ల విలువైన 750 ఐబ్రెస్ట్ పరికరాలు
– త్వరలో నిర్వహించే ఎన్సీడీ సర్వేలో వినియోగం
– దేశంలోనే తొలిసారిగా లక్షలాది మంది మహిళలకు పరీక్షలు
– రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
– ఇప్పటికే మెడ్‌టెక్ ఛాలెంజ్ ద్వారా కృత్రిమ మేధ ఆధారిత వైద్య సేవలకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందన్న మంత్రి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రొమ్ము క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు రాష్ట్రంలో సెన్సార్ల ఆధారంగా పనిచేసే ఆధునిక పరీక్షా విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. త్వరలో non-communicable diseas (ఎన్సీడీ) కార్యక్రమం కింద కొత్తగా జరిగే సర్వేలో భాగంగా ఐబ్రెస్ట్ ఎగ్జామ్ పరికరాలతో మహిళలకు రొమ్ము పరీక్షలు నిర్వహించనున్నారు. ఇటీవల NCD-4.0 సర్వే ముగిసిoది. .దీనికి కొన సాగింపుగా కొత్తగా మళ్ళీ బీపీ, మధుమేహo, ఓరల్, గర్భాశయ, బ్రెస్ట్ స్క్రీనింగ్ జరగబోతుoది .ఈ క్రమంలో దేశంలోనే తొలిసారిగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయిలో లక్షలాది మంది మహిళలకు ఈ ibreast సాంకేతికతతో బ్రెస్ట్ పరీక్షలు నిర్వహించేందుకు వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. గ్రామాల్లోనే మహిళల ఇళ్ల వద్ద లేదా విలేజ్ హెల్త్ క్లినిక్‌లలో ఈ పరీక్షలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
ఐబ్రెస్ట్ ఎగ్జామ్ పరికరాల వినియోగంపై శిక్షణ పొందిన మహిళా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, అధికారులతో మంత్రి చర్చించారు. పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ క్రమంలోనే వైద్యారోగ్య శాఖ ఇప్పటికే మెడ్‌టెక్ ఛాలెంజ్ ద్వారా కృత్రిమ మేధ ఆధారిత వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిందని, ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని పేర్కొన్నారు.
కణుతుల గుర్తింపు మరింత సులభతరం
ప్రస్తుతం వైద్య సిబ్బంది చేతులతో రొమ్మును పరిశీలించి, తాకి కణుతులు ఉన్నాయా లేదా అని గుర్తిస్తున్నారు. ఐబ్రెస్ట్ ఎగ్జామ్ (ఐబీఈ) పరికరాన్ని యూఈ లైఫ్‌సైన్సెస్ సంస్థ అభివృద్ధి చేసింది. ఇది చేతితో పట్టుకునే చిన్న పరికరం. ఇందులో డైనమిక్ కో-ప్లానర్ కెపాసిటివ్ సెన్సార్ సాంకేతికతను ఉపయోగిస్తారు. బ్యాటరీతో పనిచేసే ఈ పరికరాన్ని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. వైర్లెస్ సౌకర్యం కూడా ఉంది. ఈ పరికరాన్ని రొమ్ము పైభాగంలో ఉంచి, అందులోని ప్రత్యేక ఎలక్ట్రానిక్ సెన్సార్ల ద్వారా కణజాలంలో మార్పులను అంచనా వేస్తారు. పరీక్ష పూర్తయిన వెంటనే ప్రత్యేక మొబైల్లో రంగుల రూపంలో డిజిటల్ ఫలితాలు కనిపిస్తాయి. అసాధారణ మార్పులు ఉన్నట్లు గుర్తించిన మహిళలను తదుపరి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రులకు పంపిస్తారు. ఈ విధానం వల్ల మహిళలు ఎలాంటి సంకోచం లేకుండా పరీక్షలు చేయించుకునేందుకు ముందుకొస్తారని, తద్వారా క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించే అవకాశాలు మెరుగుపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ పరికరంతో ఒక పరీక్ష నిర్వహించడానికి సగటున 20 నిమిషాల సమయం పడుతుంది. రొమ్మును నొక్కాల్సిన అవసరం ఉండదు. రేడియేషన్ ఉండదు. శరీరానికి ఎలాంటి గాయం చేయకుండా పరీక్ష నిర్వహించవచ్చు. అయితే ఇది సాధారణ వైద్య పరీక్షకు తోడ్పడే సాంకేతికత మాత్రమే. క్యాన్సర్‌ను నిర్ధారించే వైద్య పరీక్షలకు ప్రత్యామ్నాయం కాదు.
