హెచ్‌ఐవీ నియంత్రణలో ఏపీకి ప్రత్యేక గుర్తింపు

– 28 జిల్లాల్లో 16 జిల్లాలకు ఉన్నత హోదా

– ఆరు జిల్లాలకు ‘సురక్షిత్‌’.. మరో 10 జిల్లాలకు ‘సక్షమ్‌’ గుర్తింపు
– ఏప్రిల్‌ నుంచి అక్టోబరు మధ్య మెరుగైన పనితీరు
– నాకో వెల్లడి
– మరో మూడు జిల్లాలను ‘సురక్షిత్‌’ స్థాయికి తీసుకొచ్చేందుకు కృషి
– మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:

హెచ్‌ఐవీ నియంత్రణలో ఆంధ్రప్రదేశ్‌ సాధించిన పురోగతికి కేంద్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ (నాకో) గురువారం రాష్ట్రంలోని ఆరు జిల్లాలు ‘సురక్షిత్‌’, మరో 10 జిల్లాలు ‘సక్షమ్‌’ హోదా పొందినట్లు ప్రకటించింది. 2026 అక్టోబరు నాటి పనితీరు ఆధారంగా రాష్ట్రంలోని 28 జిల్లాలకు ఇచ్చిన వర్గీకరణలో 16 జిల్లాలు ఉన్నత హోదాలు పొందాయి. మూడు నిర్దేశిత లక్ష్యాలనూ చేరుకున్న చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు ‘సురక్షిత్‌’ హోదా దక్కింది. మూడు లక్ష్యాల్లో రెండింటిని సాధించిన అనకాపల్లి, అనంతపురం, బాపట్ల, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, కర్నూలు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, తిరుపతి, వైఎస్సార్‌ కడప జిల్లాలకు ‘సక్షమ్‌’ గుర్తింపు లభించింది. మిగిలిన 12 జిల్లాలను ‘సంఘర్షశీల’ విభాగంలో చేర్చారు. ఏప్రిల్‌ నుంచి అక్టోబరు మధ్య 16 జిల్లాలు తమ పనితీరును మెరుగుపరచుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు.

మూడు లక్ష్యాల సాధనే ప్రామాణికం

హెచ్‌ఐవీ నియంత్రణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన మూడు 95 లక్ష్యాల ఆధారంగా జిల్లాల పనితీరును అంచనా వేశారు. హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారిలో కనీసం 95 శాతం మందికి తమ వ్యాధి స్థితిపై అవగాహన కల్పించడం మొదటి లక్ష్యం. వ్యాధి నిర్ధారణ అయిన వారిలో కనీసం 95 శాతం మందికి వైరస్‌ నియంత్రణ మందుల చికిత్స (ఏఆర్‌టీ) అందించడం రెండో లక్ష్యం. చికిత్స పొందుతున్న వారిలో కనీసం 95 శాతం మందిలో వైరస్‌ స్థాయిని నియంత్రణలో ఉంచడం మూడో లక్ష్యం.

ఆరు జిల్లాలకు ‘సురక్షిత్‌’ హోదా

మూడు నిర్దేశిత లక్ష్యాలనూ సాధించిన చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలు ఉన్నత స్థాయి గుర్తింపు పొందాయి. మరో రెండు లక్ష్యాలను సాధించిన అనకాపల్లి, అనంతపురం, బాపట్ల, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, కర్నూలు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, తిరుపతి, వైఎస్సార్‌ కడప జిల్లాలు ‘సక్షమ్‌’ హోదా పొందాయి. మిగిలిన 12 జిల్లాలకు ప్రత్యేక పర్యవేక్షణ, మార్గదర్శకత్వం అందిస్తూ లక్ష్యాల సాధనకు చర్యలు చేపడుతున్నారు.

92.7 శాతానికి పెరిగిన వ్యాధి నిర్ధారణ

హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారిలో తమ వ్యాధి స్థితిని తెలుసుకున్న వారి శాతం ఏప్రిల్‌ 2026లో 87.7గా ఉండగా, అక్టోబరు నాటికి 92.7కు పెరిగింది. ప్రస్తుతం ఇది 92.8 శాతంగా ఉంది. సమగ్ర సలహా, పరీక్షా కేంద్రాల ద్వారా ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకు 7,641 మందికి హెచ్‌ఐవీ ఉన్నట్లు గుర్తించారు. వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, పరిశ్రమలు, రేవు ప్రాంతాలు, వైద్య సేవలు తక్కువగా అందుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నారు. రక్తనిధులు, చికిత్స కేంద్రాలు, జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంతో సమన్వయం పెంచి ముందస్తు గుర్తింపు, సకాలంలో చికిత్సకు చర్యలు తీసుకుంటున్నారు.

2.65 లక్షల మందికి చికిత్స

హెచ్‌ఐవీ బాధితులకు వైరస్‌ నియంత్రణ మందుల చికిత్స అందించడంలో రాష్ట్రం పురోగతి సాధించింది. చికిత్స పొందుతున్న వారి శాతం ఏప్రిల్‌ 2026లో 86.3గా ఉండగా, అక్టోబరు నాటికి 92.7కు పెరిగింది. ఈ కాలంలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 2,41,507 నుంచి 2,65,690కు చేరింది. అదనంగా 24,183 మందికి చికిత్స అందుతోంది. చికిత్స పొందుతున్న వారిలో 96.4 శాతం మందికి వైరస్‌ స్థాయి నియంత్రణలో ఉంది.

‘సురక్ష’ డ్యాష్‌బోర్డుతో పర్యవేక్షణ

హెచ్‌ఐవీ పరీక్షలు, వ్యాధి నిర్ధారణ, చికిత్స సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ (ఏపీఎస్‌ఏసీఎస్‌) ‘సురక్ష’ డ్యాష్‌బోర్డును రూపొందించింది. రోజువారీ పరీక్షలు, కొత్తగా గుర్తించిన బాధితులు, వారిని చికిత్స కేంద్రాలకు అనుసంధానించిన వివరాలను జిల్లా, వైద్య కేంద్రాల వారీగా పరిశీలిస్తున్నారు. మందుల వాడకాన్ని మధ్యలో ఆపేసిన వారిని తిరిగి చికిత్సలోకి తీసుకొచ్చేందుకు 2026 జులైలో ‘ఈచ్‌ వన్‌ రీచ్‌ వన్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్షేత్రస్థాయి సిబ్బంది బాధితులను గుర్తించి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా జులై 16 నుంచి నివేదిక సమర్పించిన తేదీ వరకు 3,748 మందిని తిరిగి వైద్య సేవల్లోకి తీసుకొచ్చారు.

2030 నాటికి ఎయిడ్స్‌ నియంత్రణే లక్ష్యం

జిల్లా సమగ్ర హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ వ్యూహం ద్వారా రాష్ట్రంలోని 28 జిల్లాల్లో పర్యవేక్షణను బలోపేతం చేస్తున్నారు. మూడు లక్ష్యాల పురోగతిని నిరంతరం సమీక్షిస్తున్నారు. హెచ్‌ఐవీతో జీవిస్తున్న ప్రతి ఒక్కరికీ వివక్ష లేకుండా సకాలంలో వ్యాధి నిర్ధారణ, నిరంతర చికిత్స, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. ప్రజల భాగస్వామ్యం, సాంకేతిక పరిజ్ఞానం, జిల్లాల సమన్వయంతో 2030 నాటికి ఎయిడ్స్‌ను ప్రజారోగ్య ముప్పుగా లేకుండా చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ వారంలో మరో మూడు జిల్లాలను ‘సురక్షిత్‌’ స్థాయికి తీసుకురావడానికి APSACS దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోందని ప్రాజెక్ట్ డైరెక్టర్ స్మరణ్‌ రాజ్‌ తెలిపారు. ఉత్తమ పనితీరు కనబరిచినందుకు అధికారులను వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్‌ అభినందించారు.