ఐబ్రెస్ట్ ఎగ్జామ్‌లో అసాధారణ మార్పులు కనిపించిన మహిళలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు, వైద్య కళాశాలలకు పంపిస్తారు. అవసరాన్ని బట్టి అల్ట్రాసౌండ్, మామోగ్రఫీ, బయాప్సీ పరీక్షలు నిర్వహిస్తారు. క్యాన్సర్ నిర్ధారణ అయిన వారికి ప్రత్యేక క్యాన్సర్ చికిత్స కేంద్రాల్లో వైద్యం అందిస్తారు.
యూఎస్ఎఫ్డీఏ, సీడీఎస్సీఓ ఆమోదం
ఈ పరికరం వినియోగానికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) ఆమోదం తెలిపింది. భారతదేశంలో కేంద్ర ఔషధ ప్రమాణ నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ) కూడా అనుమతి ఇచ్చింది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ పరికరం పనితీరుపై పరిశోధనలు నిర్వహించారు. ఆయా అధ్యయనాల్లో మహిళల రొమ్ము పరీక్షల ఫలితాల్లో సుమారు 86 శాతం వరకు కచ్చితత్వం నమోదైనట్లు వెల్లడైంది. రిషికేశ్ ఎయిమ్స్‌లో కూడా మహిళలపై అధ్యయనం నిర్వహించారు. ఈ విధానం అమలుకు ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు నేతృత్వంలోని కమిటీ కూడా ఆమోదం తెలిపింది.
రూ.56 కోట్లతో 750 పరికరాలు
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) సంస్థ సామాజిక బాధ్యత నిధుల కింద 750 ఐబ్రెస్ట్ ఎగ్జామ్ పరికరాలను వైద్యారోగ్య శాఖకు అందించేందుకు అంగీకరించింది. ఒక్కో పరికరం విలువ సుమారు రూ.7.5 లక్షలు. మొత్తం 750 పరికరాల వ్యయం సుమారు రూ.56 కోట్లు. ఈ మేరకు బీపీసీఎల్‌తో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఒప్పందం చేసుకున్నారు. బీపీసీఎల్ నిధులతో హెచ్ఎల్ఎల్ ఇన్ఫ్రా టెక్ లిమిటెడ్ (హైట్స్) పరికరాలను కొనుగోలు చేసి వైద్యారోగ్య శాఖకు అందిస్తోంది.
ఇప్పటికే తొలి విడతగా 375 పరికరాలను అందించగా, వాటిని 13 జిల్లాలకు పంపిణీ చేశారు. ఆయా జిల్లాల్లో మహిళా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చారు. రాష్ట్రంలో ఐబ్రెస్ట్ ఎగ్జామ్ పరికరాల పంపిణీని రెండు విడతల్లో చేపడుతున్నారు. తొలి విడతలో 375 పరికరాలను పంపిణీ చేయగా, రెండో విడతలో మిగిలిన 375 పరికరాలను ఇతర జిల్లాలకు పంపిస్తారు. ఆయా జిల్లాల్లోని గ్రామాల జనాభా ఆధారంగా మహిళా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు అందుబాటులో ఉన్న ప్రాంతాలకు పరికరాలను కేటాయిస్తామని అధికారులు మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్‌కు వివరించారు. ఈ పరికరాల ద్వారా ఎనిమిది లక్షల నుంచి పది లక్షల మంది మహిళలకు వయసు ప్రామాణికంగా చేసుకొని పరీక్షలు చేసే అవకాశం ఉంది.